ఇప్పుడు జగన్‌ను వాళ్లు మాత్రమే కాపాడగలరా...!
అటు పార్లమెంటులో 2019 ఎన్నికల్లో 22 సీట్లు దక్కిం చుకున్న వైసీపీ ఇప్పుడు 4కుపడిపోయింది
ఏపీలో జరిగిన సాధారణ ఎన్నికల్లో వైసీపీ చిత్తుచిత్తుగా ఓడిపోయింది. అటు పార్లమెంటులో 2019 ఎన్నికల్లో 22 సీట్లు దక్కిం చుకున్న వైసీపీ ఇప్పుడు 4కుపడిపోయింది. ఇక, అసెంబ్లీలో 151 సీట్లుద క్కించుకున్న వైసీపీ 11కు దారుణంగా దిగిపోయింది. ఈ పరిణామాలతో అటు పార్లమెంటులోనూ.. ఇటు అసెంబ్లీలోనూ వైసీపీకి వాయిస్ కట్ అయిపోయిందనే చెప్పాలి. అయితే.. వైసీపీ పూర్తిగా ఉనికి కోల్పోతుందా? అంటే లేదనే చెప్పాలి. ఎందుకంటే. 2019 అందించిన విజయం కారణంగా.. ఇప్పుడు వైసీపీ మట్టి కరిచినా.. అటు రాజ్యసభలోను, ఇటు శాసన మండలిలోనూ వైసీపీ పుంజుకుంది.
ఇప్పుడు శాసన మండలిని చూసుకుంటే.. మెజారిటీ అంతా వైసీపీకే ఉంది. మరో రెండు సంవత్సరాల వరకు.. వేరే పార్టీ తరఫున ఎవరూ వచ్చే అవకాశం లేదు. ఇలా చూసుకుంటే.. చంద్రబాబు సర్కారును అసెంబ్లీలో ఇరుకున పెట్టే ప్రయత్నం చేయలేక పోయినా.. చేయకపోయినా.. మండలిలో మాత్రం అడుగడుగునా.. వైసీపీ అడ్డుకునే అవకాశం ఉంది. దీంతో టీడీపీకి వచ్చే రెండేళ్ల పాటు ప్రతి బిల్లు విషయంలోనూ వైసీపీ నుంచి మండలిలో ఎదురీత తప్పదు. దీంతో చంద్రబాబు నిర్ణయాలకు మండలిలో బ్రేకులు పడే అవకాశం ఉన్నా ఆశ్చర్యంలేదని అంటున్నారు పరిశీలకులు.
గతంలో వైసీపీ తీసుకున్న నిర్ణయాలను కూడా.. టీడీపీ ఇలానే మండలిలో అడ్డుకున్న విషయం తెలిసిందే. అంటే.. ఒకరకంగా రాష్ట్ర స్తాయిలో పెద్దల సభలో వైసీపీకి మెజారిటీ ఉండడం కలిసి వస్తున్న పరిణామం. అయితే.. ఇక్కడ కూడా ఎదురు దాడి చేస్తే.. ప్రజా సమస్యలపై నిజమైన వాదన వినిపించకపోతే... ప్రజల్లో మరింతగా పార్టీ ఇబ్బందులు పడే అవకాశం ఉంది. ఇక, పార్లమెంటు విషయాన్ని పరిశీలిస్తే.. లోక్‌సభలో కేవలం నలుగురు మాత్రమే వైసీపీకి దక్కారు. దీంతో అక్కడ పెద్దగా గళం వినిపించే పరిస్థితి లేక పోవచ్చు. కానీ, రాజ్యసభ విషయంలో అలాకాదు.
రాష్ట్రం నుంచి వైసీపీకి మాత్రమే రాజ్యసభలో ప్రాతినిధ్యం ఉంది. ఏకంగా 11 మంది సభ్యులు వైసీపీకి ఉన్నారు. ఇదేమీ చిన్న సంఖ్య కాదు. సో.. ఇలా చూసుకున్నా.. పార్లమెంటులో వైసీపీకి బలమైన గళం ఉన్నట్టుగానే లెక్కించుకోవాలి. ఇదే విషయాన్ని వైసీపీ కూడా గుర్తు చేస్తోంది. రాజ్యసభలో తమకు ఉన్న ప్రాధాన్యం మరిచిపోవద్దని కూడా సునిశిత హెచ్చరికలు జారీ చేస్తోంది. అంటే.. లోక్‌సభలో భారీ ఎత్తున బలం లేకపోయినా.. పెద్దల సభలో వైసీపీకి ఉన్న మెజారిటీ కారణంగా.. ఈ పార్టీ జాతీయ స్థాయిలో తన హవాను కొనసాగించేందుకు అవకాశం ఉంది. అంటే.. మొత్తంగా వైసీపీకి పెద్దల దన్ను ఇప్పుడు కీలకంగా మారింది.