వానాకాలం ఉడుకెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు.. ఇది ఉత్తరాది దెబ్బ

తెలుగు రాష్ట్రాలలో రెండు వారాలుగా వర్షాలు బాగానే పడుతున్నాయి. ఎగువన కూడా వర్షాలు దండిగా కురుస్తుండడంతో ప్రాజెక్టులు నిండుతున్నాయి.

Update: 2024-08-17 11:48 GMT

తెలుగు రాష్ట్రాలలో రెండు వారాలుగా వర్షాలు బాగానే పడుతున్నాయి. ఎగువన కూడా వర్షాలు దండిగా కురుస్తుండడంతో ప్రాజెక్టులు నిండుతున్నాయి. అటు ఎండ కూడా పెద్దగా లేదు.. చెట్ల మధ్య నుంచి చూస్తే వాతావరణం ఆహ్లాదంగా కనిపిస్తోంది.. సాయంత్రం, అర్థరాత్రి, తెల్లవారుజామున ఎప్పుడంటే అప్పుడు వర్షం పడుతోంది. కానీ, ఇంట్లో ఉన్నవారికి, పనిమీద బయట తిరిగేవారిని మాత్రం ఉక్కపోత చంపేస్తోంది.

తేమతోనే.. తిప్పలంతా..

ఇంట్లో ఉన్నా, బయట ఉన్నా.. ఎండాకాలం కాకుండా.. ఉక్కపోత చంపేస్తోందంటే అందుకు కారణం గాలిలో తేమ అధికంగా ఉండడమే. ఉదాహరణకు హైదరాబాద్ లో శుక్రవారం ఉదయం తేమ 86 శాతం ఉండగా.. పగటి వేళ 70కి అటుఇటు. ఇక రోజువారీ ఉష్ణోగ్రతలు సగటు కంటే రెండు మూడు డిగ్రీలు ఎక్కువే నమోదవుతున్నాయి.

మన దగ్గర ఇలా ఉంటే.. ఉత్తరాదిన వర్షాలు ముంచెత్తుతున్నాయి. దీనికి కారణం.. రుతుపవన ద్రోణి ఉత్తరం వైపు మళ్లడమే. రుతుపవన విరామ సమయంలో ఇలాంటి వాతావరణం ఉంటుందని వాతావరణ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. బయట, ఇంట్లో ఉక్కపోతతో కరెంట్ వినియోగం విపరీతంగా పెరుగుతోంది. వానాకాలంలో డిమాండ్‌ 2,500 నుంచి 3 వేల మెగావాట్లలోపే ఉంటుంది. హైదరాబాద్ లో బుధవారం ఇది 3,414 మెగావాట్లు కావడం గమనార్హం.

వానాకాలమూ ఏసీ..

తెలుగు రాష్ట్రాల్లో వానాకాలంలోనూ ఏసీలు వాడుతున్న పరిస్థితి. వాతావరణంలో తేమ శాతం పెరగడంతో పాటు బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి ప్రభావంతో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఏపీలోని నెల్లూరులో గురువారం 38 డిగ్రీలుండడం గమనార్హం. పశ్చిమగోదావరిలో గాలిలో తేమ శాతం 89 శాతంగా నమోదైంది. వర్షాలు అధికంగా ఉన్న కోనసీమ జిల్లాలతో పాటు వర్షపాతం అంతంతగా ఉన్న రాయలసీమలోనూ ప్రజలు ఉక్కపోతతో అల్లాడుతున్నారు.

Tags:    

Similar News