కక్కుర్తికి పరాకాష్ఠ.. గచ్చిబౌలిలో ఒరిగిన భవనం

తాజాగా గచ్చిబౌలి పరిధిలో అలాంటి ఉదంతమే చోటు చేసుకుంది. మంగళవారం రాత్రి వేళలో.. గచ్చిబౌలి డివిజన్ కొండాపూర్ పరిధిలోని సిద్దిఖ్ నగర్ లోని ఒక భవనం పిల్లర్లు కుంగడంతో ఒక పక్కకు ఒరిగింది.

Update: 2024-11-20 04:23 GMT

కక్కుర్తికి ఒక పద్దతి పాడు ఉంటుంది. కానీ.. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఇలాంటివేమీ కనిపించవు. మరీ.. ముఖ్యంగా హైదరాబాద్ మహానగరంలో గడిచిన పదేళ్లలో పెరిగిపోయిన భూముల ధరల పుణ్యమా అని.. హాస్టళ్లు.. పీజీలు.. కమర్షియల్ గా డిమాండ్ ఉన్న ప్రాంతాల్లో అక్రమ కట్టడాలు ఇష్టారాజ్యంగా కట్టేస్తున్నారు. సెట్ బ్యాక్ ల సంగతి తర్వాత.. కనీస స్థాయిలో కూడా నిబంధనలు పాటించకుండా.. ఎవరికి తోచినట్లుగా వారు భారీ భవనాల్ని కట్టేస్తున్నారు. అదైనా శాస్త్రీయ పద్దతిలో.. సాంకేతిక సాయం తీసుకొని పద్దతిగా కట్టినా సర్లే అనుకోవచ్చు.

అదేమీ లేకుండా.. స్థానిక అధికారులకు అంతో ఇంతో ముట్టజెప్పటం.. స్థానిక నాయకుల్ని సంతృప్తి పరుస్తూ కట్టే నిర్మాణాలు ఏదో ఒక రోజు రచ్చ గ్యారెంటీ. తాజాగా గచ్చిబౌలి పరిధిలో అలాంటి ఉదంతమే చోటు చేసుకుంది. మంగళవారం రాత్రి వేళలో.. గచ్చిబౌలి డివిజన్ కొండాపూర్ పరిధిలోని సిద్దిఖ్ నగర్ లోని ఒక భవనం పిల్లర్లు కుంగడంతో ఒక పక్కకు ఒరిగింది. దీంతో.. స్థానికులు ఆందోళనకు గురయ్యారు. ఈ ఉదంతానికి సంబంధించిన సమాచారాన్ని అందుకున్న జీహెచ్ఎంసీ.. హైడ్రా అధికారులు రంగంలోకి దిగారు.

ఒరిగిన భవనానికి చుట్టుపక్కల ఉన్న భవనాల్లో ఉన్న వారిని ఖాళీ చేయించారు. ఏ క్షణంలో అయినా భవనం కుప్పకూలిపోవచ్చన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. దీనికి కారణం ఏమంటే.. ఒరిగిన భవనం కేవలం 60 గజాల్లో నాలుగు  అంతస్తుల్లో నిర్మించినట్లుగా చెబుతున్నారు. ఈ ఘటనపై జీహెచ్ఎంసీ శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ ఉపేందర్ రెడ్డి రియాక్టు అయ్యారు. ఒరిగిన భవన యజమానికి నోటీసులు జారీ చేశామని.. చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఘటనాస్థలంలోని భవనాన్ని పరిశీలించిన తర్వాత.. నిపుణుల సూచన మేరకు సదరు భవనాన్ని కూల్చేస్తామన్నారు.

భవనం మొత్తాన్ని కూల్చేయాలా? పాక్షికంగా కూల్చాలా? అన్నది తేలుస్తామన్నారు. అంతేకాదు.. సదరు భవనానికి నిర్మాణ అనుమతి ఉందా? లేదా? అన్న విషయాన్ని కూడా పరిశీలిస్తున్నట్లు చెప్పారు. ఘటనాస్థలానికి పోలీసులు.. డీఆర్ఎఫ్ సిబ్బంది చేరుకొని.. చుట్టుపక్కల ఇళ్లల్లోని వారిని ఖాళీ చేయించారు. విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. కక్కుర్తితో ఒరిగిన భవన యజమానికి నోటీసులు.. కేసులు మాత్రమే కాదు.. ఆ ప్రాంతంలో అక్రమ నిర్మాణాలను ఉపేక్షించిన అధికారులందరిపైనా చర్యలు తీసుకోవాల్సి ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరేం జరుగుతుందో చూడాలి.

Tags:    

Similar News