వైసీపీ గేటు ఒక్క సారి దాటితే...జగన్ స్ట్రాంగ్ డెసిషన్
అదే సమయంలో ఎవరైనా సలహాలు ఇస్తే ఆయన స్వీకరించవచ్చు లేదా పక్కన పెట్టవచ్చు.
వైసీపీ అన్నది జగన్ కలల సౌధం. ఆయన ఆ పార్టీకి అధినేత. నేను మీ అందరికీ ప్రతినిధిని అని జగన్ తాజాగా పార్టీ నేతలతో అనవచ్చు కానీ జగన్ రెక్కల కష్టం వైసీపీ. జగన్ ఆశల రూపం వైసీపీ. జగన్ నిర్ణయమే అక్కడ ఫైనల్.
వైసీపీ బాగుండాలనే జగన్ ఆలోచిస్తారు. అదే సమయంలో ఎవరైనా సలహాలు ఇస్తే ఆయన స్వీకరించవచ్చు లేదా పక్కన పెట్టవచ్చు. ఇక వైసీపీలో ఉన్న వారు జగన్ ఆలోచనల మేరకు పనిచేయాలి. పార్టీ అంటే అలాగే ఉండాలి, ఒకే మాట మీద క్రమశిక్షణతో అన్నది జగన్ ఆలోచన.
జగన్ పార్టీ వయసు 13 ఏళ్ళు. మరో నాలుగు నెలలలో 14 ఏళ్ల పార్టీ అవుతుంది. అయితే ఈ తక్కువ టైం లో ఎన్నో ఆటుపోట్లను వైసీపీ చూసింది. జగన్ మూడున్నర పదుల వయసులోనే అతి పెద్ద రాజకీయ సవాల్ ఎదుర్కొన్నారు. దాంతో జగన్ కి కష్టాలు అలవాటు అయిపోయాయి. సవాళ్ళు కూడా ఆయన ఏవి వచ్చినా లెక్కచేయరు.
అయితే పార్టీ విపక్షంలో ఉండగా చేరడం వేరు. విపక్షం నుంచి అధికారంలోకి వచ్చి మళ్లీ విపక్షంలోకి వచ్చాక కొనసాగడం వేరు. ఈ తత్వం సరిపడని వారు పార్టీ గేటుని దాటి బయటకు వెళ్ళిపోయారు. అందులో జగన్ సొంత బంధువు అయిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఉన్నారు.
అదే విధంగా వైఎస్సార్ ఫ్యామిలీకి విధేయంగా ఉన్న మాజీ ఉప ముఖ్యమంత్రి ఆళ్ళ నాని, మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ, కిలారి రోశయ్య, ఉదయభాను వంటి వారు ఉన్నారు. అయితే ఇలా వెళ్ళిన వారి విషయంలో వైసీపీ ఏమీ పిలిచి బతిమాలింది లేదు. పార్టీ ఓటమి పాలు అయింది. అయిదేళ్ల పాటు ఎన్నో సవాళ్ళు ఉంటాయి. వాటికి తట్టుకుని ఉండేవారు ఉంటారు అన్నదే వైసీపీ అధినాయకత్వం ఆలోచన.
పైగా ప్రజల నుంచే నేతలు వస్తారు అన్నది కూడా వైసీపీ మాట. అధికారంలో ఉన్న ప్రభుత్వం ఎన్ని చేసినా వ్యతిరేకత కచ్చితంగా వస్తుందని ఆ వ్యతిరేకత ప్రతిపక్షానికి సొమ్ము అవుతుందని అపుడు జనాల నుంచే నాయకులు వచ్చి జెండా ఎత్తుతారని కూడా వైసీపీ నమ్మకంగా ఉంది.
ఇక పార్టీలో ఉన్న నేతలతోనే బండిని నడిపించాలని కూడా డిసైడ్ అయింది. అదే సమయంలో వైసీపీ ఎన్నడూ లేనంతగా కేవలం 11 సీట్లకే పరిమితం అయి దారుణంగా ఉన్న వేళ ఈ కష్టకాలంలో పార్టీని విడిచి వెళ్ళిన వారి పట్ల వైసీపీ అధినాయకత్వం అయితే సీరియస్ గానే ఉంది అని అంటున్నారు.
ఇలా వెళ్ళిన వారు కూటమి అధికారంలో ఉంది కదా అని తమకు అవకాశాలు ఉంటాయని భావించి ఉంటారని అనుకుంటోంది. ఒకవేళ అక్కడ అవకాశాలు దక్కకపోతే మాత్రం వారు కచ్చితంగా మళ్లీ వెనక్కే వస్తారు అని కూడా భావిస్తోంది.
అయితే అలా వెనక్కి వచ్చినా వారిని తిరిగి తీసుకునే ప్రసక్తే లేదని వైసీపీ హై కమాండ్ గట్టి నిర్ణయంతో ఉంది అని అంటున్నారు. పార్టీకి నేతలు కావాలి కానీ కష్ట కాలంలో వదిలేసి మళ్లీ తమకు అవసరం అనుకునపుడు వచ్చే వారు అసలు వద్దు అన్నది వైసీపీ ఆలోచనగా చెబుతున్నారు.
చాలా చోట్ల కొత్త నాయకత్వానికే చాన్స్ ఇవ్వాలి తప్ప మళ్లీ పార్టీని వీడి వచ్చి తలుపు తడితే మాత్రం గేటు తెరచుకోదు అని చెబుతున్నారు. ఇది వైసీపీ హై కమాండ్ పార్టీలో ఉన్న నాయకులకు చెబుతోందిట. బాగా ఆలోచించుకుని వైసీపీలోనే కొనసాగితే మంచి అవకాశాలు ఇస్తామని చెబుతోంది.
అలా కాకుండా తమకు నచ్చినపుడు బయటకు వెళ్ళి అవసరం అయినపుడు వెనక్కి తిరిగి వస్తామనుకుంటే కనుక వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ చేరదీసేదే లేదు అని కూడా చెబుతోంది. మొత్తానికి చూస్తే వైసీపీ కఠిన నిర్ణయమే జంపింగ్ జఫాంగుల పట్ల తీసుకుంది అని అంటున్నారు.
వీరి సంగతి సరే కానీ టీడీపీ జనసేన నుంచి వచ్చే నేతలను తీసుకుంటారా అన్న చర్చ నడుస్తోంది. వారిని తీసుకుంటారని ఆయా చోట్ల తమకు బలం తగినంత కావాల్సిందే మాత్రం ఇతర రాజకీయ పార్టీలు చేసిన తీరుగానే చేస్తారు అని అంటున్నారు. సో వైసీపీని వీడిన మాజీలకు ఇక గేట్లు మూసినట్లే అని అంటున్నారు.