వీడేం పెళ్లి కొడుకు? భోజనాలు బాగోలేవని పెళ్లికి నో
ఉత్తరప్రదేశ్ లో చోటు చేసుకున్న ఈ ఉదంతం విన్న వారంతా షాక్ కు గురవుతున్నారు. ఇలా కూడా చేస్తారా?అని ప్రశ్నిస్తున్న ఉదంతంలోకి వెళితే..
ఈ ఉదంతం గురించి విన్నంతనే.. వీడేం మనిషి? ఇలాంటి పెళ్లి కొడుకులు కూడా ఉంటారా?అన్న భావన కలుగక మానదు. ఉత్తరప్రదేశ్ లో చోటు చేసుకున్న ఈ ఉదంతం విన్న వారంతా షాక్ కు గురవుతున్నారు. ఇలా కూడా చేస్తారా?అని ప్రశ్నిస్తున్న ఉదంతంలోకి వెళితే..
చందౌలీ జిల్లాలోని హమీద్ పూర్ గ్రామానికి చెందిన మెహతాబ్ అనే పెళ్లి కొడుకు పెళ్లిలో భాగంగా పెళ్లి కుమార్తె ఇంటికి వచ్చాడు. మిగిలిన పెళ్లిళ్ల మాదిరే బంధువులు.. స్నేహితులు అతడి వెంట వచ్చారు. మగ పెళ్లి వారు ఇంటికి వచ్చినప్పుడు ఆడ పెళ్లి వారు ఎలా అయితే సాదరంగా స్వాగతం పలకటం.. మర్యాదల విషయంలోనూ జాగ్రత్తలు తీసుకున్నారు. అంతా బాగుందనుకున్న వేళలో అనూహ్య ఘటన ఒకటి చోటు చేసుకుంది.
మగ పెళ్లి వారికి భోజనం ఏర్పాట్లు సరిగా లేవంటూ పెళ్లి కొడుకు బంధువులు పెళ్లి కొడుక్కి కంప్లైంట్ చేశారు. దీంతో.. శివాలెత్తిన అతగాడు.. తాను పెళ్లి చేసుకోనంటూ పెళ్లి పీటల మీద నుంచి వెళ్లిపోవటంతో అక్కడి వారంతా అవాక్కు అయిన పరిస్థితి.
ఇదంతా ఒక ఎత్తు అయితే.. ఈ ఉదంతంలో మరో ట్విస్టు తెలిస్తే నోట మాట రాదంతే. ఆడ పెళ్లివారు తమకు సరిపడా భోజనాలు ఏర్పాటు చేయని కారణాన్ని వేలెత్తి చూపి.. పీటల మీద నుంచి లేచి వెళ్లిపోయిన పెళ్లికొడుకు.. అదే రాత్రి తన బంధువైన మరో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. దీంతో.. పెళ్లి కొడుకు తీరుకు అందరూ ముక్కున వేలేసుకునే పరిస్థితి. దీంతో.. ఒళ్లు మండిన పెళ్లి కుమార్తె తల్లిదండ్రులు పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. పెళ్లి కొడుకు విషయంలో ఎలాంటి చర్యలు తీసుకున్నారన్న వివరాలు బయటకు రావాల్సి ఉంది.