ఎవరూ మాట్లాడొద్దు.. డిప్యూటీ సీఎంపై జనసేన హుకుం

కూటమిలో చిచ్చు రేపుతున్న డిప్యూటీ సీఎం ఇష్యూపై జనసేన కూడా స్పందించింది.

Update: 2025-01-21 13:30 GMT

కూటమిలో చిచ్చు రేపుతున్న డిప్యూటీ సీఎం ఇష్యూపై జనసేన కూడా స్పందించింది. ఇదే అంశంపై ఎవరూ మాట్లాడొద్దంటూ సోమవారం సీఎం చంద్రబాబు టీడీపీ నేతలను ఆదేశించగా, మంగళవారం జనసేన కూడా అవే తరహా ఆదేశాలిచ్చింది. దీంతో డిప్యూటీ సీఎం ఇష్యూ సమసిపోయినట్లేనని అంటున్నారు.

టీడీపీ యువనేత, ఐటీ, హెచ్ఆర్డీ మంత్రి నారా లోకేశ్ ను డిప్యూటీ సీఎం చేయాలంటూ నాలుగు రోజులుగా టీడీపీ నేతలు డిమాండ్ చేస్తూ ప్రకటనలు గుప్పిస్తున్నారు. తొలుత పొలిట్ బ్యూరో సభ్యుడు, కడప నేత రెడ్డప్పగారి శ్రీనివాసరెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబు ఎదుటే ఈ ప్రస్తావన తెచ్చారు. అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు మౌనం దాల్చడంతో టీడీపీ నేతలు ఒక్కొక్కరుగా ప్రకటనలు గుప్పించడం మొదలుపెట్టారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కోసం సీటు త్యాగం చేసిన పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ కూడా లోకేశ్ కు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలని కోరారు. ఆ తర్వాత ఒక్కొక్కరుగా ఈ డిమాండ్ చేస్తుండటంతో జనసేన నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు.

ఏపీలో డిప్యూటీ సీఎంగా పవన్ ఒక్కరే ఉండాలని జనసేన కోరుకుంటోంది. లోకేశ్ డిప్యూటీ సీఎం అయితే పవన్ కు ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని తిరుపతికి చెందిన జనసేన నేత కిరణ్ రాయల్ డిమాండ్ చేయడం చర్చనీయాంశమైంది. ఇలా రెండు పార్టీల వారు ఎవరికి వారు, తమకు నచ్చినట్లు ప్రకటలు చేస్తుండటం తప్పుడు సంకేతాలిస్తోందని ఇరుపార్టీ అధిష్టానాలు భావించాయి. ముందుగా ఈ విషయాన్ని ఇక్కడితో వదిలిపెట్టాలని సోమవారం పార్టీ నేతలకు సీఎం చంద్రబాబు సూచించారు. ఈ క్రమంలోనే జనసేన కూడా తమ నేతలకు సూచనలు జారీ చేసింది. ఇంతటి ఈ వివాదానికి ముగింపు పలకాలని పిలుపునిచ్చింది. దీంతో కూటమి మధ్య చిచ్చు రేపిన డిప్యూటీ సీఎం వివాదం టీ కప్పులో తుఫాన్ లా సమసిపోయింది.

Tags:    

Similar News