10 మంది జంపింగుల్లో కేసీఆర్ ను కలిసిన నలుగురు.. ఇదీ లెక్క

ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో కాకుంటే కేంద్రంలో అయినా పదవులు పొందొచ్చని చాలామంది నాయకులు జంప్ చేసే ప్రమాదం ఉంది.

Update: 2024-06-07 10:37 GMT

తెలంగాణలో బీఆర్ఎస్ లోక్ సభ ఎన్నికల్లో, ఏపీలో వైసీపీ శాసన సభ ఎన్నికల్లో ఎన్నడూ ఎరుగని ఓటమిని మూటగట్టుకున్నాయి. వైసీపీ సంగతి ఏమోకానీ.. అసెంబ్లీ, శాసన సభ రెండు ఎన్నికల్లోనూ దారుణ పరాజయాలు పొందిన బీఆర్ఎస్ నుంచి నాయకుల వలస మామూలుగా ఉండేలా లేదు. దీంతోపాటు ఏపీలో చాలాచోట్ల వైసీపీ ప్రధాన ప్రత్యర్థి ప్రాంతీయ పార్టీ టీడీపీ మాత్రమే. తెలంగాణలో బీఆర్ఎస్ కు కాంగ్రెస్, బీజేపీ రెండు జాతీయ పార్టీల నుంచి ముప్పుంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో కాకుంటే కేంద్రంలో అయినా పదవులు పొందొచ్చని చాలామంది నాయకులు జంప్ చేసే ప్రమాదం ఉంది.

ఇప్పటికే ముగ్గురు

తెలంగాణలో నవబంబరులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ 39 స్థానాలకు పరిమితమైన సంగతి తెలిసిందే. అనంతరం ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు దానం నాగేందర్ (ఖైరతాబాద్), తెల్లం వెంకట్రావు (భద్రాచలం), కడియం శ్రీహరి (స్టేషన్ ఘనపూర్) కాంగ్రెస్ లోకి వెళ్లారు. ఇక లోక్ సభ ఎన్నికలూ ముగిసినందున మరో 10 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ కు జెల్ల కొట్టేలా ఉన్నారన్న కథనాలు వినిపిస్తున్నాయి. దీంతో ఆ పార్టీ అధినేత కేసీఆర్ వెంటనే అప్రమత్తమయ్యారు.

ఫాంహౌజ్ కు పిలిపించుకుని..

ఎర్రవల్లిలోని కేసీఆర్ ఫాం హౌజ్ అంటే సాధారణంగా అందరికీ ప్రవేశం ఉండని ప్రదేశం. అలాంటిచోటకు ఏకంగా నలుగురు ఎమ్మెల్యేలను పిలిపించుకున్నారు. వీరిలో మల్లారెడ్డి (మేడ్చల్), ఆయన అల్లుడు రాజశేఖర్ రెడ్డి (మల్కాజిగిరి), బండారి లక్ష్మారెడ్డి (ఉప్పల్), సుధీర్ రెడ్డి (ఎల్బీనగర్) ఉన్నారు.

హైదరాబాద్ వారే టార్గెట్?

కాంగ్రెస్ పార్టీకి గత అసెంబ్లీ ఎన్నికల్లో హైదరాబాద్ లో ఒక్క సీటూ రాలేదు. రాజధానిలో అధికార పార్టీకి ఒక్క ఎమ్మెల్యే కూడా లేరంటే అది అవమానమే. అందుకనే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఆకర్షించే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇది గ్రహించే కేసీఆర్ నలుగురు ఎమ్మెల్యేలను ఫాం హౌజ్ కు పిలిపించుకుని.. వారితో కలిసి ఉన్న ఫొటోను బయటకు లీక్ చేశారు. సహజంగానే అది మీడియాలోకి వచ్చింది. తద్వారా తాము నలుగురమూ బీఆర్ఎస్ లోనే ఉన్నామని చెప్పినట్లు అవుతుంది. ఒకవేళ పార్టీ మారితే.. నిన్న కేసీఆర్ ను కలిసి నేడు కాంగ్రెస్ లో కలుస్తారా? అన్న చెడ్డ పేరు ఎమ్మెల్యేలకు వస్తుంది. గులాబీ బాస్ వ్యూహం ఎలా ఉన్నా.. ఎమ్మెల్యేలు ఏం చేస్తారో చూద్దాం?

Tags:    

Similar News