పురందేశ్వరికి కేంద్ర మంత్రి పదవి? ఏపీ బీజేపీకి కొత్త చీఫ్
త్వరలో బీజేపీ సంస్థాగత ఎన్నికలు జరుగుతాయని, జాతీయ కార్యవర్గంతోపాటు ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు కూడా కొత్త అధ్యక్షులు వస్తారనే టాక్ నడుస్తోంది.
ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి కేంద్ర మంత్రి కానున్నారా? ఆమె స్థానంలో పార్టీకి కొత్త చీఫ్ వస్తున్నారా? అంటే కమలనాథులు ఔననే అంటున్నారు. త్వరలో బీజేపీ సంస్థాగత ఎన్నికలు జరుగుతాయని, జాతీయ కార్యవర్గంతోపాటు ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు కూడా కొత్త అధ్యక్షులు వస్తారనే టాక్ నడుస్తోంది.
ప్రస్తుతం ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా రాజమండ్రి ఎంపీ పురందేశ్వరి వ్యవహరస్తున్నారు. ఆమె ఆధ్వర్యంలోనే రాష్ట్ర బీజేపీ కూటమి కట్టి అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించింది. అంతకుముందు ప్రభుత్వంపై వెన్నుచూపని పోరాటం చేసిన పురందేశ్వరి.. బీజేపీ శ్రేణుల్లో నూతన ఉత్తేజం తీసుకువచ్చారు. దీంతో గత అసెంబ్లీ ఎన్నికల్లో 8 అసెంబ్లీ, మూడు పార్లమెంటు సీట్లను గెలుచుకున్నారు. పోటీ చేసిన స్థానాల్లో రెండు అసెంబ్లీ, రెండు పార్లమెంటు స్థానాల్లో మాత్రమే బీజేపీ ఓడిపోయింది. ఇక ఎన్నికలు అయిన అనంతరం పురందేశ్వరికి కేంద్ర మంత్రి వర్గంలో చోటిస్తారని భావించారు. కానీ, అధిష్టానం అనూహ్యంగా నరసాపురం ఎంపీ భూపతిరాజు శ్రీనివాసవర్మను కేంద్ర సహాయ మంత్రిగా చాన్స్ ఇచ్చింది. ఇక సంక్రాంతి తర్వాత జరిగే విస్తరణలో పురందేశ్వరికి మంత్ర యోగం పట్టనుందని అంటున్నారు.
సంక్రాంతి తర్వాత బీజేపీ జాతీయ కార్యవర్గం ఏర్పాటుకానుంది. ప్రస్తుత అధ్యక్షుడు జేపీ నడ్డా కేంద్ర మంత్రవర్గంలో చేరడంతో పార్టీకి నూతన అధ్యక్షుడిని నియమించాల్సివుంది. అదేవిధంగా తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి కూడా కేంద్ర మంత్రివర్గంలో ఉండటంతో ఆ రాష్ట్రానికి కొత్తగా అధ్యక్షుడిని నియమిస్తారని చాలా కాలంగా ప్రచారం ఉంది. అదేవిధంగా ఏపీకి కొత్త అధ్యక్షుడిని నియమించి పురందేశ్వరిని కేంద్రమంత్రి వర్గంలోకి తీసుకుంటారని చెబుతున్నారు.
ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా పార్టీ అధిష్టానం పలువురి పేర్లు పరిశీలిస్తోందని చెబుతున్నారు. కేంద్ర మాజీ మంత్రి, విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి, అదోని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి, మాజీ ఎమ్మెల్సీ మాధవ్, పార్టీ సీనియర్ నేత పురిఘళ్ల రఘురామ్ పేర్లు ప్రచారంలో ఉన్నాయి. సుజనా చౌదరి 2014-18 వరకు మోదీ మంత్రివర్గంలో సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిగా పనిచేశారు. 2019 ఎన్నికల తర్వాత ఆయన బీజేపీలో చేరారు. అదేవిధంగా అదోని ఎమ్మెల్యే పార్థసారథి ప్రస్తుతం పార్టీ వాయిస్ ను బలంగా వినిపించడంలో ముందున్నారు. మరోనేత మాజీ ఎమ్మెల్సీ పీవీఎస్ మాధవ్ తొలి నుంచి పార్టీనే నమ్ముకుని ఉన్నారు. పార్టీ క్రమశిక్షణకు కట్టుబడే నేతగా ఆయనకు గుర్తింపు ఉంది. ఇదేకోవలో సీనియర్ నేత పురిఘళ్ల రఘురామ్ కు ఆర్ఎస్ఎస్ ఆశీస్సులు ఉన్నాయి. అయితే రఘురామ్ తప్పించి మిగిలిన ముగ్గురి మధ్య ఎక్కువ పోటీ ఉందని అంటున్నారు. మరోవైపు కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి రాష్ట్ర క్యాబినెట్ పదవిని ఆశించారు. అందువల్ల ఆయనకు పార్టీ అధ్యక్ష పదవి ఇవ్వాలని హైకమాండ్ భావిస్తోంది. అయితే ఆయన పార్టీ బాధ్యతలు తీసుకోడానికి సిద్ధపడతారా? అన్నది సందేహస్పదంగా మారింది. మిగిలిన ఇద్దరిలో పార్ధసారథి లేక మాధవ్ ల్లో ఎవరో ఒకరు పార్టీ కొత్త అధ్యక్షుడు అయ్యే అవకాశం ఉందని సమాచారం.