గోపాలపురంలో టఫ్ ఫైట్.. తమ్ముళ్లు మారాల్సిందే..!
ఇలాంటి గోపాలపురం నియోజకవర్గంలో 2019 ఎన్నికల్లో వైసీపీ పాగా వేసింది. తలారి వెంకట్రావు ఇక్కడ విజయం సాధించారు.
ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని కీలకమైన ఎస్సీ నియోజకవర్గం గోపాలపురంలో ఈక్వేషన్ మారిపో యింది. అనూహ్యంగా.. వైసీపీ తీసుకున్న నిర్ణయంతో ఇక్కడ వచ్చే ఎన్నికల్లో పోటీ ఎలా ఉండబోతోందో కళ్లకు కడుతోంది. గతంలో ఇదే నియోజకవర్గం నుంచి టీడీపీతరఫున విజయం దక్కించుకున్న ప్రస్తుత మంత్రి తానేటి వనితకు.. వైసీపీ ఈ టికెట్ కేటాయించింది. దీంతో ఈ నియోజకవర్గం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. వాస్తవానికి ఒకప్పుడు ఈ నియోజకవర్గం.. తెలుగుదేశం పార్టీకి కంచుకోట.
పార్టీ ఆవిర్భావం తర్వాత.. సుదీర్ఘకాలం ఎస్సీ నియోజకవర్గమైన గోపాలపురంలో టీడీపీ పాగా వేసింది. ఈ క్రమంలోనే 1983 నుంచి 1999 వరకు అంటే.. 5 ఎన్నికల్లో టీడీపీ నాన్ స్టాప్‌గా విజయం సాధించింది. ఆ తర్వాత 2004లో ఒక్కసారి ఓడిపోయినా.. 2009, 2014 ఎన్నికల్లో మళ్లీ వరుస విజయాలు దక్కించుకుంది. మొత్తంగా చూస్తే.. టీడీపీ ఆవిర్భవించిన తర్వాత.. ఎస్సీ నియోజకవర్గాల్లో వరుస విజయాలు దక్కించుకున్న నియోజకవర్గం ఇదొక్కటే. ఈ క్రమంలోనే తానేటి వనిత కూడా టీడీపీ టికెట్‌పై గతంలో విజయం దక్కించుకున్నారు.
ఇలాంటి గోపాలపురం నియోజకవర్గంలో 2019 ఎన్నికల్లో వైసీపీ పాగా వేసింది. తలారి వెంకట్రావు ఇక్కడ విజయం సాధించారు. ఇప్పుడు ఈయనను కొవ్వూరుకు పంపించి.. ఇక్కడ మంత్రిని తెచ్చి గోపాలపురానికి కేటాయించారు. మరోవైపు.. టీడీపీ అధినేత చంద్రబాబు.. మద్దిపాటి వెంకట్రాజును ఇక్కడ ఇంచార్జ్‌గా నియమించారు. ఉన్నత విద్యావంతుడు.. అందరినీ కలుపుకొని పోయే స్వభావం ఉన్న వ్యక్తి కావడంతో గెలుపు తథ్యమని చంద్రబాబు, లోకేష్ భావించారు.
అయితే.. మాజీ ఎమ్మెల్యే ముప్పిడి వెంకట్రావు ఈ సీటుపై కన్నేశారు. తనకు కేటాయించాలని ఆయనతో పాటు జడ్పీ మాజీ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజు ఇద్దరూ నియోజకవర్గంలో ఎగస్పార్టీ జెండా ఎగరేశారు. మద్దిపాటి వెంకట్రాజుకు యాంటీగా కొందరు నాయకులను కలుపుకొని ఆయన ఫిర్యాదులు మోస్తున్నారు. అయితే.. ఇప్పుడు మారిన సమీకరణల నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో తమ్ముళ్లు కలిసి ఉంటేనే ఫలితం ఉంటుందని చెబుతున్నారు.
.. లేక పోతే.. గెలిచే సీటు కూడాపోగొట్టుకోవడమే అవుతుందని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. చంద్రబాబు దాదాపు వెంకట్రాజుకే మొగ్గు చూపుతుండడం.. ఆయన కూడా.. అందరిలోనూ.. కలుపుగోలుగా ఉండడంతో తమ్ముళ్ల సహకారం ఇప్పుడు అవసరం. లేకపోతే కంచుకోటలో పార్టీకి ఇబ్బందులు తప్పేలా లేవు.