కవితకున్న ఆరోగ్య సమస్య ఏంటి? వైద్యులు ఏం చెప్పారు?

ఇదంతా ఒక ఎత్తు అయితే చూస్తుండగానే అరెస్టు జరిగి నెలలు గడిచిపోయి.. ఆర్నెల్లు దాటేసిన పరిస్థితి

Update: 2024-07-17 04:40 GMT

ఏ మాటకు ఆ మాట చెప్పాలి. తెలంగాణ రాష్ట్రానికి తిరుగులేని ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉన్న వేళలో.. ఆయన కుమార్తె కవితను ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ అధికారులు అరెస్టు చేసి ఢిల్లీకి తీసుకెళ్లిన రోజున కూడా అంత పెద్ద వ్యతిరేకత వ్యక్తం కాలేదు. సాధారణంగా నేత ఎవరైనా సరే.. అరెస్టు వరకు విషయం వెళ్లినంతనే అంతో ఇంతో సానుభూతి వ్యక్తమయ్యే పరిస్థితి. అందుకు భిన్నంగా కవిత అరెస్టు వేళ ఉన్న పరిస్థితిని చూసి చాలామంది గులాబీ నేతలు షాక్ తిన్న పరిస్థితి. అరెస్టు కారణంగా పెల్లుబుకాల్సిన సానుభూతి రాకపోవటం.. ఆ తర్వాత జరిగిన ఎన్నికల వేళలోనూ కవిత అరెస్టు వ్యవహారం ప్రజల్లో పెద్దగా చర్చ జరగకపోవటం తెలిసిందే.

ఇదంతా ఒక ఎత్తు అయితే చూస్తుండగానే అరెస్టు జరిగి నెలలు గడిచిపోయి.. ఆర్నెల్లు దాటేసిన పరిస్థితి. ఇలాంటి వేళలో చోటు చేసుకున్న అనూహ్య పరిణామం కొత్త పరిస్థితికి కారణమవుతుందన్న మాట వినిపిస్తోంది. తాజాగా తీహార్ జైల్లో ఉన్న ఆమె.. తీవ్ర అనారోగ్యానికి గురి కావటం.. వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించటం తెలిసిందే. ఈ వార్త తెలంగాణ వ్యాప్తంగా క్షణాల్లో పాకిపోవటమే కాదు.. గతానికి భిన్నమైన వాతావరణం చోటు చేసుకుందంటున్నారు.

కవిత అరెస్టు వేళ రాని స్పందన.. ఆమె అనారోగ్యానికి గురై.. జైల్లో స్ప్రహ తప్పి పడిందన్న వార్తకు మాత్రం తెలంగాణ ప్రజల్లో కదలిక వచ్చిందంటున్నారు. ఆమె గురించి మాట్లాడుకోవటంతో పాటు.. ఆమె అనారోగ్యం.. ప్రస్తుత పరిస్థితిపై సానుభూతి వ్యక్తం అవుతుందన్న మాట వినిపిస్తోంది. అంతేకాదు.. అసలు ఆమె ఎదుర్కొంటున్న అనారోగ్యం ఏమిటి? దాని తీవ్రత ఎంత? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది.

తాజాగా ఆమెకు ట్రీట్ మెంట్ ఇచ్చిన వైద్యులు కవిత ఆరోగ్య సమస్యల మీద ప్రకటన చేశారు. జైల్లో ఉన్న కవిత జ్వరానికి గురయ్యారని.. ఆమె నీరసంతో స్ప్రహ తప్పినట్లుగా పేర్కొన్నారు. దీంతో ఆమెను ఆసుపత్రికి తరలించారు. అక్కడ రెండు గంటల పాటు ట్రీట్ మెంట్ చేసిన వైద్యులు.. ఆమె పరిస్థితి నిలకడగా ఉందని.. ఆమెను జైలుకు తీసుకెళ్లొచ్చని చెప్పటంతో అక్కడి నుంచి మళ్లీ జైలుకు తీసుకెళ్లారు. జ్వరం కారణంగా చోటు చేసుకున్న నీరసంతోనే ఆమె కళ్లు తిరిగి పడిపోయినట్లుగా వైద్యులు చెబుతున్నారు. తాజా అనారోగ్య సమస్యల నేపథ్యంలో ఆమెకు బెయిల్ ఇవ్వాలని ఆమె కుటుంబ సభ్యులు కోర్టును ఆశ్రయించే వీలుందన్న మాట వినిపిస్తోంది. ఏమైనా.. అరెస్టు వేళ కానరాని సానుభూతి.. తాజా ఉదంతంతో మాత్రం వచ్చిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Tags:    

Similar News