ఐపీఎల్ లో అన్ సోల్డ్.. 28 బంతుల్లో సెంచరీ.. పంత్ రికార్డు బద్దలు
ఉర్విల్ పటేల్ త్రిపురపై తొలి నుంచి చెలరేగి ఆడాడు. తన ఇన్సింగ్స్ లో ఏడు ఫోర్లు, 12 సిక్స్ లు ఉన్నాయి. మొత్తం 113 పరుగులు చేశాడు.
మొన్నటి ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) వేలంలో అదరగొట్టాడు రిషభ్ పంత్. 27 ఏళ్ల ఈ టీమ్ ఇండియా వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ ఎంతటి విధ్వంసకారుడో అందరికీ తెలిసిందే. అందుకే అతడిని రూ.27 కోట్లకు కొనుక్కుంది లక్నో సూపర్ జెయింట్స్. ఐపీఎల్ చరిత్రలో ఎవరికీ దక్కని ధర ఇది. కానీ, కొందరు క్రికెటర్లను మాత్రం ఐపీఎల్ వేలంలో ఎవరూ పట్టించుకోలేదు. అంటే.. వారిని కొనలేదు. ఇలాంటివారి భారత్ కు ఆడినవారూ ఉన్నారు. అన్ సోల్డ్ గా మిగిలిన ఆ ఆటగాళ్లలో ఒకడు రికార్డు బద్దలు కొట్టాడు. అది కూడా రిషభ్ పంత్ రికార్డునే కావడం గమనార్హం. ఇంకో విశేషం ఏమంటే పంత్ లాగానే ఇతడూ వికెట్ కీపర్ బ్యాట్స్ మనే.
ఉర్విల్ పటేల్.. గుజరాత్ కు చెందినవాడు. ప్రస్తుతం జరుగుతున్న సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో తమ రాష్ట్రానికి ఆడుతున్నాడు. బుధవారం మధ్యప్రదేశ్ లో త్రిపుర జట్టుతో జరిగిన మ్యాచ్ లో దుమ్మురేపాడు. 26 ఏళ్ల ఉర్విల్.. కేవలం 28 బంతుల్లోనే సెంచరీ కొట్టాడు. టి20ల్లో అత్యంత వేగంగా సెంచరీ చేసిన రికార్డు పంత్ పేరిట ఉంది. పంత్ 32 బంతుల్లోనే సెంచరీ కొట్టాడు.
7 ఫోర్లు.. 12 సిక్స్ లు
ఉర్విల్ పటేల్ త్రిపురపై తొలి నుంచి చెలరేగి ఆడాడు. తన ఇన్సింగ్స్ లో ఏడు ఫోర్లు, 12 సిక్స్ లు ఉన్నాయి. మొత్తం 113 పరుగులు చేశాడు. కాగా నిరుడు పంజాబ్ లోని చండీగఢ్ లో అరుణాచల్ ప్రదేశ్ లో జరిగిన విజయ్ హజారే ట్రోఫీ మ్యాచ్ లోనూ ఉర్విల్ చెలరేగాడు. 41 బంతుల్లోనే 100 పరుగులు చేశాడు. అయితే, ఐపీఎల్ మెగా వేలంలో ఎవరూ కొనుక్కోలేదు.
ఉర్విల్ ఈ ఏడాదే ఫస్ట్ క్లాస్ (టెస్టులు) క్రికెట్ లోకి వచ్చాడు. 2018 నుంచి లిస్ట్ ఏ (వన్డే ఫార్మాట్) మ్యాచ్ లు ఆడుతున్నాడు. 6 ఫస్ట్ క్లాస్ మ్యాచ్ లలో 158 పరుగులు చేశాడు.