భారత్ లో చైనా కొత్త వైరస్ ఎంట్రీ... 8 నెలల చిన్నారే తొలి కేసు!

చైనాలో హెచ్.ఎం.పీ.వీ. వైరస్ కలకలం సృష్టిస్తోన్న సంగతి తెలిసిందే. దీంతో... మరోసారి లాక్ డౌన్ తప్పదా అనే చర్చ మొదలైంది.

Update: 2025-01-06 05:55 GMT

గత కొన్ని రోజులుగా చైనా లోని కొత్త వైరస్ హ్యూమన్ మెటాఫ్ నిమో వైరస్ (హెచ్.ఎం.పీ.వీ.) గురించి చర్చ తీవ్రంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆ దేశంలో ఈ వైరస్ ప్రభావంతో ఆసుపత్రులు తీవ్ర రద్దీగా మారిపోయాయంటూ సోషల్ మీడియాలో కథనాలు వైరల్ అవుతున్నాయి. ఈ సమయంలో భారత్ లో ఆ వైరస్ తో తొలి కేసు నమోదయ్యిందని తెలుస్తోంది.

అవును.. చైనాలో హెచ్.ఎం.పీ.వీ. వైరస్ కలకలం సృష్టిస్తోన్న సంగతి తెలిసిందే. దీంతో... మరోసారి లాక్ డౌన్ తప్పదా అనే చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలో తాజాగా భారత్ లో ఆ వైరస్ ను గూర్తించినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా... బెంగళూరులో ఎనిమిది నెలల చిన్నారిలో ఈ వైరస్ పాజిటివ్ గా తేలినట్లు జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి.

ఇలా బెంగళూరులోని బాప్టిస్ట్ హాస్పిటల్ లో 8 నెలల పసికందుకు హెచ్.ఎం.పీ.వీ. వైరస్ ఇన్ఫెక్షన్ ఉన్నట్లు చెబుతున్నారు. ఈ విషయాన్ని సదరు ఆసుపత్రి నిర్ధారించిందని చెబుతున్నారు. ఇదే సమయంలో ఆ శిశువుకు ప్రయాణ చరిత్ర లేదని అంటున్నారు. అయితే... ఇది హెచ్.ఎం.పీ.వీ. కేసు అని కర్ణాటక ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారికంగా ధృవీకరించలేదు.

ఈ సమయంలో రోగి నుంచి నమూనాలను సేకరించి నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (ఎన్.ఐ.వీ) కి పంపుతున్నారని అంటున్నారు. దీనిపై స్పందించిన కర్ణాటక ఆరోగ్య శాఖ మంత్రి దినేష్ రావు కార్యాలయం.. ఈ వైరస్ చైనా నుంచి ఉద్భవించినదేనా లేదా అనేది నిర్ధారించడానికి ఎన్.ఐ.వీ. నుంచి నివేదిక వచ్చిన తర్వాత క్లారిటీ వస్తుందని తెలిపారు!

కాగా... చైనాలో కొత్త వైరస్ గురించి తీవ్ర చర్చ జరుగుతున్న వేళ భారత హెల్త్ ఏజెన్సీ 'డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్' (డీ.జీ.హెచ్.ఎస్.) స్పందించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు డీ.జీ.హెచ్.ఎస్. ఉన్నతాధికారి డాక్టర్ అతుల్ గోయల్.. హెచ్.ఎం.పీ.వీ. వ్యాప్తి పట్ల ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు.

మరోపక్క.. హెచ్.ఎం.పీ.వీ. వైరస్ పై జరుగుతున్న చర్చపై చైనా స్పందించింది. ఈ మేరకు చైనా విదేశాంగ శాఖ ఓ కీలక ప్రకటన విడుదల చేసింది. ఇందులో భాగంగా.. శీతాకాలంలో వచ్చే ఈ శ్వాసకోశ వ్యాధుల తీవ్రత గత ఏడాదితో పోలిస్తే తక్కువగానే ఉందని.. విదేశీయులు తమ దేశంలో పర్యటించడం సురక్షితమే అని పేర్కొంది.

Tags:    

Similar News