కొత్త కోణం: హత్యకు గురైన పారిశ్రామికవేత్త రతన్ టాటా క్లాస్ మేట్
పెను సంచలనంగా మారిన హైదరాబాద్ పారిశ్రామికవేత్త జనార్దన్ రావు హత్య ఉదంతంలో కొత్త అంశాలు వెలుగు చూస్తున్నాయి.
పెను సంచలనంగా మారిన హైదరాబాద్ పారిశ్రామికవేత్త జనార్దన్ రావు హత్య ఉదంతంలో కొత్త అంశాలు వెలుగు చూస్తున్నాయి. వందలాది మందికి ఉపాధిని ఇవ్వటంతో పాటు.. భారత నేవీకి సైతం పరికరాల్ని తన కంపెనీ ద్వారా సప్లై చేసిన ఆయన.. సొంత మనమడి చేతిలో దారుణంగా హత్యకు గురి కావటం తెలిసిందే. జనార్దన్ రావు నేపథ్యం గురించి చెక్ చేసినప్పుడు.. ఆయన ఎంతో ఎత్తుకు ఎదిగినప్పటికి లోప్రొఫైల్ మొయింటైన్ చేసిన వైనం కనిపిస్తుంది. ఆసక్తికర మరో అంశం ఏమంటే.. భారతీయులు ఎంతో అభిమానించే స్వర్గీయ రతన్ టాటా.. జనార్థన్ రావులు ఇద్దరు క్లాస్ మేట్స్ మాత్రమే కాదు.. మంచి స్నేహితులు కూడా.
రతన్ టాటా స్ఫూర్తితో పరిశ్రమల్ని ఏర్పాటు చేయటమే కాదు..ఆయన మాదిరి గుప్త దానాలు ఇస్తుంటారన్న విషయం వెలుగు చూసింది. ఐఐటీ ఖరగ్ పూర్ లో ఇంజనీరింగ్ చేసిన జనార్దన్ రావుకు అక్కడే రతన్ టాటాతో పరియమైంది. ఆయన్ను స్ఫూర్తిగా తీసుకున్న జనార్దన్ రావు.. హైదరాబాద్ లో పరిశ్రమల్ని స్థాపించటం మొదలు పెట్టారు. పటాన్ చెర్వు పారిశ్రామికవాడలో తొలితరం పరిశ్రమల స్థాపకుడిగా జనార్దన్ రావుకు పేరుంది.
ఆస్తి తగాదాల్లో భాగంగా మనమడి చేతిలో దారుణంగా హత్యకు గురైన ఆయన పోస్టుమార్టం చేసిన వైద్యులు సైతం అవాక్కు అవుతున్నట్లు తెలుస్తోంది. ఇష్టం వచ్చినట్లుగా తాతను కత్తితో హతమార్చిన వైనంలో.. ఒక్క మెడపైనే 16సార్లు పొడిచినట్లుగా వైద్యులు చెబుతున్నారు. మెడ నుంచి కాలి వరకు ప్రతి భాగంలోనూ కత్తిపోట్లు ఉన్నట్లుగా తెలుస్తోంది. తాతను దారుణంగా హతమార్చిన మనమడు కార్తితేజ అమెరికాలో చదువుకున్నారు. కొద్దినెలల క్రితం అతని మీద ఒక కేసు కూడా ఉందని తెలుస్తోంది.
అంతేకాదు.. తాతను చంపిన పశ్చాతాపం ఇసుమంత కూడా కనిపించట్లేదని పోలీసులు చెబుతున్నారు. ఆయన హత్య పారిశ్రామివేత్తల్లోనూ.. వ్యాపార వర్గాల్లోనూ సంచలనంగా మారింది. ఎంతోమందికి ఎన్నో రకాలుగా సేవలుచేయటంతో పాటు.. చదువుకోవటానికి డబ్బుల్లేని ఎంతోమందికి ఆయనఆర్థిక సాయం చేయటం..వారికి అండగా నిలవటం చేసినట్లుగా చెబుతున్నారు. అలాంటి వ్యక్తి ఇంత దారుణంగా హత్యకు గురి కావటం ఏమిటన్న ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు.