కాంగ్రెస్ దాడిని తట్టుకోలేకపోతున్న కేసీఆర్? అందుకే అసెంబ్లీకి డుమ్మా!

ఏపీలో ప్రతిపక్షానికి బలం లేకపోవడంతో జగన్ చేతులెత్తేశారని విమర్శలు ఎదుర్కొంటున్నారు. కానీ, కేసీఆర్ కు బలం ఉన్నా ఆయన సభకు రాకపోవడంపైనే చర్చ జరుగుతోంది.;

Update: 2025-03-19 13:56 GMT

రెండు తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి. ఏపీలో సమావేశాలు ముగింపు దశకు చేరుకొనగా, తెలంగాణలో బుధవారం బడ్జెట్ ప్రవేశపెట్టారు. అయితే ఎంతో కీలకమైన ఈ సమావేశాలపై రెండు రాష్ట్రాల్లోని ప్రతిపక్షాలు, ప్రధానంగా ప్రతిపక్ష నేతల వైఖరి అంతుచిక్కడం లేదు. ఒకరు హోదా ఇస్తేగాని సభకు రామని చెబితే, మరొకరు నేనొస్తున్నా అంటూ చెప్పి ఒక్కరోజుతో ఆగిపోయారు. దీంతో ఏపీలో జగన్, తెలంగాణలో కేసీఆర్ ఒకే వ్యూహం అమలు చేస్తున్నారా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

ప్రతిపక్ష హోదా లేకపోవడంతో తాను సభకు రానని వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ తేల్చిచెప్పారు. అన్నట్లుగానే బడ్జెట్ సమావేశాల ప్రారంభానికి వచ్చి కేవలం 11 నిమిషాల్లోనే వెళ్లిపోయారు. ఇక తెలంగాణలోనూ ప్రతిపక్ష నేత హోదా ఉన్నా మాజీ సీఎం కేసీఆర్ సభకు రావడం మానేశారు. బడ్జెట్ సమావేశాల ప్రారంభం రోజున సభలో అడుగుపెట్టిన కేసీఆర్, ఈ సెషన్ కు తన డ్యూటీ అయిపోయిందనే భావనకు వచ్చినట్లు చెబుతున్నారు. సమావేశాల ప్రారంభానికి ముందు తాను సభకు వస్తానని, కాంగ్రెస్ పార్టీని ఆడుకుంటానని పెద్ద డైలాగులు వేశారు కేసీఆర్. ప్రజానీకం కూడా కేసీఆర్ రాక కోసం ఆసక్తిగా ఎదురుచూశారు. అయితే యథావిధిగా ఒకరోజు వచ్చిన కేసీఆర్ మళ్లీ అసెంబ్లీ గుమ్మం తొక్కలేదు.

ఏపీలో ప్రతిపక్షానికి బలం లేకపోవడంతో జగన్ చేతులెత్తేశారని విమర్శలు ఎదుర్కొంటున్నారు. కానీ, కేసీఆర్ కు బలం ఉన్నా ఆయన సభకు రాకపోవడంపైనే చర్చ జరుగుతోంది. అధికార పక్షాన్ని ఎదుర్కోలేకే ప్రతిపక్ష నేత కేసీఆర్ సభకు రావడం లేదా? అని కాంగ్రెస్ ప్రశ్నిస్తోంది. మరోవైపు కేసీఆర్ వచ్చినా, రాకపోయినా కాంగ్రెస్ నేతలు మాత్రం బీఆర్ఎస్ ను చెడుగుడు ఆడుతున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

గతం కంటే ఎక్కువగా కాంగ్రెస్ విమర్శలతో విరుచుకుపడుతుండటంతోనే కేసీఆర్ సభకు రావడం లేదా? అనే సందేహాలు రాజకీయ వర్గాల్లోనూ వ్యక్తమవుతున్నాయి. అయితే రాజకీయ పరిశీలకులు మాత్రం సీఎంగా రేవంత్ రెడ్డిని చూడలేకే కేసీఆర్ రావడం లేదనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే బీఆర్ఎస్ వర్గాలు మాత్రం ఈ వాదనను తోసిపుచ్చుతున్నాయి. కేసీఆర్ స్థాయికి తగ్గ నేత అధికార పక్షం లేరని, ఆయన వచ్చి మాట్లాడితే స్థాయి లేని నేతలు అవమానిస్తున్నారని ఆరోపిస్తున్నారు. తెలంగాణ సాధకుడిగా కేసీఆర్ ను గౌరవించకుండా అవమానించడం తట్టుకోలేకే ఆయన సభకు రావడం లేదని చెబుతున్నారు.

అయితే, బీఆర్ఎస్ వాదనను రాజకీయ పరిశీలకులు కొట్టిపడేస్తున్నారు. ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా బీఆర్ఎస్ తెలంగాణ వాదం తప్ప మరొకటి చెప్పుకోలేకపోతోందని, అందుకే సభకు రాలేక ముఖం చాటేస్తున్నారనే చర్చ జరుగుతోంది. ఏపీలో ప్రస్తుత సీఎం చంద్రబాబు ప్రతిపక్షంలో ఉండగా, తగినంత సభ్యులు లేకపోయనా అసెంబ్లీకి వచ్చి తన వాణి వినిపించేవారని, అప్పటి అధికార పక్షం అవమానించినా, ఆయన ప్రతిపక్ష నేతగా తన విధులను పక్కాగా నిర్వహించారని గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు కేసీఆర్ కూడా చంద్రబాబు మాదిరిగా సభకు వచ్చి కాంగ్రెస్ ను ఎదుర్కొంటేనే భవిష్యత్తులో ప్రయోజనం దక్కుతుందని సలహా ఇస్తున్నారు. ఏదిఏమైనా ఏపీలో జగన్ మాదిరిగా కేసీఆర్ అసెంబ్లీకి డుమ్మా కొట్టడంపై భిన్నవాదనలు వినిపిస్తున్నాయి.

Tags:    

Similar News