పండ్లున్న చెట్టుకే రాళ్ల దెబ్బలు.. జగన్ మిస్ అయిన పాయింట్ ఇదేనా?
ఇప్పుడు ఎదురైన సమస్యంతా డబ్బుల కోసమే అన్నది సుస్పష్టం. ఎప్పుడైనా పండ్లు ఉన్న చెట్టుకే దెబ్బలన్న విషయాన్ని మర్చిపోకూడదు.
తొందరపాటుతో కలిగే అనర్థాలు అన్ని ఇన్ని కావు. అనుకోని రీతిలో ఎదురయ్యే సమస్యలకు పరిష్కారం ఇదేనన్న కంక్లూజన్ కు రావటానికి మించిన తప్పు మరొకటి ఉండదు. జగన్ - షర్మిల పంచాయితీని చూస్తే.. జగన్ ఆస్తిని షర్మిల క్లెయిం చేయటం.. ఆ ఇష్యూ ఇప్పుడు వీధుల్లోకి రావటం తెలిసిందే. ఇలాంటి అంశాలపై స్పందించే సందర్భంలో విషయాల్ని సూటిగా ఎదుర్కొనే కన్నా.. తగిన జగ్రత్తల్ని తీసుకోవాల్సిన అవసరం ఉంది.
ఇప్పుడు ఎదురైన సమస్యంతా డబ్బుల కోసమే అన్నది సుస్పష్టం. ఎప్పుడైనా పండ్లు ఉన్న చెట్టుకే దెబ్బలన్న విషయాన్ని మర్చిపోకూడదు. ఒకవేళ.. జగన్ వద్ద డబ్బులే లేవనుకుందాం? షర్మిల ఏం చేసేవారు? అన్నది ప్రశ్న. రాజకీయాల్లో వైఎస్ సంపాదించింది ఎంతన్నది బహిరంగ రహస్యం. ఆయనది పెట్టే చెయ్యే కానీ.. ఆశించేతీరు ఆయనలో మచ్చుకు కనిపించదు. ఒకవేళ చేతికి డబ్బులు వచ్చినా.. వెంటనే వాటిని తాను ఇవ్వాల్సిన వారికి.. తనను నమ్ముకున్న వారికి ముందు సర్దేయటమే తప్పించి.. తన దగ్గర కుప్పలుకుప్పలుగా పోసుకోవాలన్న తహతహ ఆయనలో కనిపించదు.
అలాంటి వైఎస్ వైఖరికి భిన్నంగా జగన్ తీరు ఉందా? అన్న ప్రశ్న పలువురి నోట వినిపిస్తూ ఉంటుంది. ఇక్కడో విషయాన్ని మర్చిపోకూడదు. వైఎస్ తన పొలిటికల్ కెరీర్ లో సంపాదించిన దాంతో పోలిస్తే.. పోగొట్టుకున్నదే ఎక్కువ. ఆ క్రమంలో భాగంగా 2004 ఎన్నికల ముందు ఎంతటి ఆర్థిక గడ్డు పరిస్థితిని ఎదుర్కొన్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అప్పట్లో యువకుడైన జగన్ కు ఆ కష్టాలు.. నష్టాలన్ని తెలుసు. అందుకే వైఎస్ కు ఉండే భరోసా జగన్ లో ఉండదు. డబ్బును పెద్దగా పట్టించుకోని అంశంగా వైఎస్ భావిస్తారు. కానీ.. జగన్ మాత్రం దాన్ని ఒక పవర్ ఫుల్ వెపన్ గా చూస్తారు. ఈ తీరే.. వైఎస్ కు జగన్ కు స్పష్టమైన విభజన రేఖ గీసిందని చెప్పక తప్పదు.
కాలం కలిసి వచ్చి.. చంద్రబాబు చేసిన తప్పుల కారణంగా 2004లో వైఎస్ ముఖ్యమంత్రి అయ్యారు. అప్పటివరకు ఆయన ఎదుర్కొన్న ఆర్థిక గడ్డు పరిస్థితులు అందరికి తెలిసినవే. ఇవన్నీ చూసి పెరిగిన జగన్ కు.. డబ్బుల విషయంలో కాస్తంత జిద్దుగా ఉండటాన్ని అర్థం చేసుకోవచ్చు. కానీ.. తనకొచ్చిన ఇమేజ్.. తనకు వచ్చే పవన్ మొత్తం తన తండ్రి తీరుతోనే అన్న విషయాన్ని జగన్ మర్చిపోకూడదు. ఇలాంటి వేళలో.. ఆస్తులనే మెటీరియలిస్ట్ విషయాల మీద ఎక్కువ ఫోకస్ చేయకుండా ఉండాల్సింది. పండ్లు ఉన్న చెట్టుకే కాయలు అన్న చందంగా.. ఇప్పుడున్న పరిస్థితుల్లో తనపై ఒత్తిడి ఎక్కువ ఉంటుందన్న విషయాన్నిజగన్ గుర్తించి.. ముందస్తుగా తగిన జాగ్రత్తలు తీసుకొని ఉంటే మరింత బాగుండేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. తన వద్దనున్న ఆస్తులను చెల్లికి పంచటం ద్వారా పోయేదాని కంటే.. వచ్చేదే ఎక్కువన్న సింఫుల్ లాజిక్ ను ఆయన మిస్ అయినట్లుగా కనిపిస్తోంది.