ఐదేళ్లలో 75 వేల మెడికల్ సీట్లు.. ఐఐటీలకు మెరుగైన సదుపాయాలు
ముఖ్యంగా ఉన్నత చదువులు చదివే విద్యార్థులకు మెరుగైన అవకాశాలు, సదుపాయాలు కల్పించేలా కేటాయింపులు ఉన్నాయంటున్నారు.
కేంద్ర ఆర్థిక బడ్జెట్ లో విద్యారంగానికి ప్రాధాన్యం దక్కింది. ముఖ్యంగా ఉన్నత చదువులు చదివే విద్యార్థులకు మెరుగైన అవకాశాలు, సదుపాయాలు కల్పించేలా కేటాయింపులు ఉన్నాయంటున్నారు. వైద్యవిద్యతోపాటు ఐఐటీలకు పెద్దపీట వేశారు. వచ్చే ఐదేళ్లలో 75 వేల వైద్య విద్యాసీట్లు, 23 ఐఐటీల్లో వంద శాతం సీట్లు పెరగనున్నాయి.
బడ్జెట్ లో విద్యారంగానికి అధిక ప్రాధాన్యం ఇవ్వడంపై హర్షం వ్యక్తమవుతోంది. ఈ ఏడాది నుంచి ఏటా పది వేల చొప్పున ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి రానున్నాయి. ఇలా రానున్న ఐదేళ్లలో 75 వేల సీట్లు పెరగనున్నాయని ఆర్థిక మంత్రి తెలిపారు. అదేవిధంగా దేశవ్యాప్తంగా ఉన్న 23 ఐఐటీల్లో పదేళ్లలో వందశాతం సీట్లు పెంచుతారు. ఇంజనీరింగ్ విద్యలో అత్యున్నత ప్రమాణాలు పాటించే ఐఐటీలకు మెరుగైన సదుపాయాలు కల్పించనున్నట్లు ప్రకటించారు. పట్నా ఐఐటీ విస్తరిస్తారు. మొత్తం ఐఐటీల ద్వారా 6,500 మంది విద్యార్థులకు మేలు జరగనుంది.
ఇక విద్యార్థుల్లో నైపుణ్యాభివృద్ధి, ఉన్నత విద్యలో పెట్టుబడుల కోసం దేశవ్యాప్తంగా ఐదు నేషనల్ సెంటర్స్ ఆఫ్ ఎక్స్ లెన్స్ సెంటర్స్ స్థాపించనున్నారు. ‘మేక్ ఇన్ ఇండియా, మేక్ ఫర్ ద వర్లడ్’కు అవసరమైన నేర్చుకునేందుకు యువతను సన్నద్ధం చేయడానికి ఇవి ఎంతగానో ఉపయోగపడనున్నాయి. సుమారు రూ.500 కోట్లతో సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్స్ ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫర్ ఎడ్యుకేషన్ ను ఏర్పాటు చేయనున్నారు.