ఆయనది దైవాజ్ఞ.. టికెట్ రాకపోవడంపై మహిళా ఎమ్మెల్యే కీలక వ్యాఖ్యలు!
ఆంధ్రప్రదేశ్ లో వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే నాలుగో విడత అభ్యర్థుల జాబితాను వైసీపీ అధిష్టానం విడుదల చేసిన సంగతి తెలిసిందే
ఆంధ్రప్రదేశ్ లో వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే నాలుగో విడత అభ్యర్థుల జాబితాను వైసీపీ అధిష్టానం విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇందులో కూడా పలువురు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీట్లు దక్కలేదు. మొత్తం 8 అసెంబ్లీ స్థానాలకు , ఒక పార్లమెంటు స్థానానికి అభ్యర్థులను ప్రకటించారు. ఇందులో చాలామంది సిట్టింగుల స్థానాలు గల్లంతయ్యాయి. వీరిలో కొద్ది రోజుల క్రితం ఫేస్ బుక్ లైవ్ వీడియోతో సంచలనం రేపిన జొన్నలగడ్డ పద్మావతి కూడా ఉన్నారు.
ప్రస్తుతం జొన్నలగడ్డ పద్మావతి అనంతపురం జిల్లా శింగనమల ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆమె భర్త ఆలూరి సాంబశివారెడ్డి ప్రభుత్వ విద్యా శాఖ సలహాదారుగా ఉన్నారు. అయినప్పటికీ పద్మావతికి సీటు దక్కలేదు. శింగనమల స్థానాన్ని వీరాంజనేయులకు కేటాయించారు.
ఈ నేపథ్యంలో తనకు టికెట్ దక్కకపోవడంపై పద్మావతి సంచలన వ్యాఖ్యలు చేశారు, సామాజిక సమీకరణల్లో భాగంగానే వీరాంజనేయులును పార్టీ నాయకత్వం ఇంచార్జిగా నియమించిందని తెలిపారు. వైఎస్ జగన్ ఆదేశాన్ని దైవాజ్ఞగా భావిస్తున్నానని చెప్పారు. ఆయనను దాదాపు దశాబ్ద కాలంగా దగ్గరగా పరిశీలించానని వెల్లడించారు.
ఎన్ని కష్టనష్టాలకు ఓర్చి అయినా బడుగు, బలహీన వర్గాలకు న్యాయం చేయాలన్నదే వైఎస్ జగన్ తపన అని పద్మావతి తెలిపారు. అంతే అంకితభావంతో ఆయన సామాజిక న్యాయం చేస్తున్నారని వెల్లడించారు. మెజారిటీ వర్గానికి ప్రాతినిధ్యం కల్పించాలనే జగన్ భావజాలానికి కట్టుబడి ఉన్నానన్నారు. ఆయన మాట దైవాజ్ఞగా భావిస్తున్నానని తెలిపారు. కొత్త ఇంచార్జిగా ప్రకటించిన వీరాంజనేయులుకు సంపూర్ణ సహకారాలు అందిస్తామని తెలిపారు. శింగనమల నియోజకవర్గ అభివృద్ధితోపాటు జగన్ ను మళ్లీ ముఖ్యమంత్రిని చేసుకోవడమే తమ లక్ష్యమని వెల్లడించారు.
కాగా జేఎన్‌టీయూ అనంతపురం నుంచి ఎంటెక్ చేసిన జొన్నలగడ్డ పద్మావతి 2014లో తొలిసారి శింగనమల నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఆ ఎన్నికల్లో ఆమె టీడీపీ అభ్యర్థి యామినీ బాల చేతిలో ఓటమి పాలయ్యారు. ఇక 2019లో టీడీపీ అభ్యర్థి బండారు శ్రావణి శ్రీపై పద్మావతి గెలుపొందారు.
ఇటీవల ఫేస్ బుక్ లైవ్ వీడియోలో పద్మావతి చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. తన నియోజకవర్గానికి నీరు రాకుండా అడ్డుకుంటున్నారని.. చిన్నపనికి కూడా ముఖ్యమంత్రి కార్యాలయాన్ని సంప్రదించాల్సి వస్తోందని చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. ఈ నేపథ్యంలోనే ఆమెకు సీటు రాలేదనే చర్చ జరుగుతోంది.