డిప్యూటీ సీఎం పవన్ పేషీలో ప్రమాదం.. హోంమంత్రి సంచలన నిర్ణయం
సచివాలయం రెండో బ్లాక్ వద్ద బ్యాటరీ గదిలో వేకువజామున మంటలు వ్యాపించాయని అక్కడి సిబ్బంది హోంమంత్రి అనితకు వివరించారు.;

ఏపీ సచివాలయంలోని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బ్లాక్ లో జరిగిన అగ్ని ప్రమాదంపై ప్రభుత్వం సీరియస్ గా ఫోకస్ చేసింది. ప్రమాద స్థలాన్ని పరిశీలించిన హోంమంత్రి అనిత.. మంటలు ఎక్కడ మొదలయ్యాయి? ఎలా వ్యాపించాయని ఆరా తీశారు. సచివాలయంలోని మంత్రులు అంతా ఉండే బ్లాక్ లో ప్రమాదం జరగడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. ముందుగా ప్రమాదంపై అధికారులతో సమీక్షించిన అనిత అనంతరం ఘటనా స్థలాన్ని పరిశీలించారు.
సచివాలయం రెండో బ్లాక్ వద్ద బ్యాటరీ గదిలో వేకువజామున మంటలు వ్యాపించాయని అక్కడి సిబ్బంది హోంమంత్రి అనితకు వివరించారు. మంటలు చెలరేగిన వెంటనే సచివాలయం భద్రతా విధుల్లో ఉన్న స్పెషల్ ప్రొటెక్షన్ పోలీసులు హుటాహుటిన స్పందించి మంటలను అదుపు చేయడానికి ప్రయత్నించారని, ఆ తర్వాత అగ్నిమాపక దళానికి సమాచారమిచ్చారని తెలిపారు. మొత్తం 8 నిమిషాల్లోనే మంటలు అదుపులోకి వచ్చినట్లు వివరించారు. దీంతో పెద్ద ప్రమాదం తప్పిందని హోంమంత్రి అనిత వ్యాఖ్యానించారు. మంటలు కారణంగా ఏసీలు, బ్యాటరీలు ద్వంసమయ్యాయి. పొగలు బ్లాక్ అంతా వ్యాపించాయి.
అయితే ప్రమాదానికి కారణాలు అన్వేషిస్తున్న ప్రభుత్వం.. షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటలు వ్యాపించాయని ప్రాథమికంగా నిర్థారించినట్లు చెబుతున్నారు. వేసవి వేడి కారణంగా బ్యాటరీ కూడా వేడెక్కి ఉంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ ప్రమాదాన్ని తేలిగ్గా తీసుకోవడం లేదని హోంమంత్రి అనిత స్పష్టం చేశారు. ఫోరెన్సిక్ సిబ్బందిని రప్పించి డిప్యూటీ సీఎం కార్యాలయ భద్రతను పర్యవేక్షిస్తామని తెలిపారు. ఫోరెన్సిక్, పోలీసు ద్వారా నివేదిక తెప్పించుకుని తదుపరి చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. అదేవిధంగా సచివాలయం మొత్తం ఫోరెన్సిక్ ఆడిట్ జరిపిస్తామని ప్రకటించారు. భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా చూసుకోవాలని హోంమంత్రి అధికారులను ఆదేశించారు.