ఒకే దేశం.. ఒకే సమయం.. ఇండియన్ స్టాండర్డ్ టైమ్ ప్రామాణీకరణ!
అమెరికా.. భారత దేశం కంటే మూడు రెట్లు పెద్దది. ఈ చివరన న్యూయార్క్ ఉంటే, ఆ చివరన కాలిఫోర్నియా ఉంటుంది.
అమెరికా.. భారత దేశం కంటే మూడు రెట్లు పెద్దది. ఈ చివరన న్యూయార్క్ ఉంటే, ఆ చివరన కాలిఫోర్నియా ఉంటుంది. అందుకని అమెరికాలో ఆరు టైమ్ జోన్లు ఉంటాయి. ఎక్కడో దూరంగా ఉండే అలాస్కా, హవాయీ ద్వీపాలకూ ప్రత్యేక టైమ్ జోన్లు ఉంటాయి.
భారత్ కంటే చాలా పెద్దవైన బ్రెజిల్ లో నాలుగు, ఆస్ట్రేలియాలో మూడు టైమ్ జోన్లు ఉన్నాయి. వాస్తవానికి వీటి మన దేశంతో పోలిస్తే జనాభా చాలా తక్కువ. అయినప్పటికీ వైశాల్యం రీత్యా ప్రత్యేక టైమ్ జోన్లుగా విభజించక తప్పలేదు.
భారత్ విషయానికి వస్తే ఈశాన్యంలో ఉన్న అరుణాచల్ ప్రదేశ్ లో 4.30 గంటలకే తెల్లవారితే .. పశ్చిమంలో ఉన్న ముంబై లో 6 తర్వాతే తెల్లవారుతుంది. దీనికితగ్గట్లే కార్యకలాపాలు మొదలవుతుంటాయి. ఈ నేపథ్యంలోనే 15 ఏళ్ల కిందటే భారత్ లో టైమ్ జోన్ లు మార్చాలనే ప్రతిపాదనలు వచ్చాయి. కానీ, ఇవేమీ ముందుకుసాగలేదు. అయితే, తాజాగా ఒకే దేశం.. ఒకే సమయం.. కొత్త ముసాయిదా నిబంధనలు విడుదల చేసింది కేంద్ర ప్రభుత్వం.
దేశవ్యాప్తంగా ఒకే సమయాన్ని ప్రామాణీకరించే చర్యల్లో భాగంగా ఈ మేరకు ముసాయిదాను విడుదల చేసింది కేంద్రం. దీనిప్రకారం ఇక అన్ని రంగాల్లో భారత ప్రామాణిక సమయం (ఐఎస్‌టీ) వినియోగాన్ని తప్పనిసరి కానుంది.
కేంద్రం రూపొందించిన ముసాయిదా నిబంధనలపై వచ్చే నెల 14లోగా ప్రజలు అభిప్రాయాలను తెలియజేయాల్సి ఉంటుంది. దీనికోసం తూనికలు కొలతలు (భారత ప్రామాణిక సమయం) నిబంధనలు, 2024లో చట్టపరమైన విధివిధానాలు ఏర్పాటు చేశారు. ఇవి గనుక అమల్లోకి వస్తే.. చట్ట, పాలన, వాణిజ్య, ఆర్థిక రంగాలతో పాటు..అధికారిక పత్రాల్లోనూ ఐఎస్టీని తప్పనిసరి చేయనున్నారు. చట్టంలోని ముసాయిదా నిబంధనల ప్రకారం.. ఐఎస్టీ కాకుండా ఇతర టైమ్ జోన్లను ప్రస్తావించడం నిషేధం. అంతరిక్షం, సముద్ర యానం, శాస్త్రీయ పరిశోధన రంగాలకు మినహాయింపు ఇచ్చింది.