సౌదీ అరేబియాను వెనక్కి నెట్టిన భారత్... ఎందులోనో తెలుసా?
ఇందులో భాగంగా... ప్రతీరోజూ సుమారు 3.60 లక్షల బ్యారెల్స్ శుద్ధి చేసిన ముడి చమురును యూరప్ కు ఎగుమతి చేసిందని తెలిపింది.
వేగంగా అభివృద్ధి చెందుతూ ఉన్న భారత్.. అవకాశం ఉన్న అన్ని రంగాల్లోనూ దాదాపుగా టాప్ ప్లేస్ లోకి వెళ్లే ప్రయత్నాల్లో ఉందనే చెప్పాలి. ఈ క్రమంలో తాజాగా సౌదీ అరేబియాను వెనక్కి నెట్టి.. యూరప్ కు అతిపెద్ద ముడి చమురు సరఫరాదుగా అవతరించింది. ఈ మేరకు కెప్లర్ నివేదిక కీలక విషయాలు వెల్లడించింది.
అవును... భారతీయ రిఫైనరీల నుంచి యూరోపియన్ యూనియన్ దేశాలకు శుద్ధి చేసిన ముడి చమురు ఎగుమతిలో అనూహ్యంగా పెరుగుదల నమోదైందని కెప్లర్ నివేదిక వెల్లడించింది. ఇందులో భాగంగా... ప్రతీరోజూ సుమారు 3.60 లక్షల బ్యారెల్స్ శుద్ధి చేసిన ముడి చమురును యూరప్ కు ఎగుమతి చేసిందని తెలిపింది.
ఈ క్రమంలో వచ్చే ఏడాది ఏప్రిల్ నాటికి ఈ ఎగుమతులు దాదాపు 20 లక్షల బ్యారెల్స్ ను దాటుతుందని అంచనాలున్నాయని అంటున్నారు. వాస్తవానికి రష్యా - ఉక్రెయిన్ వార్ ప్రారంభమైన మొదట్లో రోజుకి 1.54 లక్షల బ్యారెల్స్ ను యూరప్ కు కు ఎగుమతి చేయగా.. యుద్ధం మొదలై రోజులు గడిచే కొద్దీ రెండు లక్షల బ్యారెల్స్ కు పెరిగింది.
రష్యాపై అమెరికా విధించిన ఆంక్షలు ఈ సమయంలో భారత్ కు బాగా కలిసొచ్చిందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో... రాబోయే కాలంలో భారత్ మరింతగా తన స్థానాన్ని పదిలం చేసుకోనుందని అంటున్నారు.
కాగా.. ప్రపంచ చమురు సరఫరాలో ఇప్పటివరకూ సౌదీ అరేబియా ప్రీమియం హోదాను కలిగి ఉన్న సంగతి తెలిసిందే. చాలా కాలంగా ప్రపంచంలోని అగ్ర చమురు ఉత్పత్తిదారులలో స్థిరంగా ర్యాంకును సౌదీ కలిగి ఉంది. అయితే... రష్యాపై ఆంక్షల కారణంగా యూరోపియన్ దేశాలు ప్రత్యామ్నాయం వనరులను వెతుకుతుండటంతో.. భారత్ తన పరిధిని వేగంగా విస్తరించింది.