ఈ డిక్లరేషన్ వర్కవుటవుతుందా ?
తెలంగాణాకు తొందరలో జరగబోయే ఎన్నికల్లో ఎస్సీ, ఎస్టీ ఓట్లను ఆకర్షించేందుకు కాంగ్రెస్ పార్టీ ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ చేసింది.
తెలంగాణాకు తొందరలో జరగబోయే ఎన్నికల్లో ఎస్సీ, ఎస్టీ ఓట్లను ఆకర్షించేందుకు కాంగ్రెస్ పార్టీ ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ చేసింది. డిక్లరేషన్ చేయటం అంటే పార్టీ అధికారంలోకి వస్తే చేయబోయే పనులు, అమలుచేయబోయే సంక్షేమపథకాలపై హామీలు ఇవ్వటమే. ఇప్పటికే రైతు డిక్లరేషన్, యువత, మహిళా, మైనారిటి డిక్లరేషన్లు ప్రకటించిన విషయం తెలిసిందే. చేవెళ్ళ నియోజకవర్గం కేంద్రంలో కాంగ్రెస్ భారీ బహిరంగసభ ఏర్పాటుచేసింది. ఈ సభకు పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వచ్చారు.
డిక్లరేషన్ను ఖర్గేనే ప్రకటించారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన బహిరంగసభ బాగానే జరిగిందనే అనుకోవాలి. ఇంతకీ డిక్లరేషన్లో విషయం ఏమిటంటే ఇందిరమ్మ ఇళ్ళపథకంలో ఇళ్ళులేని ఎస్సీ, ఎస్టీలకు ఇళ్ళు ఇస్తారట. పేదలు ఇళ్ళు కట్టుకునేందుకు రు. 6 లక్షల సాయం అందిస్తారట. పోడు భూములకు గిరిజనుల పేరుతో పట్టాలు ఇచ్చేస్తామని హామీ ఇఛ్చారు. ఎస్సీల కోసం ఏకంగా మూడు కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.
ప్రతి కార్పొరేషన్ ద్వారా ఏడాదికి రు. 750 కోట్లు ఖర్చు చేస్తారట. ఇలాంటి హామీలను డిక్లరేషన్లో చాలానే ఇచ్చారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఎస్సీలకు 19 నియోజకవర్గాలు, ఎస్టీలకు 12 నియోజకవర్గాలున్నాయి. ఇప్పుడు 31 నియోజకవర్గాల్లో అత్యధికం బీఆర్ఎస్ ఖాతాలోనే ఉన్నాయి. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున గెలిచిన ఎంఎల్ఏలను కేసీయార్ ఏదో ఒక ప్రలోభానికి గురిచేసి లాగేసుకున్నారు.
మరి వచ్చేఎన్నికల్లో రాజకీయం ఎలాగ ఉండబోతోందో తెలీటంలేదు. జనాల్లో అయితే కేసీయార్ పాలనపైన విపరీతమైన వ్యతిరేకత కనబడుతోంది. కాంగ్రెస్ నేతల్లో కూడా మంచి ఉత్సాహం కనబడుతోంది. అయితే నేతల్లో ఉత్సాహం ఎంతగా ఉందో విభేదాలు కూడా అంతే ఉన్నాయి. సీనియర్లను ఏకతాటిపైకి తీసుకురావాలన్న అధిష్టానం ప్రయత్నాలు ఎంతవరకు ఫలించాయో అర్ధంకావటంలేదు. ఇప్పటికైతే నివురుగప్పిన నిప్పులాగున్న సీనియర్ల విభేదాలు రేపు టికెట్ల కేటాయింపు సందర్భంగా బయటపడతాయి. అప్పుడు గనుక ఎలాంటి గొడవలు జరగకుండా ప్రశాంతంగా జరిగిపోతే తర్వాత ప్రచారం కూడా జరిగితే మెజారిటి స్ధానాలను కాంగ్రెస్ గెలుసుకునే అవకాశాలున్నాయి. లేకపోతే అంతే సంగతులు.