రెండో డిబేట్ కు కమలా రెఢీ.. ట్రంప్ రియాక్షన్ ఏంటి?

రెండో డిబేట్ కోసం తనను ఆహ్వానించిన సీఎన్ఎన్ ఆహ్వానానికి ఓకే చెప్పినట్లుగా కమలా హారిస్ ట్వీట్ చేశారు. అక్టోబరు 23న ట్రంప్ తనతో చర్చకు వస్తారని ఆశిస్తున్నట్లు తెలిపారు.

Update: 2024-09-22 05:30 GMT

మరో మహా డిబేట్ కు రంగం సిద్ధమవుతోంది. అమెరికా అధ్యక్ష ఎన్నికల వేళ.. బరిలో నిలిచిన ఇద్దరు అభ్యర్థుల మధ్య రెండు డిబేట్లు జరగటం.. దానికి ఉండే ప్రాధాన్యత.. ఎన్నికల ఫలితాల మీద చూపే ప్రభావం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికే ఒక డిబేట్ పూర్తి కావటం.. రిపబ్లికన్ అభ్యర్థి ట్రంప్ కంటే డెమొక్రాట్ల అభ్యర్థి కమలా హారిస్ అధిక్యతను ప్రదర్శించటం తెలిసిందే. కమలా హారిస్ తో మొదటి డిబేట్ పూర్తి తర్వాత.. తాను మరోసారి డిబేట్ లో పాల్గొనేది లేదంటూ ట్రంప్ వ్యాఖ్యానించారు.

అధ్యక్ష ఎన్నికల బరిలో నిలిచిన ఇద్దరు అభ్యర్థుల మధ్య రెండో డిబేట్ కోసం సీఎన్ఎన్ చానల్ తాజాగా ఆహ్వానాన్ని పంపింది. దీనికి హారిస్ ఓకే చేశారు. ట్రంప్ తో వేదిక పంచుకోవటానికి తాను సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటనను హారిస్ ప్రచార టీం సారథి ఒమాలి డిల్లాన్ ఒక ప్రకటనలో వెల్లడించారు. అక్టోబరు 23న రెండో డిబేట్ కు సిద్దం కావాలని హారిస్ ను సీఎన్ఎన్ కోరింది.

రెండో డిబేట్ కోసం తనను ఆహ్వానించిన సీఎన్ఎన్ ఆహ్వానానికి ఓకే చెప్పినట్లుగా కమలా హారిస్ ట్వీట్ చేశారు. అక్టోబరు 23న ట్రంప్ తనతో చర్చకు వస్తారని ఆశిస్తున్నట్లు తెలిపారు. దీంతో.. రెండో డిబేట్ మీద ట్రంప్ రియాక్షన్ ఏమిటి? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. అమెరికా అధ్యక్ష ఎన్నికలు నవంబరు ఐదున జరగనున్న సంగతి తెలిసిందే. కీలక ఎన్నికల పోలింగ్ కు కాస్త ముందుగా జరగనున్న ఈ రెండో డిబేట్ ఎలా జరుగుతుందన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.

ఇదిలా ఉండగా.. అమెరికాలో అధ్యక్ష ఎన్నికల ఓటింగ్ మొదలైంది. పోలింగ్ తేదీకి గడువు చాలానే ఉన్నప్పటికీ.. ఎన్నికల ఓటింగ్ ఏమిటన్న సందేహం కలగొచ్చు. దీనికి సమాధానం ముందస్తు ఓటింగ్. మన ఎన్నికల్లో కనిపించని ఒక విధానం అమెరికా అధ్యక్ష.. పార్లమెంటుఎన్నికల్లో ముందస్తు.. గైర్హాజరీ ఓటింగ్ వెసులుబాటు ఉంటుంది. కొన్ని రాష్ట్రాల్లో ఇది తప్పనిసరి కూడా.

అమెరికాలోని రాష్ట్రాలన్నింటిలోనూ ఒకే విధానాలు ఉండని వైనం తెలిసిందే. పన్నులు మొదలుకొని నేరాలకు శిక్షలు వరకు కొన్ని రాష్ట్రాల్లో ఒకలా.. మరికొన్ని రాష్ట్రాల్లో మరోలా ఉండటం తెలిసిందే.

అదే రీతిలో ముందస్తు ఎన్నికల్లోనూ రెండు పద్దతులు ఉన్నాయి. ముందుగా నిర్దేశించిన పోలింగ్ కేంద్రానికి వెళ్లి తామేస్వయంగా ఓటు వేయటం ఒకటైతే.. రెండో విధానంలో పోస్టు ద్వారా తమ ఓటును పంపటం. ఇలా పోస్టులో వచ్చిన ఓట్లను ముందుగానే తెరిచి కొన్నిరాష్ట్రాల్లోని ఎన్నికల అధికారులు వీటిని పరిశీలిస్తారు. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల వ్యవహారం ఈ నెల పదకొండు నుంచి ప్రారంభమైంది. అందుకు అలబామా రాష్ట్రం శ్రీకారం చుడితే.. 19న విస్కాన్సిన్.. 20న మినెసోటాలు మొదలెట్టాయి. టెక్సాస్ లో ఈ ముందస్తు ఎన్నికల ఓటింగ్ మొదలుకానుంది.

గతానికి భిన్నంగా ఈసారి ఎన్నికల్లో అమెరికాలోని 47రాష్ట్రాలు ముందస్తు ఓటింగ్ కు వెసులుబాటు కల్పించాయి. గతంలో ఈ పద్దతి లేని మేరీలాండ్.. ఫ్లోరిడా.. మసాచుసెట్స్.. కనెక్టికట్ లాంటి రాష్ట్రాలు కూడా ఈ విధానానికి ఓకే చెప్పాయి. 2019లో న్యూయార్క్ లో ముందస్తు ఓటింగ్ ను తప్పనిసరి చేశారు. ఈ ఓటింగ్ కు గడువు ఒక్కో రాష్ట్రంలో ఒక్కోలా ఉండటం విశేషం. కొన్నిరాష్ట్రాల్లో 50 రోజుల పాటు ఉంటే.. మరికొన్నిచోట్ల నవంబరు 5కు వారం రోజుల ముందు వరకు వెసులుబాటు కల్పించనున్నారు.

Tags:    

Similar News