హరీశ్‌రావుకు ఇంకా ఏం పనిలేదా..?

ఆడలేక మద్దెల వోడు అన్నట్లుగా ఉంది ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి.

Update: 2024-10-15 04:50 GMT

ఆడలేక మద్దెల వోడు అన్నట్లుగా ఉంది ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి. అందులోనూ ఆ పార్టీకి చెందిన మాజీ మంత్రి, ట్రబుల్ షూటర్ హరీశ్‌రావు వైఖరి మాత్రం ఇందులో ఏమాత్రం తీసిపోదు. అధికారం కోల్పోయిన తరువాత ఆయన ఏం మాట్లాడుతున్నారో కనీసం ఆయనకైనా అర్థమవుతున్నదా అనే చర్చ ప్రస్తుతం ప్రజల్లో కొనసాగుతోంది. పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు లేని విలువలు ఇప్పుడు ఆయనకు గుర్తుకు వస్తున్నాయా అని బాహాటంగానే ప్రశ్నిస్తున్నారు. ఆ పదేళ్లలో బీఆర్ఎస్ పార్టీ చేసింది ఒప్పు... ఇప్పుడు కాంగ్రెస్ చేసేది తప్పని ఎలా అంటున్నారని విమర్శలు వస్తున్నాయి. రాజకీయాల్లో అధికారం కోసం అడ్డదారులు తొక్కడం కామన్. పదేళ్ల పాటు బీఆర్ఎస్ చేసింది కూడా అదే. కానీ.. ఇప్పుడు హరీశ్ మాట్లాడుతున్న తీరు మాత్రం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం నుంచి బీఆర్ఎస్ పార్టీనే రాష్ట్రాన్ని ఏలింది. కేసీఆర్ ముఖ్యమంత్రిగా.. మంత్రులుగా కేటీఆర్, హరీశ్‌రావు కీలక పాత్ర పోషించారు. ఆ పదేళ్లు వాళ్లు చేసిందే శాసనం.. చెప్పిందే వేదం అన్నట్లుగా పాలన సాగిందనే అభిప్రాయం అందరిలోనూ ఉన్నదే. అందులోనూ ముఖ్యంగా హరీశ్‌రావును పార్టీలో ట్రబుల్ షూటర్‌గా పిలుస్తుంటారు. పార్టీలోకి చేరికలు.. పార్టీ గాడితప్పకుండా చక్కబెడుతూ వచ్చారు. ఇంకొన్ని సందర్భాల్లో కొందరిని బెదిరించి, మరికొందరిని బతిమిలాడి పార్టీలో చేర్చుకున్నారనే ఆరోపణలు ఎన్నో ఉన్నాయి.

బీఆర్ఎస్ అధికారంలో ఉన్నన్ని రోజులు అడ్డదారుల్లోనే నడిచిందనే విమర్శలు చాలా వరకు ఉన్నాయి. అందుకే.. రాష్ట్రంలో ఒక్క బీఆర్ఎస్ పార్టీ తప్పితే మరే పార్టీ ఉండొద్దన్న కోణంలో ఆ పదేళ్లు రాజకీయాలు కొనసాగించారు. అందులోభాగంగానే ఫిరాయింపులను ప్రోత్సహించారు. కాంగ్రెస్ నుంచి గెలుపొందిన సీనియర్లందరినీ తమ పార్టీలో చేర్చుకున్నారు. కొంత మందికి పదవుల ఆశ జూపి చేర్చుకోగా.. మరికొందరిని బ్లాక్ మెయిల్ రాజకీయాలతో చేర్చుకున్నారని అప్పట్లో టాక్ ఉండేది. ఏది ఏమైనా ట్రబుల్ షూటర్ నేతృత్వంలో ఆ ఫిరాయింపులకు ఆజ్యం పోసిందనే చెప్పొచ్చు. అలా కాంగ్రెస్ పార్టీని ఖాళీ చేసినంత పని చేశారు. అందులో ఉమ్మడి రాష్ట్రంలో సీనియర్లుగా వెలుగు వెలిగిన నేతలందరూ బీఆర్ఎస్ గూటికి చేరుకున్నారు. కొందరు సలహాదారులు అయితే.. మరికొందరికి మంత్రి పదవులు లభించాయి. అలా ఒక్క కాంగ్రెస్ నుంచే కాకుండా.. టీడీపీ నుంచి కూడా ఎమ్మెల్యేలను చేర్చుకున్నారు.

మరీ ముఖ్య అంశం ఏంటంటే.. తెలంగాణ రాష్ట్ర ఉద్యమం సమయంలో సినీ నటి విజయశాంతి ఆధ్వర్యంలో తల్లి తెలంగాణ పార్టీ పురుడుపోసుకుంది. తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా ఆమె 2005లో తల్లి తెలంగాణ పార్టీని స్థాపించారు. అనంతరం కేసీఆర్ రెక్వెస్ట్, హరీశ్ ఫోర్స్‌తో ఆ పార్టీని టీఆర్ఎస్‌లో విలీనం చేశారని సమాచారం. మొత్తానికి పార్టీ ఏర్పాటైన నాలుగేళ్లలోనే 2009లో గులాబీ పార్టీలో మెర్జ్ చేశారు. 2009లో మెదక్ పార్లమెంట్ స్థానం నుంచి టీఆర్ఎస్ తరఫున పోటీ చేసి గెలుపొందారు. 2013లో ఆమె పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని టీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఆ తరువాతి పరిణామాల నేపథ్యంలో ఆమె పలు పార్టీలు మారి ప్రస్తుతం కాంగ్రెస్ గూటికి చేరుకున్నారు. ఆ సమయంలో విజయశాంతిని కూడా టీఆర్ఎస్ పార్టీ రాజకీయంగా వాడుకొని ఆ తరువాత పక్కన పెట్టేశారన్న టాక్ నడిచింది.

గత పదేళ్ల పాటు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అనుభవించిన పరిస్థితులు భిన్నం. జాతీయ పార్టీ అయినప్పటికీ.. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చిన పార్టీ అయినప్పటికీ ఇక్కడ పూర్తిగా అస్తిత్వం కోల్పోయింది. అయితే.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సమయంలోనూ కేసీఆర్ కాంగ్రెస్‌కు ఓ మాట ఇచ్చారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తే తమ పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేస్తామని ఆ సమయంలో ఢిల్లీకి వెళ్లి కాంగ్రెస్ అధిష్టానం ముందు తన ప్రపోజల్ పెట్టారు. ఆ తరువాత రాష్ట్రం ఏర్పాటు అయ్యాక దానిని మరుగున పడేశారు. అంతటితో ఆగకుండా.. కాంగ్రెస్ పార్టీని ఖాళీ చేయడమే లక్ష్యంగా రాజకీయాలు నడిపించారు. చివరకు అనుకున్నది సాధించారు. కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచిన ఎమ్మెల్యేలను గులాబీ గూటికి తీసుకురావడంలో సక్సెస్ అయ్యారు. అప్పటి నుంచి ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ వచ్చారు. అలా.. రాష్ట్ర రాజకీయాల్లోనే కాకుండా జిల్లా, మండల, గ్రామ స్థాయిల్లోనూ అవే పాలిటిక్స్ నడిపించారు. ఎక్కడ చూసినా గులాబీ జెండా కనిపించేలా.. ఏ రాజకీయ నాయకుడి మెడలో చూసినా గులాబీ కండువాలే కనిపించేలా చర్యలు తీసుకున్నారు.

కట్‌చేస్తే.. ఇప్పుడు పదేళ్ల తరువాత తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అధికారం చేపట్టి పది నెలలు కావచ్చింది. అయితే.. అధికారంలో ఉన్న పార్టీలోకి చేరికలు అనేటివి సాధారణం. అది బీఆర్ఎస్ నుంచి అయినా.. బీజేపీ నుంచి అయినా.. మరే ఇతర పార్టీ నుంచి అయినా వచ్చి అధికార పార్టీలో చేరిపోతుంటారు. తమ ఉనికిని కాపాడుకునేందుకు.. లేదంటే పదవుల కోసం.. పార్టీల నుంచి జంప్ అవుతూనే ఉంటారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే అదే జరిగింది. కొత్తగా రాష్ట్రంలో అధికారం చేపట్టిన కాంగ్రెస్‌లోకి కూడా వలసలు ప్రారంభమయ్యాయి. అందులోనూ ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ఆసక్తిగా ఉన్నారు. అందులో భాగంగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఇటీవల సమావేశం అయ్యారు. అయితే వారికి కాంగ్రెస్ కండువాలు కప్పినట్లుగా బీఆర్ఎస్ ఆరోపిస్తున్నప్పటికీ.. ఇంకా వారు తమ పార్టీలో చేరలేదని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. సరే.. ఏదేమైనా వారంతా ఇప్పుడు కాంగ్రెస్‌తోనే ఉన్నారనేది వాస్తవం.

అయితే.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు ఇప్పుడు కాంగ్రెస్ గూటికి చేరుతుండడాన్ని బీఆర్ఎస్ పార్టీ తట్టుకోలేకపోతోంది. వారు పార్టీ నుంచి వెళ్లిపోయినప్పటి నుంచి వారిపై ఫిరాయింపుల చట్టం ప్రయోగించాలని పోరుతూనే ఉంది. బీఆర్ఎస్ బీ ఫామ్‌పై గెలిచి కాంగ్రెస్‌లోకి వెళ్లిన వారిపై అనర్హత వేటు వేయాలని ఇప్పటికే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీ స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు. అక్కడి నుంచి రెస్పాన్స్ సరిగా రాకపోవడంతో హైకోర్టును సైతం ఆశ్రయించారు. పార్టీ నుంచి జంప్ అయిన వారిని అనర్హులుగా ప్రకటించాలని విజ్ఞప్తి చేశారు. కానీ.. హైకోర్టు కూడా బంతిని స్పీకర్ చేతిలో పెట్టింది. ఇక మరో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఫిరాయింపు ఎమ్మెల్యేల పట్ల ఏ మేరకు రాద్ధాంతం చేశారో అందరికీ తెలిసిందే.

ఇక.. తాజాగా హరీశ్‌రావు చేసిన కామెంట్స్ కూడా ఇప్పుడు పొలిటికల్ సర్కిల్‌లో చర్చకు దారితీశాయి. బీఆర్ఎస్ పార్టీనే ఫిరాయింపులను ప్రోత్సహించి.. ఇప్పుడు ఫిరాయింపులపై పోరాడడం ఏంటని ప్రజల్లో ప్రశ్నలు వినిపిస్తున్నాయి. బీఆర్ఎస్ పార్టీకి ఏమైనా సిగ్గుందా అన్న కోణంలో ఆగ్రహం కనిపిస్తోంది. అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ ఫిరాయింపులను ప్రోత్సహించకుంటే ఇప్పుడు పోరాడడంలో తప్పు లేదని.. కానీ రాష్ట్రంలో ఫిరాయింపులు అనే పదాన్ని తీసుకొచ్చిందే గులాబీ పార్టీ అయినప్పుడు ఇప్పుడు ఇలా మాట్లాడడంలో ఏమైనా అర్థం ఉందా అన్న వాదన విపిపిస్తోంది.

తాజాగా.. సీనియర్ నేత పోచారం శ్రీనివాసరెడ్డిని ఉద్దేశించి హరీశ్ ఎక్స్ వేదికగా పలు వ్యాఖ్యలు చేశారు. పోచారం ఎమ్మెల్యేగా తమ వెంబడి వచ్చాడని సీఎం రేవంత్, పీసీసీ చీఫ్ మహేశ్ కాంగ్రెస్ నేత రవీందర్‌కు చెప్పారని తెలిపారు. ఈ విషయాన్ని స్వయంగా పోచారమే బహిరంగంగా ప్రకటించారని పేర్కొన్నారు. బీఆర్ఎస్ టికెట్‌పై ఎన్నికైన ఆయన పార్టీ ఫిరాయించారనడానికి ఇంతకంటే నిదర్శనం ఇంకేం కావాలి? అని ప్రశ్నించారు. పార్టీ ఫిరాయించినందుకు వ్యవసాయ శాఖ అడ్వయిజరీ పదవా..? ఇదేనా రాహుల్ ప్రవచిస్తున్న రాజ్యాంగ రక్షణ? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే.. హరీశ్ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలోనే నెటిజన్లు పెద్దఎత్తున ప్రశ్నిస్తున్నారు. అప్పుడు బీఆర్ఎస్ హయాంలో చేసింది ఏంటని ఫైర్ అవుతున్నారు. ‘మీరు చేస్తే రైటు.. కాంగ్రెస్ చేస్తా రాంగా. సిగ్గుందా హరీశ్’ అంటూ నిలదీశారు. ఫిరాయింపులపై పోరాటాలు మాని ప్రజా సమస్యలపై దృష్టి సారించి ప్రధాన ప్రతిపక్ష పాత్రను పోషించాలని సూచించారు. రాష్ట్రంలో బోలెడు సమస్యలు ఉన్నాయని, వాటిని వెలికితీసి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించే విధంగా పోరాడండని కామెంట్స్ వినిపించాయి.

Tags:    

Similar News