భారత్ లో టాప్ 10 రిచ్చెస్ట్ సిటీస్ ఇవే... తెలుగు రాష్ట్రాల్లో రెండింటికి చోటు!
ఆర్థిక బలం, ఉల్లసమైన జీవనశైలికి కేంద్రాలుగా ఉన్న ఈ నగరాలు వ్యాపారం, సాంకేతికత, మౌలిక సదుపాయాలలో ముందున్నాయి.
భారతదేశంలోని 2024లో టాప్ 10 సంపన్న నగరాల జాబితా తెరపైకి వచ్చింది. ఆర్థిక బలం, ఉల్లసమైన జీవనశైలికి కేంద్రాలుగా ఉన్న ఈ నగరాలు వ్యాపారం, సాంకేతికత, మౌలిక సదుపాయాలలో ముందున్నాయి. వీటిలో తెలుగు రాష్ట్రాలకు చెందిన రెండు కీలక నగరాలు చోటు దక్కించుకున్నాయి.
అవును... 2024లో భారతదేశంలోని టాప్ 10 సంపన్న నగారాల జాబితా తెరపైకి వచ్చింది. ఈ సందర్భంగా ఆ టాప్ 10 నగరాలు ఏమిటి.. వాటికి ఉన్న ప్రత్యేకత ఏమిటి.. అందులో ఉన్న రెండు తెలుగు నగరాలు ఏమిటి, ఏయే స్థానాల్లో ఉన్నయనేది ఇప్పుడు చూద్దాం...!
1) ముంబై - మహారాష్ట్ర:
2024లో భారతదేశంలోని టాప్ 10 సంపన్న నగరాల్లో ముంబై మొదటి స్థానంలో ఉంది. ఇది దేశ ఆర్థిక రాజధాని. ఇక్కడే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ లకు నిలయంగా ఉంది. ఈ నగరం 310 బిలియన్ డాలర్లతో దేశంలోని అత్యధిక జీడీపీని కలిగి ఉంది. దేశ ఆర్థిక వ్యవస్థలో కీలక భూమిక పోషిస్తుంది.
2) ఢిల్లీ:
భారతదేశంలోని సంపన్న నగరాల్లో దేశ రాజధాని ఢిల్లీ రెండో స్థానంలో ఉంది. ఈ నగర జీడీపీ 293.6 బిలియన్ డాలర్లుగా ఉంది. ఈ నగరంలో జనాభా సుమారు 19.8 మిలియన్లుగా అంచనా వేయబడగా... రిటైల్, ఐటీ, టూరిజం, ఇంటర్నేషనల్ వాణిజ్యం ఇక్కడ కీలకంగా ఉన్నాయి.
3) కోల్ కతా - పశ్చిమ బెంగాల్:
భారతదేశంలోని మూడవ అత్యంత సంపన్న నగరంగా కోల్ కతా నిలిచింది. ఈ నగర జీడీపీ 150 బిలియన్ డాలర్లుగా ఉంది. ఇది భారతదేశ సంస్కృతిక రాజధానిగా ప్రసిద్ధి చెందింది. కోల్ కతాలో సుమారు 14.8 మిలియన్ల మంది నివసిస్తున్నారు. ఈ నగరం పాత కొత్త అంశాలను మేళవించి ఉంటుంది.
4) బెంగళూరు - కర్ణాటక:
భారతదేశంలోని సంపన్న నగరాల్లో బెంగళూరు నగరం నాలుగో స్థానంలో నిలిచింది. సుమారు 12.7 మిలియన్ల మంది ప్రజలు నివసిస్తున్న ఈ నగరం 110 బిలియన్ డాలర్ల జీడీపీని కలిగి ఉంది. ఇక్కడ ప్రధానంగా ఐటీ ఇండస్ట్రీ విస్తరించింది. ఇక్కడ రియల్ ఎస్టేట్ రంగం కూడా కీలకంగా ఉంది.
5) చెన్నై - తమిళనాడు:
తమిళనాడు రాజధాని చెన్నై భారతదేశంలోని సంపన్న నగరాల్లో ఐదో స్థానంలో నిలిచింది. ఈ నగరం 66 బిలియన్ డాలర్ల జీడీపీని కలిగి ఉంది. ఇది దేశ జీడీపీలో 1.12%గా ఉంది! దేశంలోని ఓ ముఖ్యమైన ఆర్థిక కేంద్రంగా, ఆటో మోటివ్, ఐటీ, హెల్త్ కేర్ ఇండస్ట్రీస్ లో అభివృద్ధి చెందుతూ.. విస్తారంగా ఉద్యోగ అవకాశాలనూ సృష్టిస్తోంది.
6) హైదరాబాద్ - తెలంగాణ:
భారతదేశంలోని సంపన్న నగరాల్లో తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ రాజధాని హైదరాబాద్ ఆరో స్థానంలో నిలిచింది. 58 బిలియన్ డాలర్ల జీడీపీని కలిగి ఉన్న ఈ నగరం... సమాచార సాంకేతికత, ఫార్మాస్యూటికల్స్, బయోటెక్నాలజీ పరిశ్రమలకు ముఖ్యమైన కేంద్రంగా ఉంది. ఇక్కడ విభిన్న ఉద్యోగ అవకాశాలు అందుతుంటాయి. ఈ నగరంలో 10 మిలియన్ల జనాభా ఉన్నట్లు అంచనా.
7) పూణె - మహారాష్ట్ర:
భారతదేశంలోని అత్యంత సంపన్న నగరాల్లో మహారాష్ట్ర నుంచి రెండో నగరం పూణె ఏడో స్థానంలో నిలిచింది. ఆక్స్ ఫర్డ్ ఆఫ్ ది ఈస్ట్ అని పిలవబడే ఈ నగరం ఎడ్యుకేషన్, ఆటోమోటివ్, ఐటీ పరిశ్రమల పవర్ హౌస్ గా ఉంది. ఈ నగరంలో 8.5 మిలియన్ల జనాభా ఉండగా.. దీని జీడీపీ 55 బిలియన్ డాలర్లుగా ఉంది.
8) అహ్మదాబాద్ - గుజరాత్:
అహ్మదాబాద్ నగరం 47 బిలియన్ డాలర్ల జీడీపీతో భారతదేశంలోని అత్యంత సంపన్న నగరాల్లో ఎనిమిదో స్థానంలో ఉంది. ఇది టెక్స్ టైల్స్, కెమికల్, ఫార్మాస్యూటికల్ పరిశ్రమల కేంద్రంగా ఉంది. ఈ నగరంలో జనాభా 7.2 మిలియన్లు ఉన్నట్లు అంచనా.
9) సూరత్ - గుజరాత్:
భారతదేశంలోని అత్యంత సంపన్న నగరాల్లో గుజరాత్ లోని మరో నగరం సూరత్ తొమ్మిదవ స్థానంలో నిలిచింది. డైమండ్ సిటీ ఆఫ్ ఇండియా గా పిలవబడే ఈ నగరంలో డైమండ్ కటింగ్, పాలిషింగ్ ఇండస్ట్రీ ప్రసిద్ధి చెందింది. 6.7 మిలియన్ల జనాభా ఉన్నట్లు చెబుతున్న ఈ నగరం జీడీపీ 45 బిలియన్ డాలర్లు.
10) విశాఖపట్నం - ఆంధ్రప్రదేశ్:
భారతదేశంలోని అత్యంత సంపన్న నగరాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నం (వైజాగ్) పదో స్థానంలో నిలిచింది. ఉక్కు, పెట్రోలియం, ఐటీ రంగాలకు ప్రసిద్ధి చెందిన విసాఖ జీడీపీ 40 బిలియన్ డాలర్లుగా ఉంది. దీనిని ఆంధ్రప్రదేశ్ ఆర్థిక రాజధానిగా సంబోధిస్తుంటారు!