చదువు కంటే పెళ్లి కోసమే భారత్ లో ఎక్కువ ఖర్చు
మన దేశంలో పెళ్లికి ఇచ్చే ప్రాధాన్యత ఎంతన్న విషయాన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దీని కోసం భారీగా ఖర్చు చేస్తుంటారు
మన దేశంలో పెళ్లికి ఇచ్చే ప్రాధాన్యత ఎంతన్న విషయాన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దీని కోసం భారీగా ఖర్చు చేస్తుంటారు. భారత్ లో పెళ్లిళ్లకు ఎంత ప్రాధాన్యత ఇస్తారన్న విషయానికి సంబంధించిన పలు ఆసక్తికర అంశాల్ని ప్రముఖ బ్రోకరేజీ సంస్థ జెఫ్రీస్ రిపోర్టు వెల్లడించింది.
దీని ప్రకారం సగటు భారతీయులు చదువు కోసం వెచ్చిస్తున్న మొత్తం కంటే పెళ్లిళ్ల కోసం చేసే ఖర్చు ఎక్కువన్న విషయాన్ని ఈ రిపోర్టు స్పష్టం చేసింది. దేశంలో వివాహ పరిశ్రమ 130 బిలియన్ డాలర్లుగా పేర్కొంది. మన రూపాయిల్లో చెప్పాలంటే రూ.10 లక్షల కోట్లుగా అంచనా వేసింది. ప్రపంచ వ్యాప్తంగా వార్షికంగా అత్యధిక పెళ్లిళ్లు జరిగే దేశాల్లో మన దేశమే ముందు ఉండటం విశేషం. చైనాలో 70-80 లక్షల పెళ్లిళ్లు జరుగుతుండగా.. అమెరికాలో 20-25 లక్షల పెళ్లిళ్లు జరుగుతాయని పేర్కొన్నారు. మన దేశంలో మాత్రం 80 లక్షల నుంచి కోటి వరకు ప్రతి ఏటా పెళ్లిళ్లు జరుగుతాయని వెల్లడించింది.
మన దేశంలో నిత్యవసర వస్తువుల తర్వాత అత్యధికంగా పెళ్లిళ్ల సందర్భంగా ఖర్చు చేస్తారని చెప్పింది. మన దేశంలో పెళ్లిళ్ల కోసం బంగారం..వెండి ఆభరణాలతో పాటు దుస్తుల కొనుగోళ్లు ఎక్కువగా జరుగుతుంటాయి. వాహనాలు.. ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల అమ్మకాలకు పరోక్షంగా కారణమవుతాయని పేర్కొన్నారు. పెళ్లిళ్లలో అత్యధికంగా సంప్రదాయంగా జరగటంతో ఎక్కువ ఖర్చులకు కారణంగా చెప్పాలి.
పెళ్లిళ్లు వారి ఆదాయాలు.. సంపదకు తగ్గట్లు కాకుండా అంతకు మించిన ఆడంబరంగా పెళ్లిళ్లను నిర్వహిస్తుంటారని నివేదిక పేర్కొంది. ఒక్కో పెళ్లి ఖర్చు రూ.12.5 లక్షలుగా ఉంటుందని.. ఇది తలసరి ఆదాయం కంటే చాలా ఎక్కువగా పేర్కొన్నారు. మనదేశంలో జరిగే పెళ్లిళ్లకు భిన్నంగా అమెరికాలో వివాహాలు ఉంటాయని వెల్లడించింది. మన దేశంలో స్కూల్.. గ్రాడ్యుయేషన్ కోసం వెచ్చించే ఖర్చు కంటే రెట్టింపు మొత్తాన్ని మన దేశంలో పెళ్లిళ్ల కోసం కుటుంబాలు ఖర్చు స్తుంటాయి. అమెరికాలో మాత్రం ఇందుకు భిన్నంగా విద్య కోసం ఖర్చు చేసే మొత్తంలో సగం మొత్తాన్ని మాత్రమే పెళ్లిళ్ల కోసం వినియోగిస్తున్నట్లు రిపోర్టు వెల్లడించింది.
పెళ్లిళ్ల కోసం పనులను ఆరు నెలల నుంచి ఏడాది ముందు నుంచి ప్లాన్ చేస్తుంటారని.. గరిష్ఠంగా 50వేల మంది కూడా పెళ్లిళ్లకు హాజరవుతారని పేర్కొంది. పెళ్లి కుమార్తె ధరించే లెహంగాల బరువు కొన్నిసార్లు పది కేజీల వరకు ఉంటాయని చెప్పింది. అంతేకాదు.. మొత్తం ఆభరణాల అమ్మకాల్లో సగం పెళ్లి కుమార్తెలకు ఇచ్చే నగల కోసమే ఉంటాయని చెప్పింది. అలంకరణకు తక్కువ ఖర్చు చేస్తారని.. పెళ్లి వేడుక సందర్భంగా చాకోలేట్ పానీ పూరి.. వాఫిల్ దోస.. పైనాపిల్ ప్లేవర్డ్ పనీర్ లాంటి ఫుడ్ సర్వ్ చేయాలని ఎక్కువ మంది కోరుకుంటారని పేర్కొంది. మొత్తంగా పెళ్లిళ్లకు మన దేశంలో ఎంతటి ప్రాధాన్యత ఇస్తారన్న విషయం తాజా రిపోర్టు స్పష్టం చేసిందని చెప్పాలి.