జగన్ ఇక మాజీ సీఎం !

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అని అంతా రాస్తున్నారు. చూస్తున్నారు వింటున్నారు. ఇదంతా గత అయిదేళ్ళుగా సాగిన వ్యవహారం

Update: 2024-06-04 16:15 GMT

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అని అంతా రాస్తున్నారు. చూస్తున్నారు వింటున్నారు. ఇదంతా గత అయిదేళ్ళుగా సాగిన వ్యవహారం. అటువంటి జగన్ ఇపుడు మాజీ సీఎం అవుతున్నారు. ఆయన ఈ రోజు దాకా ఎన్నికల కోడ్ ఉన్నా ముఖ్యమంతే. అయితే ఇపుడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి.

అంటే కేర్ టేకర్ సీఎం అన్న మాట. జూన్ 4న విడుదల అయిన ఎన్నికల ఫలితాలలో వైసీపీ ఘోరంగా ఓటమి పాలు అయింది. కేవలం పది అసెంబ్లీ సీట్లను మాత్రమే సాధించింది. దాంతో జగన్ తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు.

ఆయన మంగళవారం సాయంత్రం రాజ్ భవన్ కి వెళ్ళి తన రాజీనామాను గవర్నర్ అబ్దుల్ నజెర్ కి అందచేశారు. ఆ రాజీనామాను వెంటనే గవర్నర్ అద్బుల్ నజీర్ ఆమోదించారు. ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా జగన్ కొనసాగుతారు. ఈ నెల 9న ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

దాంతో జగన్ ఆ రోజు నుంచి మాజీ సీఎం గా మారుతారు. ఇక ఆయన పార్టీకి అసెంబ్లీలో విపక్ష హోదాకు సరిపడా సీట్లు రాలేదు. కేవలం పది మాత్రమే దక్కాయి. దాంతో జగన్ ప్రతిపక్ష నాయకుడిగానే సభలో ఉంటారు. అంటే ఆయనకు క్యాబినెట్ హోదా అయితే ఉండదు.

ఇక అసెంబ్లీ మొత్తం అధికార టీడీపీ కూటమితో నిండిపోతుంది. ఇక వరుసక్రమం చూసుకుంటే 136 సీట్లతో టీడీపీ ఉంటే ఆ తరువాత స్థానంలో 21 సీట్లతో జనసేన ఉంటుంది, మిత్రపక్షంగా 8 సీట్లతో బీజేపీ ఉంటుంది. వైసీపీ ప్లేస్ అసెంబ్లీలో ఎక్కడ అంటే బీజేపీ కంటే ముందు అని మాత్రమే భావించాలి. ఇక అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్షానికి మాట్లాడేందుకు ఎక్కువ చాన్స్ ఇస్తారు. అది కూడా మెంబర్స్ ని బట్టి కూడా ఇస్తారు.

ఇపుడు ఆ ప్రధాన ప్రతిపక్ష హోదా లేదు, పైగా పది మందే కావడంతో అసెంబ్లీలో జగన్ కి మైక్ ఎలా ఇస్తారు ఆయనను ఎంతసేపు మాట్లాడిస్తారు అన్నది చూడాలి. అయితే మిగిలిన పక్షాలు మిత్రులు కాబట్టి ప్రతిపక్షంగా వైసీపీకే చాన్స్ ఇవ్వాలనుకుంటే మాత్రమే జగన్ కి అసెంబ్లీలో ఎక్కువగా అవకాశాలు లభిస్తాయి. ఒక మొత్తం టీడీపీ కూటమితో నిండిన అసెంబ్లీని జగన్ ఎలా ఫేస్ చేస్తారు అన్నది చూడాల్సి ఉంది.

Tags:    

Similar News