నువ్వా నేనా... బైడెన్ – ట్రంప్ మధ్య ఆసక్తికరమైన డిబేట్!
అవును... భారత కాలమానం ప్రకారం శుక్రవారం ఉదయం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చర్చా కార్యక్రమంలో పాల్గొన్నారు.
అగ్రరాజ్యం అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధ్యక్షుడు జో బైడెన్, మాజీ అధ్యక్షుడు ట్రంప్ మధ్య రసవత్తరమైన చర్చ జరిగింది. ఇరువురు నేతలూ పాల్గొన్న ఈ డిబేట్ ఆధ్యాంతం వాడీ వేడీగా జరగింది. అట్లాంటాలోని సీ.ఎన్.ఎన్. ప్రధాన కార్యాలంలో భారత కాలమానం ప్రకారం శుక్రవారం ఉదయం ఈ డిబేట్ జరిగింది. ఈ సందర్భంగా ఇద్దరు నేతలూ ఒకానొక దశలో సంయమనం కోల్పోవడం గమనార్హం.
అవును... భారత కాలమానం ప్రకారం శుక్రవారం ఉదయం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చర్చా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు కీలక విషయాలపై చర్చించారు. ఈ సందర్భంగా ఒకానొక దశలో వీరిద్దరూ సమయమనం కోల్పోవడం గమనార్హం. ఫలితంగా.. వ్యక్తిగత విమర్శలకూ దిగారు ఈ ఇద్దరు సీనియర్ నేతలు! ఇప్పుడు ఈ డిబేట్ ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశం అవుతుంది.
ఈ సందర్భంగా ట్రంప్ కాస్త దూకుడు ప్రదర్శించినట్లు.. బైడెన్ కొన్ని చోట్ల వెనుకబడినట్లు చెబుతున్నారు. ఇదే సమయంలో... డిబేట్ నిర్వహించిన సీ.ఎన్.ఎన్. ఏర్పాటు చేసిన పోల్ లో మెజారిటీ వీక్షకులు.. చర్చలో ట్రంప్ పైచేయి సాధించినట్లు అభిప్రాయపడ్డారు. ఈ చర్చలో డొనాల్డ్ ట్రంప్ 23 నిమిషాల 6 సెకన్లు మాట్లాడగా.. జో బైడెన్ 18 నిమిషాల 26 సెకన్లు మాట్లాడారు.
ఈ సమయంలో... అధ్యక్షుడు జో బైడెన్ లు పలు విషయాల్లో ఫెయిల్యూర్ గా ట్రంప్ అభివర్ణించగా... మాజీ ప్రెసిడెంట్ ట్రంప్ ను దోషి అని, లూసర్ అని బైడెన్ ఎద్దేవా చేశారు! ఈ డిబేట్ సమయంలో ఒకరు మాట్లాడుతుండగా.. మరొకరి మైక్ లను ఆఫ్ చేయడం గమనార్హం. ఈ చర్చలో నిర్వాహకులు తప్ప ఇంకెవరూ పాల్గొనలేదు!
ఈ డిబేట్ లో ప్రధానంగా ఆర్థిక వ్యవస్థతో పాటు విదేశాంగ విధానం, అబార్షన్, ఇజ్రాయేల్ – హమాస్ యుద్ధం, రష్యా - ఉక్రెయిన్ వార్, వలస విధానం, తాలిబన్లు – ఆఫ్గన్ పౌరులు మొదలైన కీలక విషయాలపై చర్చ జరిగింది. ఈ డిబేట్ లో ట్రంప్ కాస్త దూకుడు ప్రదర్శించారని అంటున్నారు. బైడెన్ తడబాటును ఉపాధ్యక్షురాలు కమలా హారీస్ కూడా పరోక్షంగా అంగీకరించినట్లు చెబుతున్నారు.
జో బైడెన్: ట్రంప్ హయాంలో సంపన్నులకు అనుకూల వైఖరిని అవలంభించారు.. ఫలితంగా ఆర్థిక వ్యవస్థ పూర్తిగా కుప్పకూలింది.. నిరుద్యోగం 15 శాతానికి చేరింది.. ఆ పరిస్థితుల్లో దేశ ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టాల్సిన బాధ్యతను ప్రజలు నాపై ఉంచారు.
డొనాల్డ్ ట్రంప్: జో బైడెన్ హయాంలో అమెరికన్ లకు కాకుండా అక్రమ వలసదారులకు మాత్రమే ఉద్యోగాలు లభించాయి.. పన్ను కోతల వల్ల ఆర్థిక వ్యవస్థ గతంలో ఎన్నడూ లేనంత దుర్భర పరిస్థితులను ఎదుర్కొంటుంది.. ద్రవ్యోల్బణం దారుణ పరిస్థితికి చేరుకుంది!
జో బైడెన్: అమెరికా అనుసరిస్తున్న వలస విధానంపై ట్రంప్ కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారు. తమ హయాంలో అక్రమ వలసదారులను ఆహ్వానిస్తున్నారన్న ఆరోపణల్లో నిజం లేదు!
డొనాల్డ్ ట్రంప్: బైడెన్ ముమ్మాటికీ అక్రమ వలసదారులను ఆహ్వానిస్తున్నారు. దేశ సరిహద్దులను భద్రంగా ఉంచడంలో బైడెన్ పూర్తిగా విఫలమయ్యారు. ఈ విషయాన్ని బైడెన్ చేసిన అతిపెద్ద నేరంగా నేను అభివర్ణిస్తాను.
ఆఫ్గనిస్తాన్ నుంచి అమెరికా బలగాల ఉపసంహరణ అత్యంత ఘోరంగా జరిగింది. అమెరికా చరిత్రలోనే అదో దుర్దినంగా నిలిచిపోతోంది! నా హయాంలో చాలా గౌరవప్రదంగా సైనికులు బయటకు వచ్చేలా ఏర్పాట్లు చేశాం. నా హయాంలో విదేశీ విధానం బాగుండేది.
జో బైడెన్: ట్రంప్ అనుసరించిన విదేశీ విదానాలు దారుణంగా ఉండేవి! ట్రంప్ హయాంలోనే తాలిబన్లు.. ఆఫ్గాన్ ప్రజలను చంపుతూనే ఉన్నారు. ఆ సమయంలో అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ఎలాంటి చర్యలూ తీసుకోలేదు.
ఇక రష్యా – ఉక్రెయిన్ విషయానికొస్తే... ఈ వ్యవహారంలో పుతిన్ కు డొనాల్డ్ ట్రంప్ పూర్తి స్వేచ్ఛనిచ్చారు. పైగా.. అనేకమంది సైనికుల ప్రాణాలు కోల్పోయినందుకే రష్యా ప్రతిదాడి చేస్తోందంటూ సమర్థించారు కూడా!
హమాస్ తో జరుగుతున్న యుద్ధంలో ఇజ్రాయేల్ కు మా మద్దతు కొనసాగుతుంది.
డొనాల్డ్ ట్రంప్: హమాస్ తో జరుగుతున్న యుద్ధంలో తమ మద్దతు కూడా ఇజ్రాయేల్ కు ఉంటుంది. ఇటీవల బైడెన్ వైఖరిలో మార్పు వచ్చింది.. ఆయన పాలస్థీనా వాసి తరహాలో వ్యవహరిస్తున్నారు.
ట్రంప్ దే పైచేయి!:
అమెరికా అధ్యక్షుడు, మాజీ అధ్యక్షుడు మధ్య జరిగిన డిబేట్ అమెరికాతో పాటు ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యింది. ఇదే సమయంలో... ఈ చర్చలో ఎవరిది పైచేయి అనే విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే... ఈ విషయంలో ట్రంప్ దే పైచేయి అనే మాటలు కాస్త ఎక్కువగా వినిపిస్తుండటం గమనార్హం.
ఈ డిబేట్ లో ట్రంప్ ఉన్నంతలో సూటిగా మాట్లాడారని.. గణాంకాలను ఉదహరిస్తూ వ్యాఖ్యానించారని.. ఆయన మాటల్లో స్పష్టత ఉందని.. అయితే బైడెన్ వైఖరి అందుకు పూర్తి భిన్నంగా ఉందనే కామెంట్లు ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా బలంగా వినిపిస్తున్నాయి.