దేశంలోనే రిచ్ రైల్వేస్టేషన్ ఇదే.. ఎక్కడుదంటే..?

భారతీయ రైల్వేలకు ప్రపంచ వ్యాప్తంగా గొప్ప పేరుంది. ప్రపంచంలోనే నాల్గో అతిపెద్ద రైల్వే నెట్‌వర్క్ అనే రికార్డు సైతం ఉంది.

Update: 2024-09-19 13:30 GMT

భారతీయ రైల్వేలకు ప్రపంచ వ్యాప్తంగా గొప్ప పేరుంది. ప్రపంచంలోనే నాల్గో అతిపెద్ద రైల్వే నెట్‌వర్క్ అనే రికార్డు సైతం ఉంది. దేశ ప్రజలకు సైతం రైల్వే ప్రయాణాన్ని చాలా వరకు ఇష్టపడుతుంటారు. ఎక్కడికైనా దూర ప్రాంతాలకు వెళ్లాలంటే ముందుగా ఎంచుకునేది కూడా రైల్వే ప్రయాణమే. అలాగే.. సిటీల్లోని లోకల్ ట్రెయిన్స్‌కూ అదేస్థాయిలో ప్రాధాన్యత ఉంది. మన రైళ్లలో ప్రతిరోజూ 2 కోట్ల మంది ప్రయాణికులు ప్రయాణాలు సాగిస్తున్నారు. 7,000పై బడి ఎక్కువ రైల్వే స్టేషన్ల ద్వారా ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరుస్తున్నాయి.

భారతీయ రైల్వే స్టేషన్లు కేవలం రైళ్లను నిలపడానికే కాకుండా.. అతిపెద్ద ఆదాయ వనరు అని కూడా చెప్పాలి. చాలా వరకు దేశంలోని రైల్వే స్టేషన్లు పెద్ద ఎత్తున ఆదాయాన్ని పొందుతున్నాయి. రైల్వే ప్రకటనలు, స్టేషన్‌లోని షాపులు, ప్లాట్‌ఫారం టికెట్లు, క్లాక్ రూమ్‌లు, వెయిటింగ్ హాళ్ల ద్వారా వీటిని ఆదాయం సమకూరుతోంది. అయితే.. దేశంలోనే ధనిక రైల్వే స్టేషన్‌గా ఢిల్లీ రైల్వే స్టేషన్ రికార్డు సాధించింది. తరువాతి స్థానంలో హౌరా రైల్వేస్టేషన్ నిలిచింది.

ఢిల్లీ రైల్వే స్టేషన్‌ నుంచి ఏటా భారతీయ రైల్వేకు రూ.3,337 కోట్ల ఆదాయం వస్తోంది. సంపాదన విషయంలో ఈ రైల్వే స్టేషన్ నంబర్ వన్ స్థానంలో ఉంది. హౌరా రైల్వే స్టేషన్ రెండో స్థానంలో నిలువగా.. ఈ స్టేషన్ నుంచి రూ.1,692 కోట్ల వార్షిక ఆదాయం వస్తోంది. అలాగే.. చెన్నై సెంట్రల్ మూడో స్థానంలో నిలిచింది. ఇక్కడ నుంచి రూ.1,299 కోట్లు వస్తున్నాయి. అలాగే.. 500 కోట్ల కంటే ఎక్కువ ఆదాయం వస్తున్న రైల్వే స్లేషన్లు నాన్ సబర్బన్ గ్రూప్ 1 కేటగిరీ కింద చేర్చారు. ఈ జాబితాలో 28 రైల్వే స్టేషన్లు స్థానం దక్కించుకున్నాయి.

అయితే.. ప్రయాణికుల సంఖ్య పరంగా ముంబైలోని థానే రైల్వే స్టేషన్ అగ్రస్థానంలో నిలిచింది. ఏడాదిలో 93.06 కోట్ల మంది ప్రయాణికులు ఈ స్టేషన్ గుండా ప్రయాణిస్తున్నారు. ముంబైలోని కల్యాణ్ రైల్వే స్టేషన్ రెండో స్థానంలో ఉంది. ఏటా ఇక్కడి నుంచి 83.79 కోట్ల మంది ప్రయాణం చేస్తున్నారు. అలాగే.. న్యూఢిల్లీలోని రైల్వే స్టేషన్ నుంచి 39.36 కోట్ల మంది ప్రయాణిస్తున్నారు. దక్షిణ భారతదేశంలో విజయవాడ రైల్వే జంక్షన్ నాన్ సబర్బన్ గ్రూపులో చేరింది. ఈ స్టేషన్ నుంచి ఏటా రైల్వే శాఖకు రూ.528 కోట్ల ఆదాయం చేకూరుతోంది. అలాగే సికింద్రాబాద్ కూడా ఈ జాబితాలో చోటు సాధించింది. దక్షిణ మధ్య రైల్వేలో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ తరువాత ఎన్ఎస్‌జీ 1 హోదా విజయవాడ మాత్రమే సాధించింది. ఈ గుర్తింపుతో కేంద్రం ఈ స్టేషన్లకు మరిన్ని నిధులు కేటాయించనుంది. అలాగే.. ప్రయాణికులకు ఆధునిక సౌకర్యాలు కల్పించనున్నట్లు రైల్వే అధికారి తెలిపారు.

Tags:    

Similar News