పవన్ కి షాక్ ఇచ్చిన జనసేన నేత...!
విజయవాడ పశ్చిమ సీటు విషయంలో జనసేన నాయకుడు పోతిన మహేష్ ఎంతలా ప్రయత్నం చేశారో అందరికీ తెలిసిందే.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి అత్యంత సన్నిహితులుగా పార్టీలో ఉన్న వారు ఇపుడు ఎదురు తిరుగుతున్నారు. తమకు టికెట్ కి హామీ లేదని, ఉన్న సీటుని పొత్తులో ఇచ్చేస్తే ఎలా అని మధనపడుతున్నారు. ఇదే విషయంలో తాము ఎందాకైనా అని అంటున్నారు. విజయవాడ పశ్చిమ సీటు విషయంలో జనసేన నాయకుడు పోతిన మహేష్ ఎంతలా ప్రయత్నం చేశారో అందరికీ తెలిసిందే.
ఆయన పేరు గత అయిదేళ్లుగా మారుమోగిపోయింది. వైసీపీ ప్రభుత్వాన్ని ప్రతీ దానికీ ప్రశ్నిస్తూ ఆయన అనేక పోరాటాలు చేశారు. రాజధాని నగరంగా పేరున్న విజయవాడలో ఆయన రాజకీయాన్ని వేడెక్కించి విపక్ష శిబిరంలో కీలకంగా మారారు. పోతిన మహేష్ కి టికెట్ ఖాయమని అంతా అనుకున్నారు. అది నిజమే అన్నట్లుగా మొదట ఆయనకే టికెట్ ఇచ్చారు.
ఎపుడైతే పొత్తులో బీజేపీ ఎంటర్ అయిందో ఆ పార్టీకి విజయవాడ పశ్చిమని కేటాయించేశారు. దాంతో పోతిన మహేష్ ఆయన అనుచరులు ఆందోళన చెందుతూనే ఉన్నారు. కచ్చితంగా గెలిచే సీటుని వదులుకోరాదని వారు అధినాయకత్వాన్ని కోరారు.
విజయవాడలో పార్టీని బలోపేతం చేస్తూ వచ్చామని క్యాడర్ ఆశలను నీరుకార్చవద్దని పోతిన మహేష్ అనేక సార్లు కోరారు. ఇక ఇటీవల చిలకలూరిపేట సభకు కూడా విజయవాడ పశ్చిమ నుంచి జనసేన క్యాడర్ వెళ్లకుండా నిరసన తెలిపింది. ఒక్క మహేష్ మాత్రమే ఆ సభకు వెళ్లారు
ఇవన్నీ ఇలా ఉంటే తనకు సీటు విషయంలో పవన్ కళ్యాణ్ ని కలసిన మహేష్ కి నిరాశే ఎదురైంది అని అంటున్నారు. ఈ సీటు విషయంలో బీజేపీకి ఇచ్చేశామని పవన్ పోతిన మహేష్ కి తేల్చి చెప్పారని అంటున్నారు. అందువల్ల సీటు ఇచ్చేది లేదని కూడా ఆయన స్పష్టం చేశారు అని అంటున్నారు.
పొత్తులో భాగంగా త్యాగాలు చేయాల్సిందే అని పవన్ పోతిన మహేష్ కి చెప్పడం జరిగిందని కూడా అంటున్నారు. పార్టీ కోసం ఎంతో కష్టపడిన తనకు ఎట్టి పరిస్థితుల్లోనూ న్యాయం చేయాల్సిందే అని మహేష్ పవన్ ముందు పట్టుబట్టారని అంటున్నారు. అయితే పవన్ అది మాత్రం కుదరదని స్పష్టంగా చెప్పేయడంతో ఇక రెబెల్ గానే తాను పోటీ చేస్తాను అని పోతిన మహేష్ నిర్ణయించుకున్నారని అంటున్నారు.
ఆయన ఇదే విషయం పవన్ కి కూడా చెప్పారని అంటున్నారు. దాంతో విజయవాడ పశ్చిన కూటమిలో ఇపుడు కొత్త మంటలు రేగుతున్నాయి. పోతిన మహేష్ బీసీ నేత. కీలకమైన నాయకుడు. ఆయన కనుక రెబెల్ గా బరిలో ఉంటే పోటీ కాస్తా వైసీపీ పోతిన మహేష్ మధ్యన జరిగే అవకాశం ఉందని అది చివరికి కూటమిని తీవ్ర నష్టంగా మారవచ్చు అంటున్నారు.