జగన్ ఫైర్... "ఇంతకన్నా నిస్సిగ్గుతనం ఏముంటుంది చంద్రబాబు?"
అనంతపురం జిల్లా తాడిపత్రిలో మరోసారి టెన్షన్ వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే.
అనంతపురం జిల్లా తాడిపత్రిలో మరోసారి టెన్షన్ వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే. రెండు రోజుల క్రితం వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తన ఇంటికి సుమారు మూడు నెలల తర్వాత రావడం.. ఆ సమయంలో వైసీపీ నేత ఒకరు తుపాకీ చూపి రెచ్చగొట్టారని టీడీపీ నేతలు ఆరోపించడం.. అతని ఇంటిపై దాడి చేసి, నిప్పు పెట్టడం తెలిసిందే.
దీంతో... పోలీసులు రంగప్రవేశం చేసి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా స్పందించిన మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి... తన హత్యకు జేసీ ప్రభాకర్ రెడ్డి ప్లాన్ చేస్తున్నారని.. అందుకే ఈ దాడికి పాల్పడ్డారని.. తన అన్న కేతిరెడ్డి సూర్యప్రతాప రెడ్డిని చంపింది జేసీ ప్రభాకర్ రెడ్డే అని సంచలన ఆరోపణలు చేశారు.
ఇదే సమయంలో... జేసీ ప్రభాకర్ రెడ్డి ఎన్ని కుట్రలు చేసినా తాను తాడిపత్రి వెళ్తానని, తాడిపత్రి నుంచే జేసీ అరాచకాలపై ప్రజాస్వామ్య యుతంగా పోరాటాలు చేస్తానని తెలిపారు పెద్దారెడ్డి. ఈ నేపథ్యంలో ఈ వ్యవహారంపై మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ స్పందించారు. ఈ సందర్భంగా ఘాటు వ్యాఖ్యలు చేశారు.
అవును... రెండు రోజుల క్రితం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తన నియోజకవర్గం తాడిపత్రికి వెళ్లిన సమయంలో జరిగిన వ్యవహారం, తదనంతర పరిణామాలు, ఆ ఘటన జరగడానికి గల కారణాలు మొదలైన విషయాలపై జగన్ స్పందించారు. ఈ సందర్భంగా తన "ఎక్స్" ఖాతాలో ఓ సందేశం పోస్ట్ చేశారు.
ఈ సందర్భంగా... "ఎస్పీకి సమాచారం ఇచ్చి వెళ్లినా కూడా టీడీపీ మూకలు అడ్డుకున్నాయని మొదలుపెట్టిన జగన్... ఆ మూకలు వైసీపీ నాయకుడి ఇంటిని తగులబెట్టాయని, వాహనాలు ధ్వంసం చేశాయని అన్నారు. కిందిస్థాయిలో ఇన్ని దారుణాలు జరుగుతుంటే.. నేరం చేయాలంటేనే భయపడాలంటూ పైన ఉన్న చంద్రబాబు కబుర్లు చెబుతున్నారని ఎద్దేవా చేశారు.
ఈ నేపథ్యంలోనే... ఇంతకన్నా నిస్సిగ్గుతనం ఏముటుంది అంటూ చంద్రబాబుని వైఎస్ జగన్ ప్రశ్నించారు. ఈ ట్వీట్ కి... "నేరం చేయాలంటే భయపడాలి" అనే శీర్షికతో.. "రాజకీయ ముసుగులో అరాచకాలు చేస్తే కఠిన చర్యలు" అనే ఉపశీర్షికతో చంద్రబాబు స్టేట్ మెంట్ తో ఉన్న పేపర్ కటింగ్ ను జతచేశారు.