హీట్ వార్నింగ్: ఫిబ్రవరి 2 వారం నుంచి మండే ఎండలు!
సంక్రాంతి సమయానికి చలితో ఉక్కిరిబిక్కిరి కావాల్సిన వేళలో అందుకు భిన్నంగా పగటి వేళలో చురుకు పుట్టించే సూరీడిని తెలుగు రాష్ట్రాల ప్రజలు ఫీల్ అయ్యారు.
సంక్రాంతి సమయానికి చలితో ఉక్కిరిబిక్కిరి కావాల్సిన వేళలో అందుకు భిన్నంగా పగటి వేళలో చురుకు పుట్టించే సూరీడిని తెలుగు రాష్ట్రాల ప్రజలు ఫీల్ అయ్యారు. ఫిబ్రవరి మొదటి వారంలోనే గరిష్ఠ ఉష్ణోగ్రతలు రికార్డుల్ని క్రియేట్ చేస్తున్నాయి. దీంతో. . ఉదయం 11 గంటల నుంచే చురుకు పుట్టించే ఎండలకు ఇట్టే అలిసిపోతున్న పరిస్థితి. ఇప్పుడే ఇలా ఉంటే.. ఈ వేసవి ఇంకెలా ఉంటుందన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
ఇదే విషయాన్ని వాతావరణ సంస్థ తాజాగా వెల్లడిస్తోంది. గత ఏడాది మాదిరే ఈ వేసవి కూడా హీట్ సమ్మర్ గా నిలుస్తుందన్న అంచనాల్ని వ్యక్తం చేస్తున్నారు. ఈసారి శీతాకాలంలో చలి తీవ్రత తగ్గటం.. ఫిబ్రవరిలో అసాధారణ వేడి వాతావరణం నెలకొందన్న విషయాన్ని చెబుతున్నారు. ఫిబ్రవరి రెండో వారం నుంచి రాత్రి ఉష్ణోగ్రతలు పెరుగుతాయని భావిస్తోంది.
ఏపీలోని పలు ప్రాంతాల్లోనూ.. తెలంగాణ రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతల్లో 3 నుంచి 6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కావటం గమనార్హం. 2010 - 2024 మధ్య పదేళ్లు వేడి సంవత్సరాలుగా రికార్డుల్ని క్రియేట్చేశాయి. 2015-24 మధ్య దశాబ్దాం అత్యంత వేడి దశాబ్దంగా నిలిచింది. సగటున ఒక డిగ్రీ ఉష్ణోగ్రత పెరిగితే మరణాల సంఖ్య 0.2 శాతం నుంచి 5.5 శాతం పెరిగే ప్రమాదం ఉందన్న విషయాన్ని పరిశోధకులు చెబుతున్నారు. పెరుగుతున్న వేడి నేపథ్యంలో రానున్న రోజుల్లో వడగాలుల తీవ్రత అధికంగా ఉంటుందని హెచ్చరిస్తున్నారు. దీంతో.. ఈ ఏడాది మరో హీట్ సమ్మర్ ఖాయమని స్పష్టం చేస్తున్నారు.
ఏడాదికేడాదికి పెరుగుతున్న కాలుష్యం భూతాపాన్ని పెంచుతోందని చెబుతున్నారు. గ్రీన్ హౌస్ వాయువుల పరభావం రికార్డు స్థాయిలో వేడి పెరగటానికి కారణమవుతుందని పేర్కొంటున్నారు. బొగ్గు ఆధారిత విద్యుత్ వినియోగం పెరగటం కూడా దీనికి ఒక కారణంగా చెబుతున్నారు. సాధారణంగా సముద్రాలు 30 శాతం కార్బన్ డయాక్సైడ్ ను గ్రహిస్తాయని.. సముద్రాలు కలుషితం కావటంతో ఈ ప్రక్రియ సరిగా జరగట్లేదని పేర్కొంటున్నారు.