పోలింగ్ రోజు.. ఆ 6 గంటలు జగన్ ఏం చేశారు?
ఏపీలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ జరిగిన సోమవారం నాడు.. ప్రధాన పార్టీల అధినేతలు ఏం చేశారనేది ఆసక్తికర చర్చగా మారింది.
ఏపీలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ జరిగిన సోమవారం నాడు.. ప్రధాన పార్టీల అధినేతలు ఏం చేశారనేది ఆసక్తికర చర్చగా మారింది. ముఖ్యంగా రాష్ట్ర ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్న జగన్ ఏం చేశారు? ఒకవైపు.. దాడులు.. విధ్వంసాలు జరుగుతుండడం.. భారీ ఎత్తున క్యూలైన్లలో మహిళలు, వృద్ధులు కూడా బారు లు తీరిన నేపథ్యంలో ముఖ్యమంత్రిగా ఆయన బాధ్యత ఏంటి? అనేది కూడా చర్చకు వస్తోంది. ఇక, ఈ విషయంలో టీడీపీ అధినేత చంద్రబాబు తన బాధ్యతను నెరవేర్చారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.
ఉదయం ఉండవల్లిలో ఓటేసిన చంద్రబాబు.. అనంతరం.. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న పోలింగ్ సరళి ని గమనించారు. పోలింగ్ కేంద్రాల్లో లోటుపాట్లను కూడా గుర్తించారు. తన ఇంటి నుంచి వీటిని వివిధ మార్గాల్లో ఆయన పరిశీలించారు. అనంతరం.. ప్రజలకు, ఎన్నికల సంఘానికి కూడా కొన్ని సూచనలు చేశారు చంద్రబాబు. పొద్దున నుంచి రాత్రి వరకు కూడా ఆయన పార్టీ ఆఫీసు నుంచి ఇంటి నుంచి కూడా ఎన్నికల ప్రక్రియను గమనించారు.
ఇక, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా.. ఉదయం మంగళగిరిలో ఓటేసిన తర్వాత.. పిఠాపురం ఎన్నికల ప్రక్రియను పరిశీలించారు. కొన్ని సూచనలు, సలహాలు కూడా ఇచ్చారు. మరి ఎటొచ్చీ.. సీఎం జగన్ ఏం చేసినట్టు? అనేది ప్రశ్నగా మారింది. ఆయన ఉదయం 8 గంటల సమయంలోనే సొంత జిల్లా కడపలోని భాకారాపురంలో ఓటేశారు. అనంతరం.. తాడేపల్లికి చేరుకున్నారు. ఇక, ఆ తర్వాత.. ఆయనకు ప్రజలకు, మీడియాకు మధ్య ఎలాంటి కనెక్షన్ లేకుండా పోయింది.
మరి ఆ ఆరు గంటల్లో అంటే.. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు సీఎం జగన్ ఏం చేశారు? ఇంట్లోనే ఉండి అయినా.. ఆయన ఎన్నికలను పరిశీలించారా? అంటే అది లేదు. పోనీ.. పోలింగ్ ప్రక్రియ కు సంబంధించి ఎలాంటి సూచనలు, సలహాలైనా పంచుకున్నారా? అంటే అది కూడా లేదు. అసలు ఉదయం ఓటేసిన తర్వాత.. ఇక, జగన్ ఎక్కడా కనిపించలేదు. ఒకవైపు పల్నాడు, గుంటూరు, తెనాలి తదితర ప్రాంతాల్లో ఘర్షనలు చోటు చేసుకున్నాయి.
అయినా.. జగన్ స్పందించలేదు. కనీసం.. ఓటర్లకు పిలుపు కూడా ఇవ్వలేదు. దీంతో ఆ ఆరు గంటలు జగన్ ఏం చేశారనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. చివరకు.. సలహాదారుల సజ్జలే మీడియా ముందు వచ్చి.. ట్రెండుపై మాట్లాడారు. కొందరు చెబుతున్న దాని ప్రకారం.. సీఎం జగన్‌పై ఉన్న అక్రమ ఆస్తుల కేసులకు సంబంధించిన విచారణ ఈ నెల 15న కోర్టులో విచారణకు రానుంది. ఈ నేపథ్యంలో ఆయన ఆ విషయంపై న్యాయవాదులతో మాట్లాడడంలో తీరిక లేకుండా ఉన్నారని సమాచారం.