లవ్ జిహాద్ కేసులకు కొత్త శిక్ష.. అసోం సీఎం సంచలనం

ఇంతకూ ఆయన చెబుతున్న శిక్ష ఏమిటో తెలుసా? లవ్ జిహాద్ కేసుల్లో జీవిత ఖైదు విధించేలా చట్టాన్ని మారుస్తామంటున్నారు.

Update: 2024-08-05 05:00 GMT

సంచలన వ్యాఖ్యలకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తూ.. తరచూ వార్తల్లో ఉండే బీజేపీ ముఖ్యమంత్రుల జాబితాలో అసోం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ మొదటి వరుసలో నిలుస్తుంటారు. తాజాగా అలాంటి సంచలన వ్యాఖ్య చేశారు. లవ్ జిహాద్ కేసులకు తీవ్రమైన శిక్ష విధించే చట్టాన్ని తీసుకురాబోతున్నామని.. త్వరలోనే తమ రాష్ట్ర అసెంబ్లీలో బిల్లు రూపంలో ప్రవేశ పెడుతామని చెప్పారు.

ఇంతకూ ఆయన చెబుతున్న శిక్ష ఏమిటో తెలుసా? లవ్ జిహాద్ కేసుల్లో జీవిత ఖైదు విధించేలా చట్టాన్ని మారుస్తామంటున్నారు. ఇక్కడితో ఆగని ఆయన.. అసోం ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి కూడా కొత్త పాలసీ తీసుకొస్తామని.. దీని ప్రకారం అసోంలోపుట్టిన వ్యక్తులు మాత్రమే ప్రభుత్వ ఉద్యోగాలకు అర్హులుగా పరిగణించబడతారన్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో స్థానిక అసోం వాసులకు ప్రాధాన్యత ఇవ్వనునట్లు పేర్కొన్నారు. ఎన్నికలకు ముందు లక్ష మందికి ఉద్యోగాలు కల్పిస్తామన్న హామీని ఆయన గుర్తు చేస్తూ.. త్వరలోనే అందుకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు పేర్కొన్నారు.

గౌహతిలో జరుగుతున్న బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో పాల్గొన్న ఆయన ఈ సంచలన వ్యాఖ్యలు చేసి.. వార్తల్లో నిలిచారు. అంతేకాదు.. ముస్లిం - హిందువుల మధ్య భూముల విక్రయానికి సంబంధించి కూడా తమ ప్రభుత్వం కీలక నిర్ణయాన్ని తీసుకుందన్న ఆయన.. త్వరలోనే అసోంలో వీఐపీ కల్చర్ కు అంతం పలకనున్నట్లు పేర్కొన్నారు. అందరిని సామాన్యులుగానే పరిగణించాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ముందుకు వెళుతుందన్నారు.

ఈ సందర్భంగా మరో ఆసక్తికర అంశాన్ని వెల్లడించారు. ప్రభుత్వ కార్యక్రమాల్లో వెజ్ ఫుడ్ మాత్రమే వడ్డిస్తారని.. నాన్ వెజ్ ను వడ్డించరని స్పష్టం చేశారు. దారిద్ర్య రేఖ దిగువన ఉండే యువకులు పరిశ్రమలు స్థాపించాలనుకుంటే.. అలాంటి వారికి రూ.2లక్షలు ఇచ్చే పథకాన్ని షురూ చేయనున్నట్లు చెప్పారు. మొత్తానికి సంచలన నిర్ణయాలే కాదు.. కొత్త తరహా అభివ్రద్ధికి తెర తీసే కార్యక్రమాల దిశగా అడుగులు వేస్తున్న విషయాన్ని తన మాటలతో హేమంత బిస్వా స్పష్టం చేస్తున్నట్లు చెప్పాలి.

Tags:    

Similar News