హకీంపేట స్పోర్ట్స్ స్కూల్లో కీచకుడు?

స్పోర్ట్స్ స్కూల్ హాస్టల్లో ఉంటూ ప్రాక్టీస్ చేస్తున్న బాలికలపై ఆయన లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడని కొందరు బాలికల ఆరోపించారు.

Update: 2023-08-14 04:29 GMT

భారత మహిళా రెజ్లర్లపై భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆరోపణలు రావడం దేశవ్యాప్తంగా రాజకీయ దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే బ్రిజ్ కు వ్యతిరేకంగా రెజ్లర్లు ఆందోళన బాట పట్టడంతో చివరికి ఆయనపై కేసు నమోదు చేశారు. ఇంకా ఆ వ్యవహారం సద్దుమణగక ముందే తాజాగా హైదరాబాద్ లోని హకీంపేట స్పోర్ట్స్ క్లబ్ లో ఓఎస్డీ హరికృష్ణపై లైంగిక వేధింపుల ఆరోపణలు రావడం ఇరు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపింది.

స్పోర్ట్స్ స్కూల్ హాస్టల్లో ఉంటూ ప్రాక్టీస్ చేస్తున్న బాలికలపై ఆయన లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడని కొందరు బాలికల ఆరోపించారు. అర్ధరాత్రిపూట హాస్టల్లోని తమ గదులలోకి రావడం నిషిద్ధమైనప్పటికీ హరికృష్ణ తమ గదుల్లోకి వస్తున్నారని, లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారని బాలికలు కొందరు ఆరోపించారు. హాస్టల్ ఆవరణలోని గెస్ట్ హౌస్ లోనే హరికృష్ణ మకాం పెట్టారని, ఆటవిడుపు అంటూ సాయంత్రం పూట కొందరు బాలికలను బయటకు తీసుకువెళ్లి అక్కడ లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు.

అర్ధరాత్రి తమ గదిలోకి వచ్చి అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు. హరికృష్ణకు ఒక మహిళ ఉద్యోగితో పాటు ముగ్గురు అధికారులు సహకరిస్తున్నారని చిన్నారులు ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే ఈ వ్యవహారం మీడియాలో హైలైట్ కావడంతో ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరుతూ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కు ఎమ్మెల్సీ కవిత ట్వీట్ చేశారు.

దీంతో, వెంటనే స్పందించిన శ్రీనివాస్ గౌడ్....హరికృష్ణను సస్పెండ్ చేశారు. అయితే సెలక్షన్ సమయంలో ఇలాంటి ఆరోపణలు సహజమని, స్కూల్ కు వస్తున్న మంచి పేరు చూసి ఓర్వలేక తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని హరికృష్ణ చెబుతున్నారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరపాలని ప్రభుత్వాన్ని హరికృష్ణ కోరడం విశేషం.

Tags:    

Similar News