మళ్లీ టీఆర్ఎస్.. కండువా మార్చిన కీలక నాయకుడు
ఇదంతా సరే.. ఉన్నట్లుంది 2022లో టీఆర్ఎస్ ను భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)గా మార్చారు. ఇది జరిగింది 2022 అక్టోబరులో దసరా సందర్భంగా
తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్).. 2001 ఏప్రిల్ 27న మొదలైంది ఆ పార్టీ ప్రస్థానం.. అప్పటికి ఉమ్మడి ఏపీ సీఎం చంద్రబాబు, ప్రతిపక్ష నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి. అత్యంత బలమైన ప్రజాకర్షక నేతలు వారిద్దరు. అలాంటి సమయంలో కనీసం ఎవరూ ఊహించని విధంగా టీఆర్ఎస్ ను స్థాపించారు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు. ఎన్నో అవమానాలు, మరెన్నో కష్టాలు, మరెన్నో ఇబ్బందులను ఎదుర్కొని టీఆర్ఎస్ ను నిలుపుకొన్నారు. అంతేకాదు.. 2014 నాటికి కేవలం పదమూడేళ్లలో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం వంటి బంగారు కలను సాకారం చేశారు. ఆపై ముఖ్యమంత్రిగా పదేళ్లు కొనసాగారు. ఇదంతా సరే.. ఉన్నట్లుంది 2022లో టీఆర్ఎస్ ను భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)గా మార్చారు. ఇది జరిగింది 2022 అక్టోబరులో దసరా సందర్భంగా..
అప్పటినుంచి కష్టాలే..
బీఆర్ఎస్ గా మారినప్పటి నుంచి టీఆర్ఎస్ కు ప్లస్ లు కంటే మైనస్ లే ఎక్కువని చెప్పాలి. మునుగోడు ఉప ఎన్నికల్లో గెలవడం తప్ప (అది కూడా పదివేల ఆధిక్యంతో) మిగతా అన్ని అంశాలూ ఎదురుతిరిగాయి. నిరుద్యోగుల ఆత్మహత్యలు, మేడిగడ్డ కుంగడం సహా ఎన్నో అపశకునాలు. చివరకు అసెంబ్లీ ఎన్నికల్లో పరాభవం వరకు వచ్చింది. ఆ ఓటమి నుంచి తేరుకోకముందే పార్లమెంటు ఎన్నికల్లో ఒక్క సీటూ గెలవలేదు. టీఆర్ఎస్ గా ఉన్నప్పుడు 9 స్థానాలు గెలిచిన ఆ పార్టీ
బీఆర్ఎస్ గా మారాక సున్నా ఎంపీ సీట్లకు పరిమితం అయింది. ఇవన్నీ ఇలా ఉంటే.. ఇప్పటికే పది మంది ఎమ్మెల్యేలు కారు దిగి హస్తం గూటికి చేరారు. ఆరుగురు ఎమ్మెల్సీలూ వెళ్లిపోయారు. కేసీఆర్ కుమార్తె కవిత ఢిల్లీ మద్యం స్కాంలో జైలుపాలయ్యారు. ప్రత్యేక రాష్ట్రం సాధించిన ఒక పార్టీ పదేళ్లలో ఇలాంటి దుర్భర పరిస్థితి ఎదుర్కొంటుందని ఎవరూ ఊహించి ఉండరు.
పార్టీ పేరు మార్చాలా?
అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నగరాల్లో మంచి ఫలితాలు రాబట్టింది. గ్రామీణ ప్రాంతాల్లో పూర్తిగా చేతులెత్తేసింది. దీనికి కారణం.. తెలంగాణ రాష్ట్ర సమితి అన్న పేరులోని కనెక్టివిటీ భారత రాష్ట్ర సమితిలో లేకపోవడమేననే అభిప్రాయం వినిపించింది. ఓటమికి కారణాలు అనేకం ఉన్నా.. పార్టీ పేరు మార్పే ప్రధాన కారణమని అసెంబ్లీ ఎన్నికల తర్వాత పలువురు నేతలు అభిప్రాయపడ్డారు. బీఆర్ఎస్ అనగానే తెలంగాణతో ఉన్న పేగు బంధం తెగిందని.. టీఆర్ఎస్ పేరుతోనే మరోసారి ఎన్నికలకు వెళ్లి ఉంటే గెలిచేవారమనే వ్యాఖ్యలు వినిపించాయి. తెలంగాణ రాష్ట్ర సమితిగా పేరు మార్చాలంటూ అసెంబ్లీ ఎన్నికల వెంటనే డిమాండ్లు వచ్చాయి.
బలమైన శక్తిగా నిలబడాలంటే ఇది తప్పనిసరి అని స్పష్టం చేశారు.
హరీశ్ కండువా వెనుక మర్మమేమి..?
అనేక ఇబ్బందులు, పార్టీ కేడర్ అభిప్రాయాల మేరకు ఆలోచనలో పడ్డారో ఏమో కానీ.. మాజీ మంత్రి హరీశ్ రావు టీఆర్ఎస్ కండువాతో కనిపించారు. పార్టీ పేరును మార్చాలనే ఆలోచనతో అధిష్ఠానం ఉందని.. దానిపై సంకేతాలు ఇచ్చేందుకే హరీశ్ టీఆర్ఎస్ కండువా వేసుకున్నారనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సమయానికి బీఆర్ఎస్ కండువాలు లేకపోవడంతోనే టీఆర్ఎస్ కండువా వేసుకున్నారని కొందరు అంటున్నారు.
కొసమెరుపు: హరీశ్ రావు గులాబీ కండువాతో కనిపించింది పటాన్ చెరు కార్యకర్తల సమావేశంలో.. ఇటీవలే ఇక్కడి బీఆర్ఎస్ ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి కాంగ్రెస్ లో చేరారు. దీంతో కార్యకర్తల సమావేశం నిర్వహించి ధైర్యం చెప్పాలని పార్టీ భావించింది. ఈ మేరకు నిర్వహించిన మీటింగ్ లో హరీశ్ టీఆర్ఎస్ కండువాతో కనిపించడం గమనార్హం.