నాడు కేసీఆర్ రేవంత్ కి టికెట్ ఇచ్చి ఉంటే...
ఆ తరువాత 2006లో జరిగిన జెడ్పీటీసీ ఎన్నికల్లో అయినా కేసీఆర్ టికెట్ ఇచ్చి ఉంటే రేవంత్ రాజకీయ జీవితం గులాబీ పార్టీలోనే గడిచేదేమో అన్నది ఒక భావన.
రాజకీయాల్లో అనేక శేష ప్రశ్నలు అలాగే ఉంటాయి. ఇందిరాగాంధీ కుమారుడు సంజయ్ గాంధీ జీవించి ఉన్నట్లు అయితే ఇదొక శేష ప్రశ్న. ఎన్టీయార్ 1996 ఎన్నికల వరకూ బతికి ఉన్నట్లు అయితే ఇదొక పెద్ద ప్రశ్న. చంద్రబాబు కేసీఆర్ కి మంత్రి పదవి ఇచ్చి ఉంటే ఇది ఇంకో కీలక ప్రశ్న. అలాగే ఇపుడు మరో ప్రశ్న ఉంది. అదే కేసీఆర్ రేవంత్ రెడ్డికి టికెట్ ఇచ్చి ఉంటే...
వీటికి సమాధానాలు ఉండవు. ఊహాజనితంగా ఎవరిని వారు జవాబు చెప్పుకోవడమే. ఇంతకీ కేసీఆర్ ఏంటి రేవంత్ కి టికెట్ ఏంటి అన్నది కనుక చూస్తే రెండు దశాబ్దాల క్రితం ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్లాల్సిందే. రేవంత్ రెడ్డి 2000 ప్రాంతంలో టీఆర్ఎస్ లో చేరి ఆ పార్టీ ఉన్నతికి కృషి చేశారు. నవ యువకుడిగా రాజకీయాల మీద ఆసక్తితో ఉన్న రేవంత్ మొదట ఎంచుకున్న రాజకీయ పార్టీ అదే కావడం విశేషం.
ఇక 2004లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మహబూబ్ నగర్ జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం టికెట్ మీద రేవంత్ రెడ్డి ఆశలు పెంచుకున్నారు. ఆ టికెట్ రేవంత్ కి దక్కలేదు. ఆ తరువాత 2006లో జరిగిన జెడ్పీటీసీ ఎన్నికల్లో అయినా కేసీఆర్ టికెట్ ఇచ్చి ఉంటే రేవంత్ రాజకీయ జీవితం గులాబీ పార్టీలోనే గడిచేదేమో అన్నది ఒక భావన.
అయితే అది అలా జరిగితే రేవంత్ రెడ్డి సీఎం పదవిని అందుకునే దాకా రాజకీయం ఎలా మారుతుంది. సో రేవంత్ రెడ్డిని ఆనాడు టీఆర్ఎస్ నిరాకరించడమే మేలు చేసినట్లు అయింది. అందుకే 2008లో రేవంత్ రెడ్డి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇండిపెండెంట్ గా గెలిచి తన సత్తా చాటారు. ఆ తరువాత ఆయన టీడీపీలో చేరి 2009 ఎన్నికల్లో కొడంగల్ నియోజకవర్గం నుంచి గెలిచి తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు.
అలా 2014 నాటికి రేవంత్ రెడ్డి మరోసారి ఎమ్మెల్యే కావడమే కాదు తెలంగాణా తెలుగుదేశం పార్టీ ప్రెసిడెంట్ కూడా అయ్యారు. రేవంత్ రెడ్డిలోని నాయకత్వ లక్షణాలను చూసి ప్రోత్సహించింది అచ్చంగా చంద్రబాబు మాత్రమే. అయితే విభజన తరువాత తెలంగాణాలో టీడీపీకి పెద్దగా అవకాశాలు లేకపోవడంతో 2017లో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లో చేరారు. తొలుత వర్కింగ్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు నిర్వహించారు. ఆ తరువాత పీసీసీ చీఫ్ అయ్యారు.
ఆ పదవిని నూరు శాతం న్యాయం చేసి ఈ రోజున కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి పదవీ ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. రేవంత్ రెడ్డి ఒక ఫైటర్. ఆయనలో కసి ప్లస్ కృషి ఉన్నాయి. పోయిన చోట వెతుక్కునే నైపుణ్యం ఉంది. వ్యూహాలూ ఉన్నాయి. ఓపిక కూడా చాలా ఉంది.
ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో కూడా తెలిసిన వారు రేవంత్ రెడ్డి. అందుకే సముద్రం లాంటి కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి బహు చక్కగా ఇమిడిపోయారు. అలా తనను తాను మౌల్డ్ చేసుకున్నారు. ఎన్నికల వేళ కూడా ఆయన అందరితోనూ కో ఆర్డినేట్ చేసుకున్నారు. సీఎం కేసీఆర్ తో సమానంగా రోజుకు మూడు నాలుగు మీటింగ్స్ వంతున మొత్తం ఎనభై నియోజకవర్గాలను సుడిగాలిలా చుట్టేశారు.
యూత్ ఐకాన్ అయ్యారు. అలాగే మహిళలు ఇతర వర్గాలకు తానే గ్యారంటీగా మారారు కేసీఆర్ కి ఆల్టర్నేషన్ లేదు అనుకున్న టైం లో తాను సరైన లీడర్ గా ఎదిగి జనాల చేత జై కొట్టించుకున్నారు. ఒకనాడు కేసీఆర్ ప్రభుత్వం రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేసి జైలులో పెట్టింది. కాలం అటు నుంచి ఇటు గిర్రున తిరిగేసరికి రేవంత్ రెడ్డి ఇపుడు సీఎం అయ్యారు.
అది ఆయన ప్రతిభతో పాటు అదృష్టం కూడా కలసి వస్తే దక్కిన పదవిగా చెప్పుకోవాలి. ఏది ఏమైనా ఎంతో మంది కలలు కంటారు సీఎం కావాలి.కేవలం యాభై నాలుగేళ్ల వయసులో ఆ పదవిని అందుకుని రేవంత్ శభాష్ అనిపించారు. మంత్రి కాకుండానే ముఖ్యమంత్రి అవుతున్న నేతగా కూడా రికార్డు సృష్టించారు. ఇక రేవంత్ రెడ్డి పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా అభివృద్ధి దిశగా సాగుతుందో చూడాల్సిందే.