జగన్... లేచి పడిన తరంగం !

షెడ్యూల్ ప్రకారం 2029లో ఎన్నికలు వస్తే కనుక ఆనాటికి జగన్ వయసు అచ్చంగా 57 ఏళ్ళకు దగ్గర పడుతుంది. వైఎస్సార్ 55 ఏళ్ల ఏజ్ లో తొలిసారి సీఎం అయ్యారు.

Update: 2024-12-21 13:30 GMT

వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ 53వ పడిలోకి అడుగు పెట్టారు. రాజకీయంగా చూస్తే ఆయన ఇంకా యువకుడే. మామూలు సగటు జనం పరిభాషలో ఆ ఏజ్ ని చూస్తే నడి వయసులోకి వచ్చిన వారి కింద లెక్క. జగన్ వరకూ చూస్తే ఒక మెచ్యూరిటీ ఉన్న పొలిటీషియన్ గానే చూస్తారు.

ఇక రాజకీయ అనుభవం జగన్ ది చూస్తే పదిహేనేళ్ళ పై దాటి ఉంది. ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లోకి 2009 మేలో జరిగిన ఎన్నికలతో కడప నుంచి ఎంపీగా పోటీ చేశారు. ఆయన వెనక అపుడు రాజకీయ దిగ్గజం వైఎస్సార్ ఉన్నారు. ఆ రోజులలో వైఎస్సార్ అన్న మూడు అక్షరాలు ఉమ్మడి ఏపీలో ప్రభంజనం మాదిరిగా ఉండేవి.

అలా తండ్రి చాటు బిడ్డగా వచ్చిన జగన్ కొండంత అండను కేవలం మూడు నెలల ఎంపీ వయసులోనే కోల్పోయారు. ఆ తరువాత నుంచి ఆయన సొంత పోరాటమే అయింది. కాంగ్రెస్ నుంచి ఆయన వేరుపడింది 2010 చివరిలో. ఆ తరువాత ఆయన 2011 మార్చిలో వైసీపీ పేరుతో కొత్త పార్టీని స్థాపించారు. అదే ఏడాది మేలో జరిగిన కడప ఉప ఎన్నిక, పులివెందుల ఉప ఎన్నికల్లో భారీ ఆధిక్యంతో గెలిచారు.

ఇక జగన్ ని 2012 మేలో అరెస్ట్ చేశారు. 2013 సెప్టెంబర్ దాకా అంటే ఏకంగా పదహారు నెలల పాటు ఆయన జైలులో ఉన్నారు. 2012 ఉప ఎన్నికలు జగన్ జైలులో ఉన్నపుడే వచ్చాయి. అలా జగన్ వాటిలో తొంబై శాతం పైగా గెలుచుకుని వైసీపీ సత్తా చాటారు. 2014లో తృటిలో అధికారం కోల్పోయారు. పిన్న వయసులోనే ఏపీకి ప్రతిపక్ష నేతగా వ్యవహరించారు.

ఇంకో వైపు చూస్తే జగన్ ఆనాడు దేశంలోనే అత్యంత బలమైన నాయకురాలుగా ఉన్న సోనియాగాంధీని ఎదిరించారు. అలాగే రాజకీయ దురంధరుడు చంద్రబాబుని కూడా ఏకకాలంలో ఎదుర్కొన్నారు. ఇలా తనలోని ఫైర్ ని జోరుని చూపిస్తూ 2019 ఎన్నికల దాకా సాగారు. ఈ క్రమంలో ఆయన చేపట్టిన పాదయాత్ర ఒక సంచలనం అయింది.

ఇక చూడాల్సింది ఏంటి అంటే 2019లో వైసీపీకి 151 సీట్లు దక్కడం. అలా తిరుగులేని నేతగా అయిదేళ్ళ పాటు సీఎం గా వ్యవహరించారు. అయితే జగన్ మొత్తం పదిహేనేళ్ళ రాజకీయ జీవితాన్ని చూస్తే ప్రతిపక్షంలో ఉన్నపుడు అధికారంలో ఉన్నపుడు అని విభజించాలని అంటారు. విపక్షంలో ఉన్నపుడు ఆయనలో ఫైర్ వేరే లెవెల్ లో ఉండేది. క్యాడర్ తో జనంతో మమేకం అవుతూ వచ్చారు

అదే అధికారంలో ఉన్నపుడు మాత్రం తాడేపల్లి ప్యాలెస్ కే పరిమితం అయ్యారని లీడర్స్ ని క్యాడర్ ని దూరం పెట్టారని కూడా ప్రచారంలో ఉంది. దాని వల్లనే ఆయన తిరిగి విపక్షం లోకి వచ్చారు అన్నది కూడా రాజకీయ విశ్లేషణ.

గత ఆరున్నర నెలలుగా జగన్ మళ్లీ విపక్షంలో ఉంటున్నారు. జగన్ కి విపక్షం కొత్త కాదు కానీ అధికారమే కొత్త. అందుకే ఆయన ఆ సమయంలో ప్రభుత్వాన్ని పార్టీని బ్యాలెన్స్ చేసుకోవడంలో తడబడ్డారా అన్న చర్చ ఉంది. ఇక ఎవరెన్ని చెప్పినా జగన్ ది ఒక విభిన్న పంధాలో సాగే రాజకీయం. ఆయన రొటీన్ పాలిటిక్స్ కి దూరం.

ఆయన అనుకున్నదే చేస్తారు అని అంటారు. భారీ ఓటమి దక్కినా ఈ రోజుకీ జనాలు దేవుడు మళ్లీ తనను గెలిపిస్తారు అని ఆయన నమ్ముతున్నారు. ఈ క్రమంలో మధ్యలో ఉన్నది క్యాడర్ లీడర్ ని కూడా దారికి తెచ్చుకునే ప్రయత్నం అయితే మెల్లగా సాగుతోంది. అయితే జగన్ లో మునుపటి ఫైర్ చూడాలని క్యాడర్ కోరుకుంటోంది. అలాగే ఆయన జనంతో మమేకం కావాలని అంటున్నారు.

పడి లేచి పడిన తరంగంగా ప్రస్తుతం జగన్ రాజకీయ దశ సాగుతోంది. తిరిగి ఉవ్వెత్తిన కెరటంగా ఎగిసిపడాలని పార్టీ జనాలు కోరుతున్నారు. జగన్ పుట్టిన రోజు వేళ వైసీపీ నేతలు కాబోయే సీఎం ఆయనే అంటున్నారు. అయితే రాజకీయాల్లోనే కాదు ఏ రంగంలో అయినా ఏ విషయంలో అయినా దక్కిన వస్తువు కానీ పదవి కానీ డబ్బు కానీ మరేది అయినా చేజారింది అంటే తిరిగి దక్కించుకోవడం అసాధ్యం కాదు

కానీ చాలా కష్టించాల్సి ఉంటుంది. మరి వైసీపీ అధినేత ఏ వ్యూహాలతో హాల్తో ముందుకు సాగుతారు అన్నది చూడాలి. షెడ్యూల్ ప్రకారం 2029లో ఎన్నికలు వస్తే కనుక ఆనాటికి జగన్ వయసు అచ్చంగా 57 ఏళ్ళకు దగ్గర పడుతుంది. వైఎస్సార్ 55 ఏళ్ల ఏజ్ లో తొలిసారి సీఎం అయ్యారు. మరి తండ్రి మాదిరిగా రాజకీయ స్థితప్రజ్ఞతను చూపిస్తూ ప్రత్యర్ధుల వ్యూహాలకు ధీటైన ప్రతి వ్యూహాలు రూపొందిస్తే కనుక పడిన కెరటం మళ్ళీ ఉవ్వెస్త్తున ఎగిసి నింగిని చుంబిస్తున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.

Tags:    

Similar News