పవన్ కి పెరుగుతున్న మద్దతు... !
87 ఏళ్ల వయసులో ఆయన కాపు ముఖ్యమంత్రిని ఏపీకి చూడాలని అనుకుంటున్నారు.
పవన్ కళ్యాణ్ కి బలమైన కాపు సామాజికవర్గంలో మద్దతు పెరుగుతోంది. నిన్నటిదాకా పవన్ ని ఆయన జనసేనను దూరంగా చూసిన వారు సైతం ఇపుడు పవన్ ఆశాజ్యోతి అని అంటున్నారు. ఇప్పటికే జై కాపుసేన అన్న పేరుతో పవన్ కి పూర్తి స్థాయి మద్దతుని ఇస్తూ మాజీ మంత్రి చేగొండి హరిరామజోగయ్య నిలిచారు. 87 ఏళ్ల వయసులో ఆయన కాపు ముఖ్యమంత్రిని ఏపీకి చూడాలని అనుకుంటున్నారు.
అందుకే ఆయన జనసేన ఎక్కువ సీట్లు కోరాలని కూడా సూచిస్తున్నారు. కాపులకు ఇపుడు కాకపోతే మరెప్పుడు అధికారం అని అటు కాపు సామాజిక వర్గాన్ని ఆయన ఉత్సాహపరుస్తున్నారు. అయితే జోగయ్య కోరినట్లుగా టీడీపీ సీట్లు ఇస్తుందా అన్న సందేహాలు ఉన్నాయి. అలా జరగకపోతే కాపుల ఓట్లు టీడీపీకి బదిలీ కావడం అన్నది జరగదు అని కూడా మరో విశ్లేషణ ఉంది.
ఈ నేపథ్యంలో కాపు జేఏసీ లేటెస్ట్ గా సమావేశమై పవన్ కి మద్దతుగా మాట్లాడడం విశేషం. ఒక విధంగా పవన్ ని ఇబ్బంది పెట్టకుండా ఆయన రాజకీయానికి పూర్తిగా సహకరించాలని కాపు జేఏసీ నేతలు అభిప్రాయపడుతున్నారు.
కాపులు అంతా ఐక్యంగా ఉండాలని జేఏసీ నేతలు కోరుతున్నారు. రాజ్యాధికారం కాపులకు దక్కాలన్న అజెండాతో నిర్వహించిన ఈ సమావేశంలో కాపు నేత ఆకుల రామక్రిష్ణ మాట్లాడుతూ, కాపులను ఎవరైనా నిర్లక్ష్యం చేస్తే ఆ ప్రభుత్వాలు ఇంటికి వెళ్లడం ఖాయమని హెచ్చరించారు. మరి ఇది ఎవరికి హెచ్చరికో అన్నది చూడాలి.
అదే సమయంలో కాపులలో అనైక్యత వల్లనే ఇంతకాలం రాజ్యాధికారం దక్కలేదని అంటున్నారు. మనలో నుంచి ఒక నాయకుడు పార్టీ పెట్టి పోరాడుతూంటే మద్దతు ఇవ్వాల్సినే అని రామక్రిష్ణ అన్న వ్యాఖ్యలు చర్చనీయాంశం అవుతున్నాయి. కాపులు నాయకత్వాన్ని బలపరచకపోయినా ఫరవాలేదు కానీ దెబ్బ తీయవద్దు అని ఆయన కోరారు.
కాపు రిజర్వేషన్లను కూడా జేఏసీ మరోమారు చర్చకు పెడుతోంది. పది శాతం రిజర్వేషన్లు కాపులకు కావాల్సిందే అంటోంది. ఎన్నికల అజెండాలో దానిని పెట్టిన పార్టీకే మద్దతు అని కూడా తీర్మానించింది. కాపులకు రాజ్యాధికారం తో పాటు కాపు సమాజానికి రిజర్వేషన్లు కూడా కావాలని జేఏసీ డిమాండ్ చేస్తోంది.
మొత్తం మీద చూస్తే కాపుల జేఏసీ మద్దతు ఎవరికి అని చెప్పకపోయినా పవన్ కళ్యాణ్ కి మద్దతుగానే ఈ మీటింగ్ సాగింది అని అంటున్నారు. కాపుల రిజర్వేషన్లు ఇచ్చే పార్టీక సపోర్ట్ అని చెబుతున్నా ఏపీలో ఉన్న రాజకీయ పరిణామాల నేపధ్యంలో టీడీపీ జనసేనలకు మద్దతు ఇచ్చేలాగానే సమావేశం సాగింది అని అంటున్నారు రాజ్యాధికారం దక్కాలన్నది ఆలోచన అయినా ముందు కాపులకు ఒక స్థిరమైన రాజకీయ నాయకత్వం సొంత పార్టీ ఉండాలన్న దానికి మెజారిటీ మద్దతుగా నిలుస్తున్నారు. అలా చూసుకుంటే కనుక జనసేనను కాపాడుకోవాలని కూడా వారు భావిస్తున్నారు. అది పవన్ కళ్యాణ్ కి ఎన్నికల వేళ కొండంత అండ అంటున్నారు.