వైసీపీకి బీజేపీ నేత మద్దతు.. తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నికపై హైకోర్టులో కేసు
తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నిక సందర్భంగా దాడులు జరగడం దురదృష్టకరమని వ్యాఖ్యానించిన సుబ్రహ్మణ్యస్వామి ఈ విషయంపై హైకోర్టులో కేసు వేశారు.
ప్రతిపక్ష వైసీపీకి బీజేపీ జాతీయ నేత మద్దతు అనూహ్యంగా లభించింది. వైసీపీ అడుగుతున్న ప్రతిపక్ష హోదా సహా, ఆ పార్టీకి ఎదురుదెబ్బ తగిలిన తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ ఉప ఎన్నిక వరకు బీజేపీ నేత సుబ్రహ్మణ్యస్వామి వెన్నుదన్నుగా నిలిచి అందరికీ షాక్ ఇచ్చారు. తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నిక సందర్భంగా దాడులు జరగడం దురదృష్టకరమని వ్యాఖ్యానించిన సుబ్రహ్మణ్యస్వామి ఈ విషయంపై హైకోర్టులో కేసు వేశారు.
ఏపీలో బీజేపీ అధికార పార్టీ.. వైసీపీ ప్రతిపక్షం.. అయితే బీజేపీ జాతీయ నేత సుబ్రహ్మణ్యస్వామి మాత్రం వైసీపీపై సానుభూతి చూపుతున్నారు. గతంలో కూడా వైసీపీ నేతలతో క్లోజ్ గా మూవ్ అయిన సుబ్రహ్మణ్యస్వామి తాజా వైఖరి చర్చనీయాంశంగా మారింది. తిరుపతి కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో హింస జరిగిందని ఏపీ హైకోర్టులో సుబ్రహ్మణ్యస్వామి పిల్ వేశారు. చాలా మందిని భయపెట్టి దాడులు చేయడం ప్రజాస్వామ్యంలో మంచిది కాదని ఆయన పేర్కొన్నారు. తాను పిల్ వేసిన తర్వాత తిరుపతి పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదుచేసి ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. ఈ విషయంపై కోర్టు చర్యలు తీసుకోకపోతే దేశవ్యాప్తంగా దాడుల సంస్కృతి చట్టంగా మారిపోతుందని ఆందోళన వెలిబుచ్చారు. మంచి విషయాలపై ఎవరు మాట్లాడినా పార్టీలకు అతీతంగా అంగీకరించాలని, తాను తీసుకునే నిర్ణయాలను తమ పార్టీ ఎప్పుడూ వ్యతిరేకించలేదని వ్యాఖ్యానించారు.
ఇక అసెంబ్లీలో తక్కువ మంది ఎమ్మెల్యేలు ఉన్నా, వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సిందేనని సుబ్రహ్మణ్యస్వామి అభిప్రాయపడ్డారు. ప్రతిపక్షంలో ఒక్కటే పార్టీ ఉంది కనుక ప్రతిపక్ష హోదా ఇవ్వడంలో తప్పులేదని చెప్పారు. మరోవైపు తిరుపతి లడ్డూ అంశం ముగిసిపోయిందని, కల్తీ జరగకుండా ఉండేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని కోర్టు ఆదేశించిన విషయాన్ని గుర్తు చేశారు. తిరుపతి లడ్డూపై అసత్యాలు ప్రచారం చేయడం కూడా పెద్ద తప్పే అవుతుందన్నారు. తిరుపతి లడ్డూను కల్తీ చేయాలని నిజమైన భక్తులు ఎవరూ అనుకోరని ఆయన వ్యాఖ్యానించారు.
రాష్ట్రంలో వైసీపీ పోరాడుతున్న రాజకీయ అంశాలపై బీజేపీ నేత హోదాలో సుబ్రహ్మణ్యస్వామి మద్దతు ప్రకటించడం ఆసక్తికరంగా మారింది. వృత్తిరీత్యా న్యాయవాది అయిన సుబ్రహ్మణ్యస్వామి గతంలో కూడా వైసీపీ తరఫున వాదించారు. అయితే ఆయన న్యాయవాదిగా ఎవరి పక్షాన అయినా ఏ విషయంలో అయినా వాదించవచ్చునని, కానీ, బీజేపీలో ఉంటూ ప్రతిపక్షానికి మద్దతు తెలపడంపై కాషాయ పార్టీ పెద్దలకు ఫిర్యాదులు వెళుతున్నాయి.