భారత్ - చైనా సంబంధాల్లో కీలక పరిణామం.. మిస్ కావొద్దు
దేశ ప్రయోజనం మినహా.. తనకంటూ ప్రత్యేకమైన ప్రయోజనాలు అక్కర్లేదన్నట్లుగా మోడీ సర్కారు విదేశాంగ విధానం ఉందని చెప్పాలి.
దశాబ్దాల తరబడి దేశాన్ని పాలించిన కాంగ్రెస్ పాలకులకు.. గడిచిన పదేళ్లుగా దేశాన్ని నడిపిస్తున్న నరేంద్ర మోడీకి మధ్య ఒక వ్యత్యాసం కొట్టొచ్చినట్లు కనిపిస్తుందని చెప్పాలి. కాంగ్రెస్ ప్రభుత్వాల హయాంలో అంతర్జాతీయంగా భారత పాత్ర పరిమితం. కానీ.. మోడీ మాత్రం అందుకు భిన్నమైన ఇమేజ్ ను తెచ్చుకున్నారని చెప్పాలి. అవసరానికి తగ్గట్లు గొడవ పడటం.. దేశ ప్రయోజనాలకు అనుగుణంగా అడుగులు వేయటం.. ఏ అంశం మీదా అనవసరమైన పంతాన్ని ప్రదర్శించి.. ప్రయోజనాల్ని దెబ్బ తినకుండా జాగ్రత్తలు తీసుకోవటం కనిపిస్తుంది. దేశ ప్రయోజనం మినహా.. తనకంటూ ప్రత్యేకమైన ప్రయోజనాలు అక్కర్లేదన్నట్లుగా మోడీ సర్కారు విదేశాంగ విధానం ఉందని చెప్పాలి.
చైనాతో గొడవ పడటం.. వైరం వేళ ఎంతవరకు వెళ్లాలో అంతవరకు వెళ్లటం.. అవసరానికి తగ్గట్లు.. ఆ దేశం ఒక అడుగు వెనక్కి వేస్తే.. అందుకు ప్రతిగా స్పందించటం.. రెండు దేశాల మధ్య స్నేహ సంబంధాల్ని మరింత పెంచేలా చర్యలు తీసుకోవటానికి తమ ప్రభుత్వం సిద్ధంగా ఉంటుందన్న సంకేతాల్ని ఇవ్వటం కనిపిస్తుంది. తాజాగా అలాంటి సీన్ ఒకటి అంతర్జాతీయంగా ఆసక్తికరంగా మారింది. అదే సమయంలో మోడీ వ్యతిరేకులకు తాజా పరిణామం కాస్త మింగుడుపడని రీతిలో ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఇంతకు జరిగిందేమంటే.. భారత - చైనా దేశాల మధ్య శాంతియుత వాతావరణం నెలకొనే దిశగా అడుగులు పడే క్రమంలో బ్రెజిల్ లో జరిగిన జీ20 సదస్సులో ఒక ఆసక్తికర ఘటన చోటు చేసుకున్న విషయం కాస్త ఆలస్యంగా వెలుగు చూసింది. రెండు దేశాల విదేశాంగ మంత్రుల (జయశంకర్, వాంగ్ యిలు) మధ్య భేటీ జరిగింది. ఈ సందర్భంగా రెండు దేశాల మధ్య ప్రత్యక్ష విమాన సర్వీసుల్ని పునరుద్దరించటంతో పాటు.. కైలాస్ మానససరోవర్ యాత్ర పున: ప్రారంభంపై ఇరు దేశాల మంత్రులు మాట్లాడుకుంటున్నట్లుగా తెలుస్తోంది. 2020 జూన్ లో తూర్పు లద్దాఖ్ లో ఇరు దేశాల సైనికుల మధ్య జరిగిన ఘర్షణలో తెలంగాణకు చెందిన కల్నల్ సంతోష్ బాబుతో సహా 20 మంది భారత సైనికులు మరణించటం.. చైనాకు చెందిన పలువురు సైనికులు పెద్ద ఎత్తున చనిపోవటం తెలిసిందే.
ఈ పరిణామం తర్వాత రెండు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆ తర్వాత పరిస్థితుల్లో పెద్దగా మార్పు రాలేదు. ఇటీవల కాలంలో కొంత మార్పు వచ్చినా.. ఆశించినంత స్థాయికి ఇవి పెరగలేదన్న మాట వినిపిస్తోంది. ఇలాంటి వేళ.. బ్రెజిల్ లో జరిగిన జీ20 దేశాల సదస్సులో ఇరు దేశాల విదేశాంగ మంత్రుల మధ్య జరిగిన చర్చల కారణంగా.. రానున్న రోజుల్లో రెండు దేశాల మధ్య ఆసక్తికర సంబంధాల దిశగా అడుగులు పడతాయని చెబుతున్నారు. నాటి ఉద్రిక్తతల తర్వాత సానుకూల వాతావరణంలో జరిగిన మొదటి సమావేశంగా దీన్ని చెప్పాలి. ఈ చర్చలపై రెండు దేశాల విదేశాంగ మంత్రులు సానుకూలంగా స్పందించిన వైనం రానున్న రోజుల్లో మరిన్ని సానుకూల పరిణామాలకు తెర తీయటం ఖాయమంటున్నారు. అదే జరిగితే.. మోడీ సర్కారు మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నట్లుగా చెప్పక తప్పదు.