జగన్ కటౌట్ చాలా...ఎలక్షన్ టీం రెడీనా...?
ఈసారి కూడా ఓటమి ఎదురైతే టీడీపీ భవిష్యత్తు మీద పూర్తిగా నీలి నీడలు కమ్ముకుంటాయి అన్నది తెలిసిందే.
వచ్చే ఎన్నికలు ఆషామాషీవి కావని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అనేక సభలలో తానుగానే చెప్పుకొచ్చారు. అవి కురుక్షేత్ర యుద్ధం లాంటివి అని ఉపమానం కూడా చెప్పారు. అంటే ఢీ అంటే ఢీ అన్నట్లుగానే సాగుతాయి. ఇక టీడీపీకి ఈ ఎన్నికలు చావో రేవో లాంటివి. ఈసారి కూడా ఓటమి ఎదురైతే టీడీపీ భవిష్యత్తు మీద పూర్తిగా నీలి నీడలు కమ్ముకుంటాయి అన్నది తెలిసిందే.
అలాగే జనసేన పార్టీ పెట్టి పదేళ్ళు అయినా ఎమ్మెల్యే కాకుండా ఉన్న పవన్ కళ్యాణ్ కి 2024 ఎన్నికలు ఇంకా ఎక్కువ కీలకం. ఈసారి తనకంటూ కొంతమంది ఎమ్మెల్యేలతో తాను సగౌరవంగా అసెంబ్లీలో అడుగుపెట్టాలని ఆయన పట్టుదలగా ఉన్నారు. అందుకే ఆయన ఈసారి భేషజాలకు ప్రయోగాలకు కూడా పోవడం లేదని అంటారు.
ఈ పరస్పర అవసరాలు అవగాహనతోనే జనసేన టీడీపీ రెండూ పొత్తు పెట్టుకున్నాయి. జతగా ఎన్నికలను ఎదుర్కోబోతున్నాయి. ప్రాణం పెట్టి పనిచేసేందుకు కూడా డిసైడ్ అయ్యాయి. కసి ప్లస్ కృషి ఎపుడూ విజయాన్ని నమోదు చేస్తుంది. ప్రత్యర్ధి పార్టీలలో అవి స్పష్టంగా ఉన్నాయి. దానికి తోడు వైసీపీ సర్కార్ అధికారంలోకి వచ్చాక టీడీపీ నేతల మీద పెట్టిన కేసులతో క్యాడర్ కి అధికారం అవసరం బాగా తెలిసి వచ్చింది అని కూడా అంటారు
అలా వైసీపీ వారికి కర్తవ్య బోధన చాలానే తనకు తెలియకుండా చేసింది అని అంటారు.
ఈ నేపధ్యంలో ఈసారి ఎన్నికలు వైసీపీకి కూడా చాలా ముఖ్యం. అయితే విపక్షంలో వైసీపీ ఉన్నా మరో ఎన్నికలకు చాన్స్ ఉంటే ఉండొచ్చు. ఇదొక్కటే వైసీపీకి ఊరట కలిగించే పరిణామం తప్ప మిగిలినది అంతా విపక్షంతో సేం టూ సేం. అంటే వారికి అధికారం ఎంత ముఖ్యమో వైసీపీకి అంతే ముఖ్యం.
పైగా రాజకీయాల్లో అంతా ఈ రోజే చూసుకోవాలి. రేపు అన్న మాట లేదు. ఒకసారి కనుక రేపు అని కాలు బార చాపితే రాజు ఎవరో మంత్రి ఎవరో అన్నది కూడా తెలియకుండా పోతుంది. ఈ క్రమంలో వైసీపీ ఎన్నికల ఏర్పాట్లు ఎలా ఉన్నాయి అన్నది కనుక ఒక్కసారి గమనంలోకి తీసుకుంటే కొంత నిరాశాపూరితంగానే అని అంటున్నారు. ఎటు నుంచి ఎలా చూసుకున్న జగన్ తప్ప వైసీపీలో స్టార్ కాంపెనియర్ వేరొకరు లేరు.
తాజాగా జరిగిన తెలంగాణా ఎన్నికల ప్రచారంలో బీయారెస్ ని విపక్షాలు ఎలా మూకుమ్మడిగా దాడి చేశాయో అంతా చూశారు. పొత్తులు లేకపోయినా అంతా కలబడి మరీ నిలువరించే ప్రయత్నం చేశారు. అయితే బీయారెస్ లో కేసీయార్ కి తోడుగా కేటీయార్, హరీష్ రావు, కవిత గట్టిగా నిలబడ్డారు. వైసీపీలో అలాంటి సీన్ ఉందా అన్నదే ప్రశ్నగా ఉంది అంటున్నారు. ఏపీలో అలా కాదు విపక్షాలు పొత్తులతో వస్తున్నాయి. దాంతో అక్కడ చూస్తే చాలా మంది నేతలు ఒక్కటిగా వైసీపీని చీల్చి చెండాడేందుకు సిద్ధంగా ఉంటారు.
చంద్రబాబు ఆయన కుమారుడు లోకేష్ అలాగే పవన్ కళ్యాణ్ అంతా కలసి ఎన్నికల యుద్ధం చేస్తారు. అలాగే పొత్తులు మిగిలిన పార్టీలతో ఉంటే వారు కూడా దిగుతారు. ఎన్నికల వేళకు బీజేపీ కూడా జత కడితే కేంద్ర పెద్దలు ఏపీలోనే మకాం పెట్టేస్తారు. ప్రధాని స్థాయి వ్యక్తులు అయితే ఒకటికి పది సభలలో పాలు పంచుకుంటారు. అమిత్ షా వంటి వారూ అలాగే వస్తారు. కాంగ్రెస్ నుంచి చెప్పాల్సిన పని లేదు. రాహుల్ ప్రియాంకా పెద్ద ఎత్తున సభలలో పాలుపంచుకుంటారు.
మరి ఇంతలా విపక్షం వైసీపీని టార్గెట్ చేస్తే వైసీపీ నుంచి జగన్ మాత్రమే ఉన్నారు. గత ఎన్నికల్లో విరివిగా ప్రచారం చేసిన వైఎస్ విజయమ్మ, వైఎస్ షర్మిలమ్మ మారిన రాజకీయ నేపధ్యంలో పూర్తిగా తెలంగాణాకే పరిమితం అవుతారు అని అంటున్నారు. దాంతో ఏపీలోని మొత్తం 175 సీట్లలో జగన్ తిరగాలి. ఆయన సీఎం గా ఉంటూ ప్రచారం చేయడం కూడా కొంత కష్టసాధ్యంగా ఉంటుంది. అయినా చేయాలి.
ఇదిలా ఉంటే సామాజిక సాధికార యాత్రలలో మంత్రులు మాకు జగన్ కటౌట్ చాలు అని అంటున్నారు. ఈ సభలు అన్నీ కూడా వైసీపీ బలాన్ని చాటుతాయా అంటే ఎంతవరకూ అన్న ప్రశ్న వస్తుంది. అధికారంలో ఉన్న పార్టీ కాబట్టి మంత్రులు సామంతులు అంతా వస్తారు కాబట్టి ఈ సభలు సక్సెస్ కావడానికి తగిన ఏర్పాట్లు ఉంటాయి.
రేపు ఎన్నికల సమరం మొదలైంది అంటే ఇవేమీ ఉండదు, ఎవరికి వారు తమ నియోజకవర్గాలలో పోరాడాల్సిందే. అపుడు ఏపీ అంతా తిరగాలి అంటే స్టార్ కాంపెనియర్లు ఉండాలి. వైసీపీలో అలాంటి వారు ఉన్నారా అంటే ఈ రోజుకు అయితే జవాబు లేదు మరి అనూహ్యంగా ఎవరైనా తెర మీదకు వస్తారా లేక జగన్ కటౌట్ సరిపోతుందా అన్నదే వైసీపీలోనూ బయటా చర్చకు వస్తున్న విషయం.