స్కూళ్లు, కిరాణా షాపుల వరకు డ్రగ్స్.. భయంకర వాస్తవాలు వెల్లడించిన హైదరాబాద్ సీపీ
ఈ సందర్భంగా డ్రగ్స్ భూతం.. సమాజంలో ఎక్కడి వరకు పెరిగిపోయిందో సీపీ శ్రీనివాసరెడ్డి పూసగుచ్చి నట్టు వివరించారు.
డ్రగ్స్.. ఇప్పుడు తెలంగాణలో ఇదొక ప్రమాదకర పరిణామం. ఏ ఇద్దరు కలిసినా డ్రగ్స్ టాపిక్‌పైనే ఆసక్తిగా చర్చించుకుంటున్నా రు. తాజాగా మరోసారి తెలుగు సినీ రంగాన్ని కూడా కుదిపేస్తున్న ఈ డ్రగ్స్ భూతం.. పెద్దలకే పరిమితం కాలేదు. పాఠశాలల వరకు చాపకిందనీరులా పాకిపోయిందన్న భయంకర వాస్తవాన్ని వెల్లడించారు హైదరాబాద్ పోలీసు కమిషనర్ శ్రీనివాసరెడ్డి. తాజాగా డ్రగ్స్‌పై అవగాహన పేరుతో నిర్వహించిన కార్యక్రమంలో పలువురు పోలీసు అదికారులతో పాటు సామాజిక ఉద్యమ కారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డ్రగ్స్ భూతం.. సమాజంలో ఎక్కడి వరకు పెరిగిపోయిందో సీపీ శ్రీనివాసరెడ్డి పూసగుచ్చి నట్టు వివరించారు.
ఒకప్పుడు అత్యంత రహస్యంగా.. భయంభయంగా వినియోగించే డ్రగ్స్ ఇప్పుడు కిరాణా షాపుల వరకు చేరిపోయిందన్న భ యంకర వాస్తవాన్ని శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. అంతేకాదు.. పాఠశాలల చిన్నారులకు కూడా డ్రగ్స్ పాకాయన్నారు. ఇది కేవలం ఆందోళనకర విషయమే కాదని.. అందరూ దీనిని నిర్మూలించేందుకు కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. ''కొన్ని పాన్ షాపుల్లోనూ డ్రగ్స్ దొరుకుతున్నాయి. దేశం మొత్తం మీద ఇవి ప్రభావం చూపిస్తాయి. వీటి వల్ల వచ్చే డబ్బును ఉగ్రవాద కార్యకలాపాలకు వాడుతున్నారు. స్కూళ్లలో డ్రగ్స్ నిర్మూలన కమిటీలు ఏర్పాటు చేయాలి'' అని ఆయన సూచించారు.
అంతేకాదు, హైదరాబాద్‌లో డ్రగ్స్ నెటవర్క్ చాలా విస్తరించిందని సీపీ ఆందోళన వ్యక్తం చేశారు. 2021 ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు 26 వేల కోట్లరూపాయల విలువైన డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు. స్కూళ్ల దగ్గర సీసీటీవీలను ఏర్పాటు చేయాలని ప్రధానంగా ఆయన సూచించారు. పాఠశాలలకు సమీపంలో ఉన్న దుకాణాలను యాజమాన్యాలు నిరంతరం గమనించాలని.. విద్యార్థుల ప్రవర్తనపైనా ఓ కన్నేసి ఉంచాలని సీపీ సూచించారు.
పలువురు ఉన్నతాధికారులు కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. తెలంగాణ నార్కోటిక్ బ్యూరో డైరెక్టర్, సీనియర్ ఐపీఎస్ సందీప్ శాండిల్య మాట్లాడుతూ.. ఒంటరితనం, ఒత్తిడి వంటివి అనుభవించేవారు.. డ్రగ్స్ బారిన పడుతున్నట్టు తెలిపారు. దేశం మొత్తం ఇప్పుడు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య డ్రగ్సేనని తేల్చి చెప్పారు. ఈ విషయంలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని.. సూచించారు.