పల్నాడు పీటముడి వీడేనా?

కాగా కీలకమైన పల్నాడు జిల్లాలో టికెట్ల కోసం ఎక్కువ మంది పోటీ పడుతున్నారు.

Update: 2024-01-21 01:30 GMT

ఆంధ్రప్రదేశ్‌ లో వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ చేస్తున్న మార్పులు ఆ పార్టీలో కలకలం రేపుతున్నాయి. ఇప్పటివరకు నాలుగు విడతల్లో 68 అసెంబ్లీ, పార్లమెంటు స్థానాలకు వైఎస్‌ జగన్‌ అభ్యర్థులను ప్రకటించారు. వీరిలో చాలా మందిని తమ స్థానాల నుంచి వేరే స్థానాలకు మార్చారు. కొంతమంది సిట్టింగులను పూర్తిగా పక్కనపెట్టారు.

కాగా కీలకమైన పల్నాడు జిల్లాలో టికెట్ల కోసం ఎక్కువ మంది పోటీ పడుతున్నారు. ముఖ్యంగా పల్నాడు జిల్లా కేంద్రం.. నరసరావుపేటలో ప్రస్తుత సిట్టింగ్‌ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డికే జగన్‌ మరోమారు సీటు కేటాయించారనే వార్తల నేపథ్యంలో ఆ నియోజకవర్గంలో కీలక నేతలు గుస్సాగా ఉన్నారని అంటున్నారు. ఇప్పటికే వైసీపీ ముఖ్య నేతలను కలిసి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డికి సీటు ఇవ్వవద్దని కోరారు.

నరసరావుపేటలో 1983 నుంచి 1999 వరకు అంటే వరుసగా ఐదుసార్లు టీడీపీ అభ్యర్థి కోడెల శివప్రసాదరావు గెలుపొందారు. ఇక 2004, 2009ల్లో మాత్రమే కాంగ్రెస్‌ గెలిచింది. 2014, 2019 ఎన్నికల్లో వైసీపీ తరఫున ఈ నియోజకవర్గంలో ప్రముఖ వైద్యుడు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి విజయం సాధించారు. మరోసారి కూడా ఆయనే పోటీకి సిద్ధమవుతున్నారు. అయితే పదేళ్ల నుంచి ఎమ్మెల్యేగా ఉన్న గోపిరెడ్డిపై తీవ్ర వ్యతిరేకత ఉందని.. ఆయనకు సీటు ఇవ్వవద్దని అసమ్మతి నేతలు కోరుతున్నారు.

నరసరావుపేట మార్కెట్‌ యార్డు ఛైర్మన్‌ హనీఫ్, రొంపిచర్ల జడ్పీటీసీ సభ్యుడు ఓబుల్‌ రెడ్డి, బాపట్ల నియోజకవర్గ పరిశీలకుడు, స్థానిక వైసీపీ నేత డాక్టర్‌ గజ్జల బ్రహ్మారెడ్డి.. ప్రస్తుత ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిని వ్యతిరేకిస్తున్నారు. వీరికి స్థానికంగా ఉన్న వైద్యుడు ఒకరు, ఉమ్మడి గుంటూరు జిల్లాలో అధికార పార్టీలో కీలకంగా ఉన్న ఒక ఎంపీ కుటుంబం, పల్నాడు జిల్లాలో దీర్ఘకాలంగా రాజకీయాల్లో కీలకంగా ఉన్న కుటుంబం అండదండలు అందిస్తున్నారని టాక్‌ నడుస్తోంది. అలాగే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి కుటుంబంలోనే మరొకరు కూడా సీటు ఆశిస్తున్నారని.. వీరంతా అసమ్మతి నేతలకు అండగా నిలుస్తున్నారని సమాచారం. అసమ్మతి నేతలంతా నరసరావుపేట స్థానం కోసం పోటీపడుతున్నారు.

అసమ్మతి నేతలు ఎమ్మెల్యేపై అవినీతి ఆరోపణలు చేయడంతోపాటు తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయానికి పలుమార్లు తరలివచ్చి తమ అసంతృప్తిని బాహాటంగా వ్యక్తం చేశారు. అయితే వైసీపీ రీజినల్‌ కోఆర్డినేటర్లు గోపిరెడ్డి వైపే మొగ్గుచూపడంతో సీఎం ఇంటి ముందు అసమ్మతి నేతలు నిరసనకు కూడా దిగారు.

గోపిరెడ్డి నాయకత్వంలో తాము పని చేయబోమని.. తమలోనే ఎవరికైనా సీటు ఇవ్వాలని అసమ్మతి నేతలు డిమాండ్‌ చేస్తున్నారు. మరోవైపు ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి వచ్చే ఎన్నికల్లోనూ తనకే సీటు ఖరారైందని ప్రచారం చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో అసమ్మతి నేతలు మరింత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి పల్నాటి పోరును వైసీపీ అధిష్టానం ఎలా చల్లారుస్తుందో వేచిచూడాల్సిందే.

Tags:    

Similar News