జగన్ డిమాండ్ అత్యాశగానే ఉందిగా !
ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పడి గట్టిగా రెండు నెలలు కాలేదు. ఇంకా కుర్చీలలో ఎవరూ సర్దుకోలేదు.
ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పడి గట్టిగా రెండు నెలలు కాలేదు. ఇంకా కుర్చీలలో ఎవరూ సర్దుకోలేదు. అపుడే రాష్ట్రపతి పాలన అంటూ జగన్ డిమాండ్ చేయడం అత్యాశతో కూడుకున్నదే అని అంటున్నారు. నిజానికి ఏపీలో రాజకీయ దాడులు ఘర్షణలు జరుగుతున్నాయి.
దానికి కారణం రాజకీయంగా అటూ ఇటూ వేడెక్కి ఉంది. ఈసారి ఎన్నికలే హోరాహోరీగా సాగాయి. దానికి తగినట్లుగా అధినేతలు కూడా ఆనాడు దూకుడు చేశారు. వాటి ఫలితాలు ఇపుడు కనిపిస్తున్నాయని అంటున్నారు.
దీని వెనక క్యాడర్ తప్పుతో పాటు అధినాయకుల వైపు నుంచి తప్పు కూడా ఉంది అని అంటున్నారు. అయినా ఎవరూ హత్యా రాజకీయాలను కోరుకోరు. వాటికి ఎక్కడో ఒక చోట ఫుల్ స్టాప్ పడాల్సిందే. చంద్రబాబు అనుభవం కలిగిన నేత కాబట్టి ఆయన నాయకత్వంలోనే వీటికి అడ్డు కట్ట పడాలని అంతా కోరుకుంటున్నారు.
ఇక పోతే వైసీపీ మీద దాడులు జరిగాయని భావించి ఆ పార్టీ రచ్చ చేస్తోంది. ఆవేశపడుతోంది. దానికి గత కాలం సంగతేంటి అని అటు నుంచి ప్రశ్నలు వస్తున్నాయి. అయితే వారిని వీరూ వీరిని వారూ అలాగే చంపుకుంటూ పోతారా అన్న ప్రశ్నలూ ఉన్నాయి.
వీటిని పక్కన పెడితే రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ని కంట్రోల్ లో పెట్టాలని జగన్ డిమాండ్ చేయవచ్చు. ఏపీలో పరిస్థితులను అదుపులో పెట్టాలని మాట్లాడవచ్చు. అంతే తప్ప రాష్ట్రపతి పాలన అని డిమాండ్ చేయడం ఎంతవరకూ సబబు అన్న ప్రశ్న తలెత్తుతోంది.
ఎందుకంటే కొత్త ప్రభుత్వం మీద జనాలకు ఎన్నో ఆశలు ఉన్నాయి. ఎంతో ఆశ ఆకాంక్ష ఉండబట్టే బంపర్ మెజారిటీతో ఎమ్మెల్యేలను గెలిపించారు. రికార్డు స్థాయిలో సీట్లూ ఓట్లూ ఇచ్చారు. ఇంకా హానీమూన్ పీరియడ్ కంటిన్యూ అవుతోంది.
ఈలోగా ప్రభుత్వం రద్దు అని అంటూ రాష్ట్రపతి పాలన అని డిమాండ్ చేస్తే జనాలు కన్విన్స్ కారు సరికదా అధికార ఆకాంక్ష అనుకుంటారు. నిజానికి వైసీపీకి ఎంతో కొంత సానుభూతి ఈ రూపేణా వస్తోంది. దానిని జాగ్రత్తగా పోగు చేసుకుని పార్టీని తిరిగి నిర్మించేందుకు చూడాలని అంటున్నారు.
దీనికి ముందు కూడా ప్రతిపక్ష హోదా ఇవ్వమని జగన్ స్పీకర్ కి రాశారు. అది సైతం బూమరాంగ్ అయింది. ప్రతిపక్ష నేత హోదా అంటే కేబినెట్ ర్యాంక్ అని అంటూ వచ్చారు. పదవులు ఉంటేనే తప్ప జగన్ అసెంబ్లీకి రారా అని సెటైర్లు పడ్డాయి. ఇవన్నీ కలసి చూస్తే జగన్ కి అధికార కాంక్ష తప్ప మరొకటి పట్టదని అనుకునే ప్రమాదం ఉంది.
తన పార్టీ కేడర్ ని చంపుతూంటే ఆవేశం రావచ్చు. కానీ డిమాండ్ కూడా సహేతుకంగా ఉండాలని అలాగే జనం కోణం నుంచి కూడా ఆలోచన చేయాలని అంతా కోరుకుంటున్నారు. మొత్తానికి రాష్ట్రపతి పాలన డిమాండ్ సైతం బూమరాంగ్ అయ్యేలాగానే ఉంది అని అంటున్నారు.