భారత్ లో పెరుగుతున్న హెచ్ఎంపీవీ కేసులు.. డబ్ల్యూహెచ్ఓ కీలక వ్యాఖ్యలు!
ఇందులో భాగంగా... ప్రారంభంలో కర్ణాటక, తమిళనాడుల్లో రెండేసి చొప్పున కేసులు నమోదైనట్లు నివేదించగా.. అనంతరం గుజరాత్ లో ఓ కేసు నమోదైనట్లు వెల్లడించారు!
చైనాలో తీవ్ర కలకలం సృష్టిస్తోన్న హ్యూమన్ మెటాన్యుమో వైరస్ (హెచ్ఎంపీవీ) భారత్ లోనూ తీవ్ర కలవరం కలిగిస్తున్న సంగతి తెలిసిందే. ఈ వైరస్ పై చాలా మంది తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తుండగా.. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఇది కొత్తది కాదని, దీని ఎప్పుడో గుర్తించారని కేంద్రం చెబుతుంది. ఈ సమయంలో డబ్ల్యూహెచ్ఓ స్పందించింది.
అవును... చైనాలో తీవ్ర కలకలం రేపుతున్న హెచ్ఎంపీవీ వైరస్ కేసులు భారత్ లోనూ పెరుగుతుండటంతో ప్రజల్లో ఆందోళన పెరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో భారత్ లో ఇప్పటికే ఎనిమిది కేసులు నమోదైనట్లు చెబుతున్నారు. అయితే... దీనిపై ఆందోళన అవసరం లేదని, ఇదేమీ కొత్త వైరస్ కాదని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు.
ఈ సందర్భంగా స్పందించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ)... ఈ తరహా వైరస్ లు తరచుగా శీతాకాలంలో సంభవిస్తాయని.. ఈ హెచ్ఎంపీవీ వైరస్ కొత్తదేమీ కాదని, దీన్ని 2001 లోనే గుర్తించామని తెలిపింది. దీని ప్రభావం వల్ల శ్వాసకోశ ఇబ్బంది, సాధారణ జలుబు వంటి లక్షణాలు ఉండొచ్చని తెలిపింది.
అందువల్ల ఈ వైరస్ పట్ల ప్రజలు అంతగా భాయాందోళన చెందవద్దని.. ఇది సాధారణ వైరస్ మాత్రమే అని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) వెల్లడించింది!
మరోపక్క ఇదే విషయంపై స్పందించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) మాజీ చీఫ్ సైంటిస్ట్ డాక్టర్ సౌమ్య స్వామినాథన్ ఎక్స్ లో పోస్ట్ పెట్టారు. ఇందులో భాగంగ.. ఈ వైరస్ గురించి భయపడాల్సిన అవసరం లేదని.. ఇది శ్వాసకోశ ఇన్ ఫెక్షన్లకు కారణమయ్యే వైరస్ అని.. ఇది చాలా వరకూ తేలికపాటిదేనని వెల్లడించారు.
దీనికోసం జలుబు చేసినప్పుడు తీసుకునే సాధారణ జాగ్రత్తలు తీసుకోవాలని. ఇంద్లో భాగంగా.. మాస్క్ ధరించడం, చేతులు శుభ్రం చేసుకోవడం, జనాలకు కాస్త దూరంగా ఉండటం చేయాలి.. మరీ లక్షణాలు తీవ్రంగా ఉంటే అప్పుడు వైద్యుడిని సంప్రదించాలని ఆమె ఎక్స్ లో రాసుకొచ్చారు! ఈ సందర్భంగా ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) డేటాను ఉటంకించారు.
భారత్ లో పెరుగుతున్న కేసుల సంఖ్య!:
ఈ నెల 7వ తేదీ నుంచి భారత్ లో ఈ హెచ్ఎంపీవీ వైరస్ కేసులు నమోదైన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... ప్రారంభంలో కర్ణాటక, తమిళనాడుల్లో రెండేసి చొప్పున కేసులు నమోదైనట్లు నివేదించగా.. అనంతరం గుజరాత్ లో ఓ కేసు నమోదైనట్లు వెల్లడించారు!
అనంతరం.. మహారాష్ట్రలోని నాగ్ పూర్ లో మరో రెండు కేసులు నమోదవ్వగా.. ముంబైలో మరో కేసు నమోదైనట్లు చెబుతున్నారు. దీంతో... మహారాష్ట్రలోనే మొత్తం మూడు కేసులు నమోదవ్వగా.. దేశం మొత్తం మీద ఎనిమిది కేసులు నమోదయ్యాయని అంటున్నారు.