కురుబ ప్లస్ రెడ్డి...బాలయ్యకి ఘాటు రాజకీయ మసాలా..?
ఇక బాలయ్య మీద గట్టిగానే రాజకీయ యుద్ధం చేయడానికి వైసీపీ రెడీగా ఉంది అని అంటున్నారు.
హిందూపురంలో నందమూరి నట సింహం కం ఎమ్మెల్యే అయిన బాలయ్యను ఓడించాలని కసి మీద వైసీపీ ఉంది. దాని కోసం మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీద బాధ్యతలు మోపారు. ఆయన గత కొద్ది రోజులుగా హిందూపురంలో మకాం వేసి మొత్తానికి ఒక విధంగా సక్సెస్ అయ్యారు. వైసీపీలో ఉన్న నాలుగు వర్గాలను ఏకం చేయడంలో పెద్దిరెడ్డి విజయవంతం అయ్యారు.
ఇక ఇపుడు అసలైన రాజకీయానికి తెర తీశారు. హిందూపురంలో దీపికను తెర మీదకు తెచ్చారు. ఆమెను అంతా కలసి గెలిపించాలని పిలుపు ఇచ్చారు. హిందూపురంలో ఈసారి టీడీపీ కోటను బద్ధలు కొడతామని పెద్దిరెడ్డి అంటున్నారు. ఇక్కడ దీపికను వైసీపీ అభ్యర్ధిగా నిలపడం వెనక చాలా రీజన్స్ ఉన్నాయని అంటున్నారు.
ఫస్ట్ గా చూస్తే హిందూపురం నుంచి ఎవరూ మహిళా అభ్యర్ధులకు టికెట్ ఇవ్వలేదు. దాంతో లేడీ సెంటిమెంట్ ని పండించాలన్నది వైసీపీ ఎత్తుగడ. దాంతో పాటు సామాజిక కోణం కూడా ఉంది. దీపిక కురుబ సామాజికవర్గానికి చెందిన వారు. ఆ సామాజికవర్గం ఓట్లు నియోజకవర్గంలో ఎక్కువగా ఉన్నాయి.
ఇక అంగబలం అర్ధం బలం కూడా తోడు అవుతోంది. ఆమె భర్త రెడ్డి సామాజికవర్గానికి చెందిన వారు. దాంతో వైసీపీ వ్యూహాత్మకంగా ఆమె పేరుని తెర మీదకు తెచ్చింది అని అంటున్నారు. మరో వైపు చూస్తే హిందూపురంలో ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో వైసీపీ విజయం సాధించడం తో ఆ పార్టీ ధీమా పెరిగిపోతోంది.
బాలయ్య ఎమ్మెల్యేగా ఉన్నా సినిమాలు షూటింగ్స్ తో పెద్దగా ఉండరని, ఆయన ఇంచార్జిగా పెట్టిన వారు సరిగ్గా వ్యవహరించరని జనంలో అసంతృప్తి ఉంది. దాంతో దానిని క్యాష్ చేసుకోవడానికి వైసీపీ చూస్తోంది. ఇక బాలయ్య మీద గట్టిగానే రాజకీయ యుద్ధం చేయడానికి వైసీపీ రెడీగా ఉంది అని అంటున్నారు.
దీనికి పెద్దిరెడ్డి మీడియాతో చెప్పిన మాటలే నిదర్శనం అంటున్నారు. ఎన్నికల ప్రచారానికి ఏకంగా జగన్ ఒకటికి మూడు సార్లు హిందూపురం వస్తారని పెద్దిరెడ్డి అంటున్నారు. అంటే ఈ సీటుని వైసీపీ ఎంతటి ప్రెస్టేజ్ ఇష్యూగా తీసుకుందో అర్ధం చేసుకోవాలని అంటున్నారు.
మొత్తానికి వైసీపీ హై కమాండ్ కి గతంలో బాలయ్య మీద కొంత సాఫ్ట్ కార్నర్ ఉండేదని, ఇపుడు మాత్రం ఆయనను ఓడించి తీరాలని గట్టి పట్టుదలతో ఉందని అంటున్నారు. ఈ పరిణామాల నేపధ్యం నుంచి చూసినపుడు మాత్రం హిందూపురాన్ని ఈసారి కొట్టేయాలని వైసీపీ పట్టుదలగా ఉంది. దాని కోసం రాజకీయ మసాలా గట్టిగానే దట్టించి వదులుతోంది. మరి బాలయ్య టీడీపీ కౌంటర్ పాలిటిక్స్ ఎలా ఉంటుందో రాజకీయ వెండి తెర మీద వేచి చూడాల్సిందే.