జగన్‌కు ఇది మంచి సమయం..!
కొన్ని కొన్ని సందర్భాలు.. మనం వాడుకునే దాన్ని బట్టి కలిసి వస్తాయి. వ్యక్తిగతంగానే కాకుండా.. రాజకీ యంగా కూడా కొన్ని కొన్ని సందర్భాలు ఇలానే వస్తూ ఉంటాయి
కొన్ని కొన్ని సందర్భాలు.. మనం వాడుకునే దాన్ని బట్టి కలిసి వస్తాయి. వ్యక్తిగతంగానే కాకుండా.. రాజకీ యంగా కూడా కొన్ని కొన్ని సందర్భాలు ఇలానే వస్తూ ఉంటాయి. వాటిని వాడుకునే ప్రయత్నం చేస్తే.. నాయకులకు మంచి సమయం చిక్కినట్టే అవుతుంది. ఇప్పుడు ఇలాంటి సమయం వైసీపీ అధినేత జగన్‌కు వచ్చింది. గత ఐదేళ్ల పాలనపై కూటమి పార్టీలు చేస్తున్న ప్రచారానికి.. సమాధానం చెప్పుకొనేం దుకు అవకాశం లభించింది. మరి దీనిని ఆయన వాడుకుంటారా? లేదా? అనేది చూడాలి.
ఆసమయమే.. అసెంబ్లీ. సోమవారం నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అవుతున్నాయి. ఈ క్రమంలో ప్రతిపక్ష నేతగా(ప్రధాన కాదు) జగన్‌కు ఆహ్వానం కూడా అందించారు. స్పీకర్ కార్యాలయం నుంచి ఫార్మల్‌గానే ఈ సందేశ ఆహ్వానం వస్తుంది. దీనిని బట్టి ఆయన ఆయా సభలకు హాజరు కావాల్సి ఉంటుంది. కానీ, ఇప్పుడు జగన్ చెప్పిన దాని ప్రకారం.. తనకు మైకు ఇవ్వరు కాబట్టి .. తాను సభకు వెళ్లి ఏంచేయాలని ప్రశ్నిస్తున్నారు. అదేదో మీడియ ముందు మాట్లాడతామన్నారు.
కానీ, మీడియా ముందు నిరంతరం.. ఎంతో మంది మాట్లాడుతున్నారు. కొన్ని వందల మంది శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు వందల మంది మాట్లాడతారు. కానీ.. సభలో మాట్లాడే అవకాశం 175 మందికి మాత్రమే దక్కుతుంది. ఆ అవకాశం పులివెందుల ప్రజలు జగన్‌కు ఇచ్చారు. సో.. ఆయన సభకు వెళ్లి మాట్లాడడం ద్వారా ప్రజల సమస్యలను ప్రస్తావించడంతోపాటు.. గత ఐదేళ్లు పాలనపై జరుగుతున్న కూటమి ప్రచారానికి సమాధానం చెప్పే అవకాశం కూడా దక్కనుంది.
ఒకవేళ.. జగన్ చెప్పినట్టే తనకు మాట్లాడే సమయం ఇవ్వకపోతే.. ఆ విషయాన్ని సభలోనే ఆయన ప్రకటించి బయటకు రావొచ్చు. తనకు మాట్లాడేందుకు సమయం ఇవ్వలేదని చెబితే.. ప్రజలు కూడా అర్థం చేసుకునే అవకాశం ఉంది. అలా కాకుండా.. అసలు సభకు వెళ్లేది లేదు.. అని భీష్మించుకుని కూర్చుంటే.. మొత్తానికి ఆయనను ఎందుకు ఎన్నుకున్నామా? అని ప్రజల నుంచి, ఇలాంటి వారితో రాష్ట్రానికి మేలేంటని కూటమి నేతల నుంచి కూడా సెగ తప్పదని అంటున్నారు పరిశీలకులు.