ఏం జ‌రిగింది? చంద్ర‌బాబు 'జాబితా' ఏమైంది ..!

తాజాగా ఐదు రాష్ట్రాల‌కు గ‌వ‌ర్న‌ర్‌ల‌ను కేటాయిస్తూ.. కేంద్రం సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది.

Update: 2024-12-25 06:27 GMT

కేంద్రంలో కూట‌మి ప్ర‌భుత్వంలో భాగ‌స్వామిగా ఉన్న టీడీపీ అధినేత చంద్ర‌బాబు కేంద్రంలోని మోడీ స‌ర్కారు చెబుతున్న సూచ‌నలు పాటిస్తున్నారు. కేంద్రం నుంచి వ‌స్తున్న స‌ల‌హాలు కూడా పాటిస్తున్నా రు. కానీ, ఇదేస‌మ‌యంలో చంద్ర‌బాబు సూచ‌న‌లు ఏమ‌వుతున్నాయి. ఆయ‌న కోరుతున్న ప‌ద‌వులు ఎందుకు రావ‌డం లేదు? ఇదీ.. ఇప్పుడు మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న‌. తాజాగా ఐదు రాష్ట్రాల‌కు గ‌వ‌ర్న‌ర్‌ల‌ను కేటాయిస్తూ.. కేంద్రం సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది.

ఈ విష‌యం కొత్త‌కాదు. రెండు మాసాల కింద‌ట నుంచే రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ సాగుతోంది. ఐదు నుంచి 8 రాష్ట్రాల్లో గ‌వ‌ర్న‌ర్ల‌ను మార్చుతున్నార‌ని.. వీరిలో ఇద్ద‌రు తెలుగు వారు ఖ‌చ్చితంగా ఉంటార‌ని అంద‌రూ భావించారు. టీడీపీ త‌ర‌ఫున సీనియ‌ర్లుగా ఉన్న నాయ‌కుల‌కు గ‌వ‌ర్న‌ర్ ప‌ద‌వులు ఇప్పించేందుకు చంద్ర‌బాబు శాయ శ‌క్తులా కృషి చేస్తున్నార‌న్న చ‌ర్చ కూడా తెర‌మీదికి వ‌చ్చింది. ప్ర‌ధాన మీడియాలోనే లీకులు కూడా ఇచ్చారు.

ప్ర‌స్తుతం ఎమ్మెల్సీగా ఉన్న యన‌మ‌ల రామ‌కృష్ణుడును గ‌వ‌ర్న‌ర్‌గా పంపించ‌నున్నార‌న్న‌ది పార్టీ వ‌ర్గాల్లో తీవ్ర చ‌ర్చ‌గా మారింది. అందుకే ఆయ‌న‌కు ఈ ద‌ఫా మంత్రి వ‌ర్గంలో చోటు ద‌క్క‌లేద‌న్న విష‌యం కూడా పార్టీ నేత‌లు చూచాయ‌గా చెప్పుకొచ్చారు. మ‌రో సీనియ‌ర్ నాయ‌కుడు, కేంద్ర మాజీ మంత్రి అశోక్ గ‌జ‌ప‌తి రాజుకు కూడా.. గ‌వ‌ర్న‌ర్ గిరీ ద‌క్కుతుంద‌ని అనుకున్నారు. ఎందుకంటే.. ఈ ఇద్ద‌రి పేర్ల‌ను కూడా.. చంద్ర‌బాబు రెండు మాసాల కింద‌టే సిఫార‌సు చేసిన‌ట్టు స‌మాచారం.

కానీ, అనూహ్యంగా తాజాగా ప్ర‌క‌టించిన ఐదు గ‌వ‌ర్న‌ర్ పోస్టుల్లో విశాఖ‌కు చెందిన ప్ర‌స్తుత మిజోరం గ‌వ‌ర్న ర్ కంభంపాటి హ‌రిబాబును ఒడిశాకు పంపించారు త‌ప్ప‌.. ఇత‌ర తెలుగు వారిని ఎవ‌రినీ ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోలేదు. ఈ విష‌యం టీడీపీలో దావాల‌నంలా వ్యాపించింది. చివ‌రి నిముషంలో ఏమైనా మార్పులు చేశారా? అనేది కూడా ఆస‌క్తిగా మారింది. గ‌తంలో తెలంగాణ‌కు చెందిన‌ మోత్కుప‌ల్లి న‌ర్సింహులు విష‌యంలో కూడా.. చంద్ర‌బాబు సిఫార‌సును ఇదేఎన్డీయే స‌ర్కారు ప‌ట్టించుకోక‌పోవ‌డాన్ని నాయ‌కులు చ‌ర్చించుకుంటున్నారు. ఈ క్ర‌మంలో అస‌లు ఏం జ‌రిగిందో తెలియాల్సి ఉంది.

Tags:    

Similar News