జగన్ మారలేదు...ఇంకా అదే భ్రమలలో ఉన్నారు !

కానీ వైసీపీ అధినేత వైఎస్ జగన్ విషయంలో ఇది తప్పు అవుతోందా అన్న చర్చ సాగుతోంది.

Update: 2025-02-06 03:30 GMT

అధికారంలో ఉన్నపుడు అదొక మత్తుగా గమ్మత్తుగా ఉంటుంది. అందలం ఎక్కిన వారిని అదే చివరికి చిత్తు చేస్తుంది. ఎపుడైతే అధికారం మత్తు వదులుతుందో వాస్తవాలు కళ్ళ ముందు కనిపిస్తాయి. అపుడు ఎవరేమిటి అన్నది కూడా బాగానే అర్ధం అవుతుంది అంటారు. విపక్షంలో ఉన్న వారు పక్కాగా నేల మీదనే నిలబడతారు అని చెబుతారు. కానీ వైసీపీ అధినేత వైఎస్ జగన్ విషయంలో ఇది తప్పు అవుతోందా అన్న చర్చ సాగుతోంది.

ఎందుకంటే ఆయన ఇంకా తాను మారలేదు అని తన ప్రకటనల ద్వారా రుజువు చేసుకుంటున్నారు అని అంటున్నారు. వైసీపీ 2019లో అధికారంలోకి వచ్చిన కొత్తలో అయితే ముప్పయ్యేళ్ళు మనదే అధికారం అని జగన్ ఇచ్చిన భారీ స్టేట్మెంట్ అందరికీ ఆకట్టుకుంది. ఎక్కువ మంది దానిని నమ్మారు కూడా. అయితే వారు కూడా కనీసం రెండు టెర్ములు జగన్ కి పవర్ ఖాయమని అనుకున్నారు.

కానీ అధికారం అద్భుతమైన మెజారిటీతో దక్కడంతో వైసీపీ అధినాయకత్వం నేల విడిచి చేసిన సాము వల్ల ఘోర ఓటమిని అయిదేళ్ళకే మూటకట్టుకుని తాను ఉన్న చోటకే తిరిగి వచ్చి చేరింది. ఎక్కడ 151 సీట్లు మరెక్కడ 11 సీట్లు. దాంతో వైసీపీ ఆత్మ పరిశీలన చేసుకుంటుందని అంతా భావించారు. జరిగిన పొరపాట్లను పునరావృత్తం కాకుండా చూసుకుని జనం వద్దకు వెళ్తుందని కూడా అనుకున్నారు.

కానీ వైసీపీ అధినాయకత్వం మాత్రం మళ్లీ అదే పాట పాడుతోంది. ముప్పయ్యేళ్ళ సీఎం అని అంటున్నారు జగన్. జగన్ చెప్పిన ఈ మాటే ఇపుడు ప్రత్యర్ధి పార్టీలకు ఆయుధంగా మారుతోంది. ఎన్నికలు జరిగి ఏడాది కాలేదు. వైసీపీకి కళ్ళ ముందే ఘోర ఓటమి ఉంది. సరే రాజకీయాల్లో ఆశావాదం మంచిది అనుకున్నా మరీ ఊహల్లో విహరించకూడదు అని కూడా అంటారు కదా.

అలా చూస్తే కనుక జగన్ ఇచ్చిన ఈ ప్రకటన వల్ల రాజకీయ లాభం కంటే విమర్శలే ఎక్కువగా వస్తున్నాయని అంటున్నారు. ఇక జగన్ ముప్పయేళ్ళ సీఎం అన్నది ప్రాక్టికల్ గా ఆలోచిస్తే ఆయన వయసు ఇపుడు 52 ఏళ్ళు. మరో నాలుగేళ్ళకు కానీ ఎపీలో ఎన్నికలు ఉండవు. అప్పటికి 56 ఏళ్ళ వారుగా జగన్ ఉంటారు. అక్కడ నుంచి వరసబెట్టి వైసీపీ గెలిచినా ముప్పయ్యేళ్ళ పాటు అంటే జగన్ దాదాపుగా తొమ్మిది పదుల వయసు దాకా సీఎం గానే ఉంటారా జనాలు ఆయననే ఉంచుతారా అంటే ఈ రకమైన ఆలోచన తర్కానికి సైతం అందడం లేదు.

చంద్రబాబుని ఒక వైపు వయసు మీద పడిన వారు అని డెబ్బయి ఏళ్ళు ఉన్నప్పటి నుంచే వైసీపీ నేతలు ర్యాగింగ్ చేస్తూ వస్తున్నారు. మరి ఈనాటి కాలానికే బాబు వైసీపీ వారికి ముసలోడు అయితే యూత్ ఆలోచనలు జెట్ స్పీడ్ తో పరుగులు తీస్తున్న వేళ రానున్న కాలమంతా టెక్నాలజీ డామినేట్ చేసే క్రమంలో ట్రెడిషనల్ మెదడ్స్ కి అంతటా చెక్ పెడుతూ దూసుకెళ్ళే ఫ్యూచర్ జనరేషన్ కి జగన్ అన్న వారు వయోవృద్ధుడు అయినా ముద్దుగా ఎప్పటికీ సీఎం గా కనిపిస్తారా వారే ఒప్పుకుని ఓటేస్తారా అన్నది ఒక చర్చ.

సరే అదీ నిజమేనని అనుకుని సరిపెట్టుకున్న గుర్రం ఎగరావచ్చు అని సర్దిచెప్పుకున్నా ఇపుడు వైసీపీ ఉన్న పరిస్థితులు ఏమిటి అన్నది ఆకళింపు చేసుకోవాలి కదా అన్న చర్చ సాగుతోంది. బాబుకు వారసుడిగా బలంగానే లోకేష్ ఎదుగుతున్నారు. అందరి ఆలోచనలను తల్లకిందులు చేస్తూ తన సమర్ధతను చాటుకుంటున్నారు. అలా టీడీపీకి లోకేష్ బలమైన నేతగా దూసుకుని రావడం ఖాయం. పవన్ కళ్యాణ్ ఆయన జనసేన కూడా ఉండనే ఉంటాయి. ఆయన బలాన్ని తక్కువగా అంచనా వేయలేరు.

రానున్న రోజులలో ఏ జూనియర్ ఎన్టీఅర్ లాంటి వారో పార్టీ పెట్టి ముందుకు రావచ్చు. లేక మరింతమంది బలవంతులు సామాజిక రాజకీయ శక్తివంతులు రంగంలోకి దూకవచ్చు. అందువల్ల ముప్పయ్యేళ్ళ సీఎం కల అటుంచితేనే మంచిది అని జగన్ కి సూచనలూ వస్తున్నాయి. ముందు 2029 ఎన్నికలు ఎలా గెలవడం అన్నది ఆలోచించాలని సూచిస్తున్నారు. దాని కంటే ముందు 2026లో వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలని కూడా కోరుతున్నారు.

ఇక పార్టీ క్యాడర్ కి బూస్టింగ్ ఇచ్చేందుకు ఈ తరహా ప్రకటనలు బాగున్నా పార్టీని ఫోర్ ఫ్రంట్ లో నిలబెట్టేది మాత్రం యాక్షనే అని అంటున్నారు. జగన్ మరోసారి 2014 నాటి లీడర్ గా మారాలి. జనంలోకి రావాలి మమేకం కావాలి. పార్టీ క్యాడర్ ని దగ్గరకు తీయాలి. లీడర్స్ కి భరోసా ఇవ్వాలి. ఇవన్నీ చేసుకుంటే వచ్చే ఎన్నికల్లో ఆశలు ఉంటాయి. అయితే నేల విడిచి సాము చేసే చందంగా విపక్షంలో ఉంటే మాత్రం ప్రత్యర్థి పార్టీల నుంచి ఎద్దేవాలే మిగులుతాయని కూడా అంటున్నారు.

Tags:    

Similar News