జమిలి బిల్లు సారాంశం ఏంటి? ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చే వీలు?

ఈ బిల్లు చట్టంగా మారిన తర్వాత జమిలి ఎన్నికలు దేశంలో తొలిసారి ఎప్పుడు జరిగే అవకాశం ఉందన్న దానిపై క్లారిటీ వచ్చే వీలుంది.

Update: 2024-12-18 07:00 GMT

ఒక దేశం.. ఒక ఎన్నికల పేరుతో దేశ వ్యాప్తంగా లోక్ సభ ఎన్నికలు.. అన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి జరగటం.. అవి పూర్తైన మూడు నెలల వ్యవధిలో దేశ వ్యాప్తంగా అన్ని స్థానిక సంస్థలకు జరగాల్సిన ఎన్నికలను పూర్తి చేసే ఉద్దేశంతో తీసుకొస్తున్న బిల్లే జమిలి. ఈ విధానం అమల్లోకి వచ్చే.. ప్రతి ఏడాది ఏదో ఒక ఎన్నికల రచ్చ.. వాటి ఫలితాల ఆధారంగా రాజకీయ పరిణామాలు.. ఇవన్నీ పాలనా రథాల వేగాన్ని తగ్గించేలా చేస్తున్న పరిస్థితి. అందుకు భిన్నంగా జమిలిని తీసుకొస్తే.. పాలనా వేగం పెరుగుతుందా? అంటే.. పెరుగుతుందనే చెప్పాలి. కాకపోతే.. వాటి కుండే కష్టాలు.. నష్టాలు ఉన్నాయి.

మొత్తంగా చూస్తే ఖర్చు పరంగా.. పాలనా పరంగా జమిలి బిల్లు చట్టంగా మారటం దేశానికి ఆరోగ్యకరమనే వాదనను పలువురు వ్యక్తం చేస్తున్నారు. ఈ బిల్లును పార్లమెంటులో ప్రవేశ పెట్టటానికి ముందు కేంద్ర మంత్రి వర్గం ఆమోద ముద్ర వేయటం తెలిసిందే. ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న జమిలి బిల్లును డిసెంబరు 17న పార్లమెంటు ముంగిట్లోకి వచ్చింది. దీంతో.. భారత ప్రజాస్వామ్యంలో ఒక కొత్త అధ్యాయానికి తెర లేచినట్లుగా చెప్పాలి.

ఈ బిల్లును చట్టంగా మార్చే క్రమంలో 129వ రాజ్యాంగ సవరణ బిల్లును కేంద్రం లోక్ సభలో ప్రవేశ పెట్టింది. ఓటింగ్ ప్రక్రియ ద్వారా కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్ వాల్ ఈ బిల్లును సభ ముందుకు తీసుకొచ్చారు. 30 నిమిషాల చర్చ తర్వాత ఓటింగ్ జరగ్గా.. బిల్లును ప్రవేశ పెట్టేందుకు అనుకూలంగా 269 మంది ఓటు వేయగా.. 198 మంది వ్యతిరేకంగా ఓటు వేశారు. దీంతో.. బిల్లు సభలో ప్రవేశ పెట్టేందుకు అనుమతిస్తూ లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా ఆమోద ముద్ర వేశారు. ఈ బిల్లును ప్రతిపక్షాలు ముఖ్యంగా కాంగ్రెస్.. దాని మిత్రపక్షాలు వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. రాజ్యాంగ మూల స్వరూపాన్ని మార్చేలా ఈ బిల్లు ఉందన్న వాదనను బీజేపీ కూటమి సర్కారు నో చెబుతోంది. అలాంటి పని తాము చేయట్లేదని స్పష్టం చేస్తోంది.

సభలో ప్రవేశ పెట్టిన ఈ బిల్లు సారాంశం ఏమిటి? ఒకవేళ ఈ బిల్లు ఉభయసభల ఆమోద ముద్ర పడిన తర్వాత.. అమల్లోకి రావటానికి ఎంత కాలం పడుతుంది? లాంటి అంశాల్ని చూస్తే ఆసక్తికర అంశాలు కనిపిస్తాయి. ఇప్పటికే వెలువడిన ఊహాగానాల్ని చూస్తే.. 2029 లోపే దేశ వ్యాప్తంగా జమిలి ఎన్నికలకు వెళ్లటం ఖాయమన్న అంచాల్లో అర్థం లేదన్న విషయం బిల్లును చూస్తే అర్థమవుతుంది.

బిల్లు సారాంశాన్నిక్లుప్తంగా చూస్తే. ఈ బిల్లు ఏం చెబుతోంది? ఉభయ సభల ఆమోదం.. రాష్ట్రపతి సంతకం చేసిన తర్వాత ఏం జరుగుతుంది? లాంటి అంశాల్లోకి వెళితే.. ఈ బిల్లు చట్టంగా మారిన తర్వాత జమిలి ఎన్నికలు దేశంలో తొలిసారి ఎప్పుడు జరిగే అవకాశం ఉందన్న దానిపై క్లారిటీ వచ్చే వీలుంది. బిల్లు సారాంశాన్ని పరిగణలోకి తీసుకుంటే జమిలి ఎన్నికలు దేశంలో 2034 నుంచి జరిగే వీలుందని చెప్పాలి.

129వ రాజ్యాంగ సవరణ బిల్లు చట్టరూపం సంతరించుకున్న తర్వాత జరిగే సాధారణ ఎన్నికల అనంతరం ఏర్పడే లోక్ సభ తొలి సిటింగ్ డేకు రాష్ట్రపతి నోటిఫికేషన్ జారీ చేస్తారు. అపాయింటెడ్ డేగా పిలిచే ఆ రోజు తర్వాత ఏర్పడిన అన్ని అసెంబ్లీలూ.. లోక్ సభ కాలపరిమితితో పాటు ముగుస్తాయి. ఆ తర్వాత నుంచి లోక్ సభ.. అసెంబ్లీ ఎన్నికలన్నీ ఏక కాలంలో జరుగుతాయి. లోక్ సభ కానీ అసెంబ్లీ కానీ పూర్తి కాలం ముగియక ముందే రద్దు అయితే.. వాటికి 5 ఏళ్ల కాలంలో మిగిలిన సమయానికే ఎన్నికలు జరుగుతాయని బిల్లు పేర్కొంది. అందువల్ల జమిలి విధానం 2029 సార్వత్రిక ఎన్నికల తర్వాతే ఆచరణలోకి వస్తుంది.

మరింత వివరంగా చెప్పాలంటే.. 2029 మేలో సార్వత్రిక ఎన్నికల అనంతరం ఏర్పడే 19వ లోక్ సభ మొదటి సిటింగ్ తేదీని రాష్ట్రపతి జూన్ 1గా నిర్దారిస్తే.. ఆ తర్వాత ఏర్పడే అసెంబ్లీలన్నీ.. ఆ లోక్ సభ తో పాటు ముగుస్తాయి. దీంతో.. ఏపీ.. ఒడిశా.. అరుణాచల్ ప్రదేశ్.. సిక్కిం అసెంబ్లీ ఎన్నికలకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఎందుకంటే.. ఈ రాష్ట్రాల్లో 2004 నుంచి ఇప్పటివరకు లోక్ సభతో పాటే అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. నిజానికి విభజన తర్వాత కూడా తెలంగాణ కూడా ఆ బాటలోనే నడిచింది. అయితే.. తెలంగాణ తొలి ప్రభుత్వం ఐదేళ్లు పూర్తి కాక ముందే ఎన్నికలకు వెళ్లటం ద్వారా.. ఆర్నెల్లు ముందుగా జరుగుతున్న పరిస్థితి.

రాబోయే రోజుల్లో తెలంగాణ.. రాజస్థాన్.. మధ్యప్రదేశ్.. ఛత్తీస్ గఢ్ లకు తదుపరి అసెంబ్లీ ఎన్నికల 2028 నవంబరు - డిసెంబరులో జరుగుతాయి. మామూలుగా అయితే ఐదేళ్లు మనుగడలో ఉండి.. ఆ వెంటనే ఎన్నికలకు వెళ్లాల్సి ఉంటుంది. కానీ.. అందుకు భిన్నంగా ప్రభుత్వ పదవీ కాలం ముగిసిన తర్వాత.. అందరితో కలిసి వెళ్లేందుకు వీలుగా.. రాష్ట్రపతి పాలనను విధించే వీలుంది.

అదే సమయంలో 2028 మే.. జూన్ లలో జరిగే కర్ణాటక.. త్రిపుర.. మేఘాలయ.. నాగాలాండ్ లాంటి రాష్ట్రాల అసెంబ్లీలు 2033 మే.. జూన్ లో ముగుస్తాయి. 2034తో జరిగే లోక్ సభ ఎన్నికలకు దాదాపు ఏడాది సమయం ఉంటుంది. దీంతో.. జమిలిలో భాగంగా ఎన్నికల్ని నిర్వహించేందుకు ఏడాది పాటు రాష్ట్రపతి పాలనలో ఉంచాల్సి ఉంటుంది.ఇలా.. ముందు జరిగే వాటిని వెయిట్ చేయించటం.. తర్వాత జరిగే వాటి గడువును కుదించటం ద్వారా.. అన్ని రాష్ట్రాల ఎన్నికల్ని ఒకేసారి జరిపేలా ప్లానింగ్ ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. బిల్లు ఆమోదం పొందే నాటికి వీటికి సంబంధించి ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటాయో తేలాలంటే వెయిట్ చేయక తప్పదు.

Tags:    

Similar News